నేతన్నల సమస్యలు పరిష్కరించాలి
వారికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి
ట్రిఫ్ట్‌లో బకాయిలు చెల్లించాలి : తెలంగాణ చేనేత కార్మిక సంఘం ధర్నాలో వక్తలు
మద్దతు తెలిపి మాట్లాడిన ఎమ్మెల్యే, పలువురు ఎమ్మెల్సీలు
నవతెలంగాణ – ముషీరాబాద్
చేనేత పరిశ్రమకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో చేనేత కార్మికులు ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ చేనేత బోర్డు, హండ్రీ క్రాఫ్ట్ బోర్డ్, మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత పరిశ్రమకు ముడిసరుకులైన రంగోలి రసాయనాలతోపాటు చేనేత చీరలపై జీఎస్టీ విధించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా సదుపాయం, వర్క్ టు ఓనర్ పథకం అమలు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బకాయిల చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే తెగించి పోరాడాల్సిందేనని చెప్పారు. ధర్నాలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు గృహనిర్బంధాలు చేస్తూ అణచివేస్తున్నారన్నారు. చేనేత కార్మికుల ట్రిఫ్ట్ పథకంలో ప్రభుత్వం రెండు నెలల డిపాజిట్ మాత్రమే చేసి మిగిలిన బకాయిలను చెల్లించలేదని తెలిపారు.
బకాయిలను వెంటనే డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో చేనేతలకు రూ.2,000 కోట్లు, టెక్స్‌టైల్స్, పవర్‌లూమ్ రంగాలకు మరో రూ.2,000 కోట్లు వేరుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు ఎల్.రమణ, నెల్లికంటి సత్యం, తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేతన్నల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేసి, జీరో వడ్డీతో రూ.5 లక్షల వరకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్మికులకు రూ.ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని కోరారు.
చేనేత పవర్ లూమ్ కార్మికులందరికీ రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మెన్ చిరంజీవులు, తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్, పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముషం రమేష్, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ ప్రసంగించారు. ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, మత్స్యకారులు- మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లల్లెల బాలకృష్ణ, తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, చేనేత కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనరసయ్య, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చోళ రాజేశం, రాష్ట్ర అధ్యక్షులు బాసాబత్తిని రాజేశం తదితర నాయకులు పాల్గొన్నారు.



