నూతన విద్యా విధానం రద్దుకు డిమాండ్
శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమాలు
25 నుంచి హైదరాబాద్‌లో ఐద్వా జాతీయ మహాసభలు : ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు శిల్పా సురేంద్రన్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు పోరాటం సాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిలభారత ఉపాధ్యక్షురాలు శిల్పా సురేంద్రన్ పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం 2020 పేరుతో విద్యారంగంపై జరుగుతున్న దాడిని అరికట్టాలని కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ”సావిత్రిబాయి పూలే జీవితం – ప్రస్తుత విద్యారంగ పరిస్థితులు” అనే అంశంపై సోమవారం సెమినార్ నిర్వహించారు. ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో శిల్పా మాట్లాడారు. దేశంలో నూతన విద్యా విధానం – 2020 పేరుతో విద్యారంగంపై జరుగుతున్న దాడిని నిలవరించడానికి సావిత్రి బాయి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.
నాడు మనువాద, బ్రాహ్మణీయ కట్టుబాట్లకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పోరాటం సాగించారని గుర్తు చేశారు. మహిళల చదువు కోసం, వారి హక్కుల కోసం ఆమె చేసిన కృషి నిరంతరం గుర్తుంచు కోదగినదని అన్నారు. మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం ఆమె పాటుపడిన విధానం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని, కళాశాలల ఫీజులు భారీగా పెంచుతున్నారని తెలిపారు. ఇది బాలికల విద్యకు పెను సవాల్‌గా పరిణమించనుందన్నారు. ఇటు వంటి చర్యలతో సమాజంలో మహిళా విద్యాభివృద్ధి కుంటు పడుతుందని అన్నారు. ఐద్వా లక్ష్యాలైన స్వాతంత్య్రం, ప్రజా స్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మహిళలంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు.
హైదరాబాదులో జరిగే మహాసభలను విజయవంతం చేయండి
ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని శిల్పా సురేంద్రన్ పిలుపునిచ్చారు. 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మహాసభలు ‘సామ్రాజ్యవాదాన్ని ఎదిరించండి – మనువాదాన్ని ఓడించండి – మహిళా హక్కులను కాపాడండి’ అనే నినాదంతో సాగుతాయని వివరించారు. రాష్ట్రంలో తొలిసారి జరిగే ఐద్వా జాతీయ మహాసభలు, బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరారు. ఈ సదస్సులో ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత, ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ, పాలేరు డివిజన్ కార్యదర్శి సుమతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు భాగం అజిత, సుగుణమ్మ, పద్మ, మంగతాయి, సావిత్రి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



