కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను మార్చేసిన మోడీ సర్కారు
సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల గౌడ
అమరావతి : ఢిల్లీలో నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైౖతాంగం ప్రదర్శించిన పోరాట స్ఫూర్తితో లేబర్‌కోడ్స్‌్‌కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్యపోరాటాలు చేయాల్సిన తరుణం ఆసన్నమైందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాల గౌడ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కార్మిక వర్గానికి నష్టం చేసే లేబర్‌కోడ్స్‌ను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. విజయవాడ బందరురోడ్డులోని ఎంబీవీకేలో, సీఐటీయూ అఖిల భారత మహాసభ నేపథ్యంలో నండూరి ప్రసాదరావు మెమోరియల్ ఆధ్వర్యాన సీఐటీయూ-ఎంబీవీకే నిర్వహణలో శనివారం సదస్సు జరిగింది.
నండూరి ప్రసాదరావు స్మారక సదస్సుకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన జస్టిస్ గోపాలగౌడ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వమే కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల స్ధానంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్లకు అనుగుణంగా నాలుగు లేబర్‌కోడ్స్‌గా తీసుకొచ్చిందన్నారు. లేబర్‌కోడ్స్ అమలుతో కార్మికులకు భవిష్యత్తులో ఎటువంటి భద్రత ఉండదన్నారు. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, యాజమాన్యాల కోసమే రూపొందించారన్నారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టులిచ్చిన తీర్పులకు భిన్నంగా లేబర్‌కోడ్స్ తీసుకువచ్చారని, ఇది యాజమాన్యాల లాభాల కోసమేనని, ఇకపై సంక్షేమ బోర్డులు ఉండవని ఆయన వివరించారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్న పాలకులు మహిళలకు రాత్రి పూట బలవంతంగా నైట్‌షిప్ట్‌లో పనిచేయించుకునేే విధంగా చట్టాలు చేశారన్నారు. ఎనిమిది గంటల పనివిధానం కార్మికవర్గం శతాబ్దాల క్రితం పోరాడి సాధించుకుందని తెలిపారు.
కార్మికవర్గం వల్లే ఉత్పాదకత పెరిగి దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. లేబర్‌కోడ్స్‌పై పార్లమెంట్‌లో చర్చలు జరగడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలు, కార్మికవర్గానికి అనుకూలంగా మాట్లాడే ప్రతినిధులు అతి తక్కువగా ఉన్నారనీ, అత్యధికులు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే వారేనని అన్నారు. పేదలు, కార్మికుల పక్షాన మాట్లాడే ప్రతినిధులను చట్టసభలకు పంపితేనే సమస్యలు చర్చలకు నోచుకుంటాయన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని పారిశ్రామిక సంబంధాలు కోడ్‌గా మార్చిన దాంట్లో ఉన్న సారం తీసేశారని చెప్పారు. వెల్ఫేర్‌కోడ్ కార్మికులకు వెల్ఫేర్ లేకుండా చేస్తుందన్నారు. కార్మికులు, దళితులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలని రాజ్యాంగం చెబుతోందని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. మార్క్స్ సిద్ధాంతం అమలుతోనే సామాజిక కల్యాణం, సామాజిక న్యాయం అందరికీ అందుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాలకులు నడపడం లేదని, దేశ, అంతర్జాతీయ వ్యాపారులే నడుపుతున్నారన్నారు.
ఇండిగో వివాదం…
దేశంలో మొన్నటి వరకు ప్రభుత్వ ఆధీనంలో ఎయిర్ ఇండియా విమానాలుండేవని, నేడు టాటా, ఇండిగో సంస్థలు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. తాజాగా ఇండిగో సంస్థ ఒకేసారి వెయ్యి విమాన సర్వీసులను నిలిపివేయడంతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో సామాన్యులకు సైతం అర్థమైందని చెప్పారు. ప్రభుత్వ రంగంలో విమానయానం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ లేబర్‌కోడ్స్‌కు వ్యతిరేకంగా ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె పోరాటానికి సమరశంఖం పూరించాయని తెలిపారు. డిసెంబరు 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 4వరకు సీఐటీయూ జాతీయ మహాసభ విశాఖలో జరుగుతుందన్నారు. మహాసభల విజయవంతం చేసేందుకు లక్షలాదిగా కార్మికులు, రైతులు తరలిరావాలని చెప్పారు.
ఎంబీవీకే కార్యదర్శి పి.మురళీకృష్ణ మాట్లాడుతూ కార్మికుల వల్లే సమాజం అభివృద్ది చెందుతుందని, కార్పొరేట్ల వల్ల కాదని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గానికి పోరాటమే తప్ప మరో మార్గమే లేదన్నారు. తొలుత సభ ప్రారంభానికి ముందు అతి¸ధులను ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ వేదికపై ఆహ్వానించారు. అనంతరం సీఐటీయూ నాయకులు నండూరి ప్రసాదరావు చిత్రపటానికి జస్టిస్ గోపాలగౌడ, ఎవి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సభానంతరం జస్టిస్ గోపాలగౌడకు మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు శాలువాకప్పి సన్మానించారు. సీఐటీయూ, ఎంబీవీకే ఆధ్వర్యంలో ఎవి నాగేశ్వరరావు, పి.మురళీకృష్ణ సంయుక్తంగా గోపాలగౌడకు మెమోంటో అందజేశారు.



