నాలుగు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో జరిగిన ఐద్వా అఖిల భారత మహాసభలు విజయవంతంగా ముగిశాయి. దేశ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. తమ భవిష్యత్ కర్తవ్యాలను నిర్ణయించుకొని కొత్త ఉత్సాహంతో తమ తమ సొంత రాష్ట్రాలకు బయలుదేరారు. ఈ మహాసభలు ఇంత విజయవంతంగా నిర్వహించుకోవడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకం. 24 గంటలు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా ప్రతినిధులకు సహకరించారు. సుమారు 450 మంది మహాసభల్లో వాలంటీర్లుగా ఉంటే వారిలో మహిళలే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా టీఎస్‌యూటీఎఫ్ మహిళా కమిటీ, ఎస్.ఎఫ్.ఐ గర్ల్స్ కన్వినింగ్ కమిటీ నుండి ప్రతినిధులకు విశేష సేవలు అందించారు. ఈ మహాసభల ద్వారా ఎంతో స్ఫూర్తిపొందామంటూ వారిలో కొందరు తమ అభిప్రాయాలు మానవితో పంచుకున్నారు.
యువతులను ప్రోత్సహించాలి…
ఐద్వా 14వ మహాసభలో వాలంటీర్‌గా నా అనుభాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సంతృప్తికరమైన అనుభవం అని చెప్తాను. సాఫ్ట్ వేర్ జాబ్‌లో రోబో లాగా పనిచేసి విసిగిపోయిన నాకు ఒక క్రియేటివ్ అవుట్‌లెట్‌ల ఈ కాన్ఫరెన్స్ పనికొచ్చింది. రోజూ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను కండ్లకు కట్టినట్టు నలుగురికి చూపడానికి ఎగ్జిబిషన్ ఉపయోగపడింది. దేశవ్యాప్త మహిళా ఉద్యమకారులను చూసి ఎంతో ప్రేరణ పొందాను. కోవిడ్ సమయంలో అద్భుతాలను సష్టించి యూఎన్ నుంచి బహుమతి అందుకున్న శైలజ టీచర్ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అలా ప్రతి ఒక్క మహిళా నాయకులు, డెలిగేట్ల వెనక ఒక కథ ఉంది. వారిని చూసి ఎంతో ఉత్తేజం కలిగింది. దేశవ్యాప్త మహాసభ జరగాలంటే వెనకాల ఎంతోమంది వాలంటీర్ల శ్రమ ఉంటుందో ప్రాక్టికల్‌గా అర్థమైంది. ఇటువంటి కార్యక్రమాలకు యువతులను మరింతగా ప్రోత్సహిస్తే బావుంటుంది. ఈ మహిళ నాయకులను చూసి మా యువతరం, మా యువతరాన్ని చూసి మహిళా నాయకులు కూడా స్ఫూర్తి పొందుతారు. ఎం.శ్వేత, హైదరాబాద్.
మా బాధ్యత తెలుసుకున్నాం
ఎస్.ఎఫ్.ఐ నుండి ఐద్వా ఆలిండియా మహాసభలకు వాలెంటీర్‌గా వచ్చాను. గతంతో ఎస్.ఎఫ్.ఐ మహాసభల్లో సార్లు పాల్గొన్నాను. అయితే ఐద్వా లాంటి మాస్ ఆర్గనైజేషన్ అఖిల భారత మహాసభల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ముందు ఇక్కడ వర్క్ ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా ఉత్సాహంగా ఉంది. కాలేజీల్లో యూనివర్సిటీల్లో అమ్మాయిల సమస్యలు చూసినప్పుడు వీటిని ఎలా పరిష్కరించగలం అనుకునేదాన్ని. ఐదు దశాబ్దాల నుండి పోరాడుతున్న మహిళా నాయకులు ఇక్కడకు వచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళల సమస్యలు, వాళ్లు చేస్తున్న పోరాటాలు విన్నప్పుడు మేమేం చేయాలో నేర్చుకున్నాం. మా బాధ్యత ఏంటో మాకు తెలిసింది. – మమత, ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ గర్ల్స్ కన్వినర్
ఇదే స్ఫూర్తితో…
ఇక్కడికి వచ్చే ముందు వర్క్ ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. అభ్యుదయ భావాలతో పని చేసే ఇంత మందిని ఒకే సారి చూడడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. వాళ్ల ఉద్యమాలు, పోరాటాలు విన్న తర్వాత మేము విద్యార్థి సంఘంలో అమ్మాయిల సమస్యలపై ఎలా పని చేయాలి అనేది తెలుసుకున్నాం. రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకున్నాం. మహిళా ఉద్యమాలను నడిపిన పెద్ద పెద్ద నాయకులను కలవగలిగాం. ఇదే స్ఫూర్తితో మా ఎస్.ఎఫ్.ఐ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళతాం.
– కృపా మరియ జార్జ్, సెంట్రల్ యూనివర్సిటీ
చైతన్యవంతంగా ఉన్నాయి
అంతకు ముందు మా టీఎస్‌యూటీఎఫ్ మహాసభలకు హాజరయ్యాను. అయితే మొదటి సారి ఐద్వా మహాసభలకు వచ్చాను. వీరి చర్చలు వింటుంటే చాలా చైతన్యవంతంగా అనిపించింది. ఇప్పటి వరకు టీచర్‌గా విద్యార్థుల సమస్యలు మాత్రమే చూశాను. కానీ దేశ వ్యాప్తంగా మహిళలు ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్న మహిళలకు ఐద్వా ఎలాంటి ఉద్యమాలు చేస్తుందో తెలుసుకున్నాను. తర్వాత నేను కూడా ఇదే స్ఫూర్తితో మహిళా టీచర్ల సమస్యలపై పని చేయాలని నిర్ణయించుకున్నా. – జె.సౌభాగ్య, సంగారెడ్డి
ఎన్నో అనుభవాలు…
వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతినిధుల చర్చలు వింటున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయే తెలుసుకున్నాం. రేపు మా గ్రామాలకు వెళ్లి పని చేసేటప్పుడు ఈ అనుభవాలు మాకెంతో ఉపయోగపడతాయి. మా టీచర్స్ సంఘంలో కూడా మహిళలు చాలా మంది ఉన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై ఎలా పని చేయాలి, ఎలా మహిళా ఉపాధ్యాయులను ఐక్యం చేయాలి అనేవి తెలుసుకున్నాం. ఈ అనుభవాలన్నీ మా టీచర్లను ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ప్రతి నిధులకు మంచినీళ్లు, టీ, స్నాక్స్ అందించడం మా పని. అయితే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కంటే కూడా ఓ మహిళగా ఇక్కడకు వచ్చిన నాయకులకు సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. వీరంతా ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు చేసిన వాళ్లు. ఇలాంటి వారి మధ్య నాలుగు రోజుల పాటు గడిపాము, కొత్త ఉత్సాహంతో మా ఉద్యమాలు నడుపుతాం.
– సీహెచ్. సుభాషిణి, ఖమ్మం
సమాజంతో మమేకమవ్వాలనే
ఐద్వా ఆలిండియా మహాసభల సందర్భంగా మాకు ఇలాంటి అవకాశం రావడం పట్ల చాలా గర్వంగా భావిస్తున్నాను. ఒక ఉపాధ్యాయు రాలిగా సమాజంతో మమేకమవ్వాలి అనే ఆలోచనలో భాగంగా ఈ మహాసభలకు వాలంటీర్లుగా వచ్చాము. అనేక అనుభవాలు పొందాము. మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్నాం. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయి, వాటికి వ్యతిరేకంగా ఐద్వా వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి విజయాలు సాధిస్తున్నారో తెలుసుకున్నాం. మొదటి రోజు జరిగిన బహిరంగ సభ కూడా గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. – వి.శాంత కుమారి, కొమరంభీం జిల్లా
స్ఫూర్తిపొందాం
ఐద్వా మహాసభలకు వాలంటీర్‌గా రమ్మనమని అడిగారు. ఇలాంటి సమావేశాలకు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, నాకేం ఉపయోగపడుతుందో అనుకున్నాను. అయితే వచ్చిన తర్వాత చూస్తే రకరకాల రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చారు. అక్కడ వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు, పరిష్కారం కోసం ఏం చేస్తున్నారో వింటే ఎంతో స్ఫూర్తిదాయంగా అనిపించింది. వాళ్ల సంస్కృతి, పద్ధతి బాగా నచ్చింది. మేము ఉపాధ్యాయులుగా మహిళల సమస్యల కోసం ఏం చేయాలి అనే అవగాహన, చైతన్యం, వచ్చింది.
– ఎన్. సుగంధ, రంగారెడ్డి
మర్చిపోలేని అనుభవాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నా. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిగా కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై పని చేస్తాం. ఇక్కడ ఐద్వా మహాసభల్లో చూస్తే దేశ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎన్నో స్ఫూర్తిదాయ పోరాటాలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల సమస్యలు, వారి పోరాటాలు విన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది, ఐద్వా వాటిపై ఎలాంటి పోరాటాలు చేస్తుందో వింటే చైతన్యవంతంగా అనిపించింది. ఉద్యమాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్లు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి సభల్లో వాలంటీర్‌గా పని చేయడం గర్వంగా ఉంది. ఈ నాలుగు రోజులు నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలు పొందాను.
– అషిక, సెంట్రల్ యూనివర్సిటీ



