ఇప్పపువ్వు లడ్డూల ఉత్పత్తితో ఏడాదికి రూ 1.27 కోట్ల టర్నోవర్
భీమ్ భాయి ఆదివాసి మహిళా సహకార సంఘం సాధించిన విజయం : మంత్రి సీతక్క అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అవకాశమిస్తే ఆ ఆదివాసీ మహిళలు ఎవరితోనూ తీసిపోరు. ఏదైనా సాధించగలరు. వారి వెనుకబాటుతనానికి అవకాశాలు రాకపోవడమే కారణం. భీమ్ భాయి ఆదివాసి మహిళా సహకార సంఘం సాధించిన విజయం ఈ విషయాన్ని నిరూపించింది. వారు ఇప్పపువ్వు లడ్డూల ఉత్పత్తితో ఏడాదికి రూ 1.27 కోట్ల టర్నోవర్ సాధించి ఆర్థికాభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క వారు సాధించిన విజయానికి అభినందనలు తెలిపింది. ఆ మహిళా సంఘం సాధించిన విజయ ప్రస్థానమిది. మహిళల ఆర్ధిక అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతగా ఉంటున్నది. అందులో భాగంగా ఆదివాసీ గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు ఉట్నూర్ ఐటీడీఏ నైపున్యాభివృద్ధి విభాగం ద్వారా కృషి చేస్తున్నది.
ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్ధాలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. అందులో ఆదివాసీ గిరిజనుల జీవన విధానంలో అత్యంత పోషక విలువలున్న ఇప్పపువ్వుకు చాలా విశిష్టత ఉంది. స్వయం సహాయక సంఘాలతో ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్ధిక అక్షరాస్యత సాధించారు. వారికి ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న ఇప్పపువ్వుతో లడ్డూల తయారిపై శిక్షణకు మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు 12 మందిని పంపించారు. ఉట్నూర్‌లో రూ.40 లక్షల వ్యయంతో నెలకొల్పిన ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్‌కు ట్రైకార్ నుంచి సబ్సిడీగా 60 శాతం పెట్టుబడి ఇచ్చారు.
30 శాతం బ్యాంకు రుణం కాగా, ఆ మహిళలు తమ వాటాగా 10 శాతం భరించారు. ఇప్పపువ్వు లడ్డులో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) నిపుణులు నిర్దేశించిన ప్రమాణాలు ప్రకారం ఇప్పపువ్వుకు పల్లీలు, నువ్వులు, బెల్లం, కాజు, ఎండు ద్రాక్షలను కలిపి, సన్ ఫ్లవర్ ఆయిల్‌తో రుచి నాణ్యత, పోషక విలువలుండేలా తయారు చేస్తున్నారు. ఈ పదార్ధాలను స్థానికంగా హౌల్‌సేల్ షాప్స్ నుంచి తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో లభించే ఇప్పపువ్వును ఉమ్మడి ఆదిలాబాద్ ముఖ్యంగా కుమరం భీం-ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆదివాసీ గిరిజనుల నుంచి దాదాపు 150 క్వింటాళ్ళును సేకరించి, ఐటీడీఏ గోడౌన్‌లో నిల్వ చేస్తున్నారు. దాదాపు వంద కుటుంబాలు ఇప్పపువ్వు సేకరణ ద్వారా లబ్ధిపొందుతున్నాయి.
గిరిజన పోషణ మిత్ర పధకం కింద
పోషక విలువలున్న ఇప్పపువ్వు లడ్డులను ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 77 ఆశ్రమ పాఠశాలలకు ప్రతి నెలా 2,300 కిలోలను సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రతి నెలా 900 కిలోల లడ్డూలు విక్రయిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలకు కిలో రూ.320 చొప్పున, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.360 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రంలో ఒకటి, బాలాపూర్‌లో ఒక ఇప్పపువ్వు లడ్డు విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. శిల్పారామంలో వారానికి 15 కిలోలు, బాలాపూర్‌లో వారానికి 25 కిలోల ఇప్పపువ్వు లడ్డులు విక్రయం అవుతున్నాయి. ఆదివాసీ గిరిజనులే ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దర్భార్ సందర్బంగా ఐటీడీఏ ప్రాంగణంలో ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పపువ్వు లడ్డూలు తయారీ, విక్రయం ద్వారా వార్షికంగా రూ. 1.27 లక్షలు టర్నో వర్ సాధించినట్టు భీంభాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం నిర్వాహకురాలు భగూభాయి తెలిపారు. తద్వారా తమ సంఘానికి ప్రతి నెలా రూ.3 లక్షలు లాభం వస్తున్నట్టు తెలిపారు. ఉట్నూర్ లో పర్యటించిన సందర్బంగా ఆదివాసీ మహిళల సాధికారతను తెలుసుకున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ఆదివాసీ మహిళలను అభిందించారు. మహిళల కృషిని, ఆర్ధిక స్వావలంబన గురించి ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థావించారు. గిరిజన ప్రాంతంలోని సహజ వనరుల ఆధారిత జీవనోపాధి పెంపుదలకు, ఐటీడీఏ చేపట్టిన ఆదివాసీ మహిళా సాధికారతకు ఇదొక ప్రతీకగా ఎదుగుతున్నది.



