Tuesday, March 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగులకు రూ.1.20 కోట్ల బీమా

ఉద్యోగులకు రూ.1.20 కోట్ల బీమా

- Advertisement -

సీపెక్స్‌ సర్వే ఆధారంగా అందరికీ రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడి
విద్యుత్‌ ఉద్యోగ బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెక్కుల పంపిణీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రవేశపెట్టిన రూ.1.20 కోట్ల ప్రమాద బీమా పథకం దేశ చరిత్రలోనే చారిత్రక నిర్ణయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్‌ ఉద్యోగుల కుటుంబాలకు సోమవారం అసెంబ్లీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.కోటి చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందని అన్నారు. యజమానిపై ఆధారపడిన జీవితాలు తారుమారవుతున్న తీరును గమనించిన తమ ప్రభుత్వం, మంత్రి వర్గంలో చర్చించి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.

తాము ప్రవేశపెట్టిన పథకాలు భవిష్యత్‌లో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేసేలా పకడ్బందిగా రూపొందించామని సీఎం అన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వివరించారు. ముందుగా సింగరేణిలో ని 41 వేలమందికి, విద్యుత్‌ శాఖలోని 51 వేల మంది ఉద్యోగులకు అమలు చేశామన్నారు. నేటి నుంచి రాష్ట్రంలోని 7.57 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. సీపెక్‌ సర్వే ప్రకారం గుర్తించిన రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌)లో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ 2025 అక్టోబర్‌ 10న మరణించిన వరుస సురేష్‌, అలాగే మహబూబ్‌ నగర్‌ సర్కిల్‌ సివిల్‌ విభాగంలో ఆర్టిజన్‌గా పనిచేస్తూ 2025 ఏప్రిల్‌ 19న మరణించిన ముక్తార్‌ బేగ్‌ కుటుంబాలకు సీఎం ఈ సందర్భంగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్‌, మహ్మద్‌ ఆజహరుద్దీన్‌, ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -