నాయకత్వ స్థాయిల్లో కలహాలు..
పాలన లోపాలపై ఇన్వెసర్ల ఆందోళన
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో తీవ్ర చర్చ
నవతెలంగాణ – హైదరాబాద్
భారత ప్రయివేటు రంగ బ్యాంక్‌ల్లో అంతర్గత కల్లోలాలు పెరుగుతోన్నాయి. గతంలో మొండి బాకీలతో ఇబ్బందులు పడగా.. ఇప్పుడు పాలనపరమైన లోపాలు, నాయకత్వ పద్దతులతపై కలహాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్‌టైం చైర్మెన్ అతన్ చక్రవర్తి ఆకస్మిక రాజీనామా బ్యాంకింగ్ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకంటే ముందు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ.590 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు ఉదంతం, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో మున్సిపల్ కార్పొరేషన్ నిధుల గందరగోళం, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో అకౌంటింగ్ లోపాలు ప్రయివేటు బ్యాంకింగ్ వ్యవస్థలోని నిర్వహణ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. గతంలో ఎస్ బ్యాంక్ ఎదుర్కొన్న పాలనా పరమైన సంక్షోభాన్ని ఇవి మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఇటీవల ప్రయివేటు బ్యాంక్‌ల్లో నెలకొన్న గందరగోళంతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ గత మూడు నెలల్లో సుమారు 9.88 శాతం పడిపోయింది. ప్రయివేటు రంగ విత్త దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ సూచీ ఏకంగా 21 శాతం క్షీణించింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంక్షోభం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మెన్ అతన్ చక్రవర్తి ఆకస్మిక రాజీనామా ఆ బ్యాంక్ గవర్నెన్స్‌పై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన కలిగించింది. బ్యాంకులోని కొన్ని పద్ధతులు తన నైతిక విలువలకు అనుగుణంగా లేవని ఆయన పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీనికి తోడు క్రెడిట్ సూయిస్ బాండ్ల అమ్మకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను బ్యాంకు తొలగించింది. ఈ పరిణామాల వల్ల కేవలం వారం రోజుల్లోనే బ్యాంకు మార్కెట్ విలువ రూ.87,000 కోట్లు ఆవిరయ్యింది. ఈ విషయంలో ఆర్‌బిఐ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం బ్యాంకు అంతర్గత క్రమశిక్షణపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో నిధుల మళ్లింపు..
హర్యానా ప్రభుత్వ నిధులకు సంబంధించి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో సుమారు రూ.590 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది. నకిలీ సంస్థలను సృష్టించి, ఫోర్జరీ చేసిన డెబిట్ మెమోల ద్వారా ప్రభుత్వ ఖాతాల నుండి నిధులను మళ్లించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఆరుగురు బ్యాంకు ఉద్యోగులతో సహా 11 మందిని అరెస్ట్ చేయగా, బ్యాంకు ఇప్పటికే ప్రభుత్వానికి అసలు, వడ్డీతో కలిపి రూ.583 కోట్లు తిరిగి చెల్లించాల్సి వచ్చింది.
కోటక్ లెక్కల్లో తేడాలు..
హర్యానాలోని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ డిపాజిట్లకు సంబంధించి సుమారు రూ.150 కోట్ల వ్యత్యాసం ఉన్నట్టు నివేదికలు రావడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ వార్తల్లోకి ఎక్కింది. మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు ఖాతాలను సరిచూస్తున్నామని ఆ బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే మెజారిటీ నిధులను సరిపోల్చామని తెలిపింది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో అకౌంటింగ్ లోపాలు
మరో ప్రయివేటు రంగ సంస్థ ఇండుస్‌ఇండ్ బ్యాంక్‌లో గతేడాది జరిగిన అకౌంటింగ్ లోపాల కారణంగా మార్చి 2025 త్రైమాసికంలో బ్యాంకు చరిత్రలోనే అత్యధిక నష్టాలను చవి చూసింది. అకౌంటింగ్, నిర్వహణ లోపాలకు బాధ్యత వహిస్తూ ఆ సంస్థ సీఈఓ సుమంత్ కత్పాలియా, డిప్యూటీ సీఈఓ అరుణ్ ఖురానా వంటి కీలక వ్యక్తులు తప్పుకోవాల్సి వచ్చింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం బ్యాంక్‌ల లాభాలను మాత్రమే కాకుండా వాటిని నడిపే వ్యక్తుల విశ్వసనీయతను, పారదర్శకతను కూడా నిశితంగా గమనిస్తున్నారు. బ్యాంకింగ్ రంగానికి మున్ముందు మేనేజ్‌మెంట్‌పై విశ్వసనీయతనే అసలైన సవాలుగా మారనుంది.
చక్రవర్తి లేఖపై సెబీ విచారణ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ చైర్మెన్ అతను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన అంశాలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గురువారం ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బ్యాంకులోని కొన్ని పద్ధతులు తన వ్యక్తిగత విలువలకి విరుద్ధంగా ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ లేఖ కారణంగా బ్యాంక్ మార్కెట్ విలువ భారీగా పడిపోవడం, సమాచార వెల్లడిలో జరిగిన జాప్యం, ఇతర డైరెక్టర్ల బాధ్యతలపై సెబీ నివేదిక కోరినట్టు సమాచారం.
ప్రయివేటు బ్యాంక్‌ల్లో అంతర్గత కల్లోలాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



