తెలుగు సాహిత్యంలో ఆమే ఒక నూతన వ్యవస్థ. తను నడిచే మార్గంలో చురుకుగా ప్రయాణించి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి తన పని ముగిసిందని నిష్క్రమించడం ఎంతవరకు సమంజసం..? ఇది ఓ విషాదం. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆమెకే చెందుతుంది. అంతర్జాలంలో తొలి తెలుగు మహిళా పత్రిక ‘విహంగ’ను తెలుగు వారికి పరిచయం చేసి, స్త్రీవాద, దళిత స్త్రీవాద సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతం అయ్యారు. అంతర్జాలంలో ఐఎస్ఎస్ఎన్ గుర్తింపు పొందిన తొలి తెలుగు పత్రికగా విహంగను తయారు చేశారు. ఆమే డా.పుట్ల హేమలత. ఈరోజు ఆమె 64వ జయంతి సందర్భంగా ఆమె సాహిత్య కృషి నేటి మానవిలో…
పుట్ల హేమలత 1962 మార్చి 26న జన్మించారు. ఎండ్లూరి సుధాకర్ సహచరి హేమలత అని ఆమె పిలిపించు కోలేదు. ఆయనే మిస్టర్ హేమలతా పుట్ల అని తన ఐడెంటి టీని గర్వంగా చెప్పుకునేవారు. తన సహచరుడు ఆమెను టెక్ సేవీ అని, పుట్లాజీ అని, నా బంగారు తీగ అని పిలుస్తుంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక పరిశోధక విద్యార్థులందరికీ ఆమె ఓ అమ్మ.
కథకీ కవిత్వానికి పెళ్లి..
ఒక మేధావి, ప్రేమాస్పదురాలూ, అలుపెరగని కార్యకర్త అంతర్ధానమవడం అనేది సాహితీ ప్రపంచానికి, దళిత ప్రపంచానికి తీర్చలేని లోటు. ఏ వేదికకైనా దిక్సూచిలు కావాలి. అలా అన్నీ తానే అయ్యి ప్రరవేను ముందుకు నడిపిన సందర్భాలెన్నో. అందుకే ప్రరవే వారికి పరిమళాల తీగ డా.పుట్ల హేమలత. ”నా బంగారు తీగా! నా ఏకాంతంలో / ఒక అంకెను మాత్రమే / నీ పక్కన చేరాకే / నేను రెండుగా మారాను” అంటారు ఆచార్య ఎండ్లూరి సుధాకర్. ఎంత గొప్ప నివాళి. కథకీ కవిత్వానికి పెళ్లి.. అప్పట్లో సాహిత్య లోకంలో ఇదో గొప్ప వార్త. బహుశా 1980లో ఒకరిని ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకొని, ఆ ప్రేమను పెళ్లిదాక తీసుకువెళ్లిన గొప్ప ప్రేమికులు వీరేనేమో. వారి ప్రేమకు ప్రతి రూపాలు మానస, మనోజ్ఞలు. ఇక ప్రొఫెసర్ వినోదిని, ఇక్బాల్ నుండి నేటి అరసి శ్రీ, రవి, వెంకట్ వరకూ ఆ తల్లి బిడ్డలే.
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. ఎండ్లూరి సుధాకర్ విషయంలో ఇది అక్షరాల నిజం. ఆయన ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డీ పూర్తి చేయడానికి, ఆయన సాధించిన అభివృద్ధి వెనుక, విజయాల వెనుక హేమలత ప్రోత్సాహం మరువలేనిదని సుధాకర్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉండేవారు. తెలుగు సాహిత్యంలో ఇప్పటివరకూ (2011) ఎవరూ పరిశోధనంశంగా స్వీకరించని ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశం మీద పరిశోధన చేసి 2011లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు ఆమె.
అచ్చమైన ఆధునిక కవయిత్రిగా…
‘రాజమండ్రి సాహిత్య సాంస్కృతిక వాతావరణంలో సాంప్రదాయక కుబుసాన్ని వదిలించుకొని, సమకాలీన సామాజిక వివక్షను ప్రశ్నించగల కొత్త ప్రజాస్వామిక దృక్పథాన్ని అభివృద్ధి చేసుకొంటూ అచ్చమైన ఆధునిక కవయిత్రిగా ఎదిగారు. స్త్రీవాద, దళిత, మైనార్టీ అస్తిత్వ ఉద్యమాల న్యాయ సంబద్ధతను గుర్తించి వాటితో కలిసి నడిచారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉండటం కాదు, ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ తనను తాను కోల్పోవటం ఉంటుందని స్త్రీ వాదం చెప్తుంది. పుట్ల హేమలత అలా తనను తాను కోల్పోయిన స్త్రీ కాకపోవటం విశేషం’ అంటారు కాత్యాయని.
ఆమె కృషి అనిర్వచనీయం
ఈ కాలం తెలుగు వారికి తెలియని మొదటి తరం దళిత కవి రాజమహేంద్రవరం వాసి కుసుమ ధర్మన్న. ఆయన జీవిత చరిత్రను తెలుగు వారికి అందించారు డా.పుట్ల. ఒక కవిగా, కథా రచయితగా, సాహిత్య విమర్శకురాలిగా, సంపాదకురాలిగా ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. మనోఙ్ఞ సాహిత్య సాంస్కృతిక అకాడమీ ద్వారా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. మనోజ్ఞ ప్రచురణలు పేరుతో వేకువ రాగం(1985-2019), లేఖన 1 – సాహిత్య పరిశోధక వ్యాస సంకలనం, లేఖన 2 – అంతర్జాలం-సాహిత్య దర్శనం, లేఖన 3 – నీలి కలువలు (ఆధునిక దళిత స్త్రీల సాహిత్యం) వంటి సాహిత్య వ్యాసాల సంపుటాలను అందించారు. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో క్రైస్తవ కుటుంబ సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే పుట్ల హేమలత రాసిన తొలి కథలు గూడు చేరిన గువ్వ, మోడు చిగురించింది, మిస్ పవిత్ర వంటి నవలలు చదివి తీరాలి.
సహచరి ఎడబాటుతో…
చివరిగా ”ఈ చూపు చివరిది/ఈ మాట చివరిది/ఈ శ్వాస చివరిది/ఇక సుప్రభాతాలు లేవు/అస్తమయాలు తప్ప/పైవాడు సిద్ధం చేసిన క్షణం/ పూల రథమై దిగి వస్తోంది” అంటూ రాజమహేంద్రవరం బొల్లినేని హాస్పిటల్లో 2019 ఫిబ్రవరి 09న చివరి శ్వాస విడిచారు డా.పుట్ల హేమలత. సహచరి మరణం తర్వాత కొన్నాళ్ళు ఓపికగా జీవించి ఉన్నా హేమలత ఎడబాటుతో సుధాకర్ కూడా సాహితీ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగు సాహిత్యం తమకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్న లబ్ధప్రతిష్టులు వీరు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలుగు సాహిత్యంలో ‘మిళింద’లా ముందుకు దూసుకుపోతున్నారు కేంద్ర సాహిత్య యువపురస్కార గ్రహీత మానస ఎండ్లూరి.
విహంగమై…
అంతర్జాలంలో తెలుగు సాహిత్యాన్ని నలుగురికీ చేరువ చేయడానికి అహర్నిశలు కృషి చేసి అర్దాంతరంగా జీవితం ముగించుకొని ‘విహంగ’మై ఎగిరెవెళ్లిపోయారు డా.పుట్ల హేమలత. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నట్లు ”ఓ అంతర్జాల కళాలోచనీ/నువ్వు బతికిన క్షణాలు/చరిత్రలో చిరస్మరణీయ దినాలు”. అవును ఇది అక్షరసత్యం. ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. వారి స్ఫూర్తిని, ఆలోచనలు అందిపుచ్చుకుని ముందుకు సాగుదాం…
– వెంకటేశ్వరరావు కట్టూరి



