Wednesday, December 17, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఐడీపీఎల్‌ భూఆక్రమణలపై విచారణ

ఐడీపీఎల్‌ భూఆక్రమణలపై విచారణ

- Advertisement -

టీజీఐఐసీని ఆదేశించిన రాష్ట్ర సర్కారు
ఏ కంపెనీకి లేని విధంగా ఆ భూములపై ఐడీపీఎల్‌కు సర్వహక్కులు
900.20 ఎకరాల్లో భారీగా ఆక్రమణలు
18 ఎకరాల్లో వెలిసిన బహుళ అంతస్తుల నిర్మాణాలు
కబ్జా అయిన వాటి విలువ నాలుగు వేల కోట్లపైనే …


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇండియన్‌ డ్రగ్స్‌, పార్మాసూటికల్‌ లిమిటెడ్‌ (ఐడీపీఎల్‌)కు చెందిన రూ.4 వేల కోట్ల విలువైపు భూములు అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని టీజీఐఐసీని రాష్ట్ర సర్కారు మంగళవారం ఆదేశించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఐడీపీఎల్‌ భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జాగృతి నేత కల్వకుంట్ల కవిత పరస్పర ఆరోపణలతో ఈ అంశం తెరపైకి వచ్చింది. మాధవరం కృష్ణారావు 150 ఎకరాలు కబ్జా చేశారనీ, దాని వెనుక నాలుగు వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం ఉందని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘కవిత భర్త తప్పుడు పత్రాలతో 18 ఎకరాలు కబ్జా చేసి అందులో నిర్మాణాలు చేపడుతున్నారు’ అని మాధవరం కృష్ణారావు పత్యారోపణలు చేసిన విషయం విదితమే. ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది.

ఆ భూముల చరిత్ర ఇది…
మెడిసిన్‌ ఉత్పత్తి కోసం హైదరాబాద్‌లో 1967లో పభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్‌ స్థాపించబడింది. ఒకప్పుడు దేశీయ ఔషధాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించింది. కూకట్‌పల్లి నియోజకవర్గపరిధిలో ఐడీపీఎల్‌కు రాష్ట్ర సర్కారు 900.20 ఎకరాలు కేటాయించింది. అందులో 576.37 గుంటల భూమిలో ఐడీపీఎల్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. దానికి దగ్గర్లోనే ఐడీపీఎల్‌ కాలనీ కోసం 323 ఎకరాలను వినియోగించారు. దేశీయంగా ఔషధాల కంపెనీ ఉండాలనే సదుద్ధేశంతో దేశంలో ఏ కంపెనీకి లేని విధంగా ఐడీపీఎల్‌కు అప్పటి రాష్ట్ర సర్కారు గిఫ్టు కింద సర్వహక్కులు కల్పించింది. అలా చేయడంలో ఐడీపీఎల్‌ అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌ పార్థసారధి కీలక పాత్ర పోషించారు.

దేశంలోని ఏ సంస్థకూ ఇలాంటి రైట్స్‌ లేవు. బెల్‌, హెచ్‌ఎమ్‌టీ, హాల్‌ వంటి సంస్థలకు కూడా ఇలాంటి హక్కులు లేవు. దేశంలోని ఎంతో మంది పేదలకు ఔషధాలను అందించిన ఘన చరిత్ర ఐడీపీఎల్‌ది. ఆ కంపెనీకి కాల్షియం, ఐరన్‌ టాబ్లెట్ల తయారీపై పేటెంట్‌ హక్కు కల్పించబడింది. కాలక్రమేణా ప్రభుత్వాల నుంచి సహకారం కొరవడటం, మారిన కాలపరిస్థితులకు అనుగుణంగా మార్కెట్‌ వ్యవస్థను రూపొందించు కోకపోవడం, కొందరు ఉన్నత ఉద్యోగులు ఫార్ములాలను దొడ్డిదారిన ప్రయివేటు పార్మా కంపెనీలకు అమ్ముకోవడం వంటి తదితర కారణాలతో సదుద్దేశంతో ఏర్పడిన కంపెనీ మూతపడిపోయింది. ఆ తర్వాత విలువైన భూములపై కబ్జాకోరుల కన్ను పడింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాలానగర్‌ ఇండ్రస్టీయల్‌ జోన్‌ ప్రాంతాన్ని రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చింది.

దీంతో ఆ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అంతే వేగంగా ఆ భూముల అన్యాక్రాంత పర్వం మొదలైంది. ఆ కంపెనీలోని ఒకవైపు నుంచి భూములను స్వాహా చేయించుకుంటూ పోవడాన్ని కబ్జాదారులు మొదలుపెట్టారు. దీంతో ఐడీపీఎల్‌కు సబంధించిన భూముల్లోని సర్వే నెంబర్‌ 376లో భారీ ఎత్తున అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్‌ 252లోనూ కొందరు భూమి చదును చేసి ప్లాట్లను విక్రయించే పనిలో ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఆ సర్వే నెంబర్లలో 18 ఎకరాల్లో బహుళ అంతస్తులు వెలిశాయి. ఆక్రమణలకు గురైన భూముల విలువ దాదాపు రూ.4,000 కోట్లపైనే ఉంటుందనే వార్తలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలోనే ఐడీపీఎల్‌ భూముల్లో అసలేం జరిగింది? ఎంత మేర ఆక్రమణకు గురైంది? దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అనేదాన్ని తేల్చాలని విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి
సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాన్ని ఎవ్వరూ చేయొద్దు. కేంద్రంలో కాంగ్రెస్‌ సర్కారున్నా, బీజేపీ ప్రభుత్వమున్నా, రాష్ట్రంలో గతంలో బీఆర్‌ఎస్‌ ఉన్నా, నేడు కాంగ్రెస్‌ సర్కారు ఉన్నా అందరూ ప్రయివేటీకరణ విధానాలనే అనుసరించారు. అందులో భాగంగానే ప్రజాప్రయోజనాల కోసం స్థాపించిన అత్యంత కీలకమైన ఐడీపీఎల్‌ సంస్థను నీరుగార్చారు. ఆ భూములు అన్యాక్రాంతం అవుతుంటే నిర్లక్ష్యం వహించారు. ఇప్పటికైనా ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆ భూములను ఔషధ రంగ సంస్థ కోసమే వాడాలి. భూ ఆక్రమణదారులను, అక్రమార్కులతో చేతులు కలిపిన కంపెనీ అధికారులను కఠినంగా శిక్షించాలి. – ఎస్‌.వీరయ్య, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు

భూములను పరిరక్షించాలి
1966లో ఐడీపీఎల్‌ అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌గా జాయిన్‌ అయ్యాను. ఇప్పుడు నాకు 86 ఏండ్లు. దగ్గరుండి చేత్తో గొలుసులు పట్టి కొలిచి మరీ ఐడీపీఎల్‌కు హద్దులు నిర్ణయించాం. కంపెనీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. దేశానికి ఔషధపరంగా ఐడీపీఎల్‌ ఇతోధికంగా దోహదపడింది. అలాంటి పరిశ్రమ భూములు అన్యాక్రాంతం అవుతుంటే బాధేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను ప్రొటెక్షన్‌ చేయాలి. ఇది ఐడీపీఎల్‌ భూములు అని బోర్డులు పెట్టాలి. ప్రయివేటు వ్యక్తులకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దని సబ్‌రిజిస్ట్రార్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. -పార్ధసారథి, ఐడీపీఎల్‌ పూర్వ ఉద్యోగి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -