ఏ-1గా డ్రైవర్ ఆళ్ల నవీన్
ఏ-2గా పాఠశాల యజమాని దేశిరెడ్డి నాగేందర్‌రెడ్డి
నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమం
నవతెలంగాణ-వేంసూరు
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులగూడెం వివేకానంద విద్యాలయం ప్రయివేట్ పాఠశాల బస్సు శుక్రవారం సాయంత్రం అదుపుతప్పి కాలువలో పడిన ఘటన తెలిసిందే. కాగా, ఈ సంఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలు కాగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం, విజయవాడ తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారుకులైన బస్సు డ్రైవర్ నవీన్ ఏ-1గా, పాఠశాల యజమాని నాగేందర్ రెడ్డిని ఏ-2గా పేర్కొంటూ పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు ఫిట్‌నెస్, కెపాసిటీకి మించి 107 మంది విద్యార్థులను ఎక్కించటం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగిం చుకొని కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రస్థాయి బీజేపీ నాయకుని సహకారం, జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా స్థానిక మండల నాయకులు కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్టు ప్రచారం. ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ గాయాలైన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే అంశాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. స్థానిక ఎంఈఓ సీహెచ్ వెంకటేశ్వరరావు.. డీఈవో ఆదేశాలు మేరకు శనివారం పాఠశాలలో విచారణ చేశారు. సత్తుపల్లి ఆర్టీవో ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్టు సమాచారం. గతంలో ఈ పాఠశాల బస్సులు అనేకచోట్ల ప్రమాదాలకు గురయినట్టు స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి కారణమైన పాఠశాల యజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకొని, గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
స్కూల్ బస్సు ప్రమాదంపై దర్యాప్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



