Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కానరాని చలివేంద్రాలు.!

కానరాని చలివేంద్రాలు.!

- Advertisement -

మండుతున్న ఎండలు
దాహార్తితో ప్రజల అవస్థలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎండలు రోజురోజుకు మండిపోతున్న వేళ మండలంలో ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. ఈ ఏడాది మండల కేంద్రమైన తాడిచెర్ల, కొయ్యుర్ తదితర గ్రామాల్లో చలివేంద్రాలు కనిపించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. గతంలో ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు.

దాహంతో అల మటించే బాటసారులు, కూలీలు, వృద్ధులు, విద్యార్థులకు చల్లని తాగునీరు అందిస్తూ సేవాభావానికి నిదర్శనంగా నిలిచేవారు. కానీ ఈసారి ఏప్రిల్లో ఎండలు దంచికొడుతున్నా మండల ప్రజలకు దాహార్తి తీర్చే చలివేంద్రాలు మాత్రం కానరావడం లేదు. దీంతో దుకాణాల్లో దొరికే బాటిల్ నీళ్లపై ఆధారపడుతున్నారు. సామాజిక సేవా సంస్థలు, యువజన సంఘాలు, దాతలు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. కూలీలు,ప్రయాణికులు,విద్యార్థులు, బాటసారులు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎండల ప్రభావంతో శరీరం త్వరగా డీహైడ్రేడ్ అవుతుంది.

తప్పనిసరి పరిస్థితుల్లో దుకాణాల్లోని వాటర్ బాటిళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. దీంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది.ప్రస్తుతం అరలీటరు నీటి బాటిల్ రూ.10లకు విక్రయిస్తున్నారు.స్థానికంగా లభించే వాటర్ బాటిళ్లు నాసిరకమైనవిగా పలువురు పేర్కొంటున్నారు.దీంతో బాటిల్ నీటితో ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.ఎండలు ముదురుతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

గతంలో చలివేంద్రాలు అనేకం..
ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కడా చల్లివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో బస్టాండ్ ఏరియాతో పాటు జనాలు ఎక్కువగా ఉండే బస్టాండ్,బ్యాంకు,ప్రధాన కూడళ్లలో ప్రాంతాల్లో చలివేంద్రాలు ఉండేవి.రాజకీయ నాయకులు,వివిధ సంఘాల నాయకులు,పోలీసుల ఆధ్వర్యంలో సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు.

మజ్జిగ,అంబలి పంపిణీ కార్యక్రమాలు సైతం చేపట్టేవారు. దీంతో గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి.ఈసారి ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రజలు వాపోతున్నారు.మధ్యాహ్న సమయంలో బాటసారులకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో నీళ్లు తాగకపోవడంతో త్వరగా ఎండదెబ్బ బారిన పడే అవకాశాలు ఉంటాయి.ప్రజా ప్రతినిధులు,దాతలు, అధికారులు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -