– నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– రూ.76,400 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని చెరువుకట్ట సమీపంలో ఐపీఎల్ బెట్టింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, చేర్యాల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.76,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల సీఐ ఎల్.శ్రీను తెలిసిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని చెరువుకట్ట సమీపంలో ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, చేర్యాల పోలీసులు దాడి చేశారు. దాంతో చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన శ్రీనివాస్, నర్ర చంద్రబాబు, ఎల్ల నవీన్ కుమార్, అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కూరపాటి శివప్రసాద్.. ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడ్డారు. మరికొంతమంది పారిపోయారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ. 76,400 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. పారిపోయిన నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఐపీఎల్ బెట్టింగ్, గాంబ్లింగ్, పేకాట తదితర చట్ట వ్యతిరేకత కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. పేకాట, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తిస్తే డయల్ 100 లేదా చేర్యాల పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. చేర్యాల ప్రొబిషనరీ ఎస్‌ఐ సమత, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఐపీఎల్ బెట్టింగ్..
- Advertisement -
- Advertisement -