హార్ముజ్ సమీపంలో కూల్చివేసినట్టు ప్రకటన
ట్రంప్ ’48 గంటల అల్టిమేటం’ అనంతర పరిణామం
టెహ్రాన్ : పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా, ఇరాన్‌లు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. హార్ముజ్‌ను 48 గంటల్లో తెరవాలనీ, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం విదితమే. అయితే తమ నుంచి కూడా ప్రతిఘటన తప్పదని ఇరాన్ సైతం బదులిచ్చింది. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శుత్ర దేశానికి చెందిన ఎఫ్-15ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడి చేసినట్టు పేర్కొంది. దక్షిణ తీర ప్రాంతం హార్ముజ్ ద్వీపం సమీపంలో ఇరాన్ మీదుగా ఎగురుతున్న ‘శత్రువు’ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని అడ్డగించి, తమ క్షిపణులతో కూల్చివేసినట్టు వివరించింది. ఈ మేరకు ఇరాన్ వైమానిక రక్షణ ప్రధాన కార్యాలయం ఆదివారం తెలిపింది.
అయితే ఆ విమానం పూర్తిగా కూలిపోయిందా లేదా దెబ్బ తిందా అన్న విషయంపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు ఇరాన్ తెలిపింది. కాగా యుద్ధ విమానంపై దాడికి సంబంధించిన వీడియోను ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ సంఘటనకు ముందు కూడా అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ఎఫ్-35ను కూడా తన వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా దెబ్బతీసినట్టు ఇరాన్ ప్రకటించిన విషయం విదితమే. అమెరికా అధికారులు సైతం ఆ విమానం దెబ్బతిన్నదని ప్రకటించినప్పటికీ.. పూర్తి వివరాలను ప్రకటించకపోవడం గమనార్హం. శుత్రువు నిఘాకు సైతం చిక్కని ఎఫ్-35ను ఇరాన్ దెబ్బతీసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇరాన్ యుద్ధ, వైమానిక శక్తిని ప్రపంచానికి తెలియపర్చినట్టయ్యిందని నిపుణులు చెప్పారు.



