Friday, March 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ నాయకత్వం స్థిరంగా ఉంది

ఇరాన్‌ నాయకత్వం స్థిరంగా ఉంది

- Advertisement -

ప్రజలపై పట్టు సడలలేదు
అమెరికా ఇంటెలిజెన్స్‌ అంచనా

టెహ్రాన్‌ : యుద్ధం కారణంగా ఇరాన్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ దాని నాయకత్వం స్థిరంగా, దేశమంతా వారి నియంత్రణలోనే ఉన్నదని అమెరికా ఇంటెలిజెన్స్‌ అంచనా వేసింది. దీంతో ఇప్పుడప్పుడే ఘర్షణలు సమసిపోయేలా కన్పించడం లేదు. ఇరాన్‌లో నాయకత్వం కూలిపోయే అవకాశాలు లేవని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ఇరాన్‌ నాయకత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని, ఇరాన్‌ ప్రజలపై దాని పట్టు సడలలేదని తేల్చి చెప్పాయి. 2003 తర్వాత తాము చేపట్టిన అతి పెద్ద సైనికచర్యకు త్వరలోనే ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనలో పసలేదని ఇంటెలిజెన్స్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని హత మార్చడంతో ఇరాన్‌ మత నాయకత్వం కుదేలైపోయిందని అమెరికా నేతలు తప్పుడు అంచనాలు వేశారు. అయితే వాటిలో వాస్తవంలేదని తాజా ఇంటెలిజెన్స్‌ నివేదిక చెబుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్‌లోని మత ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పలేమని ఇజ్రాయిల్‌ అధికారులు కూడా అంగీకరించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి గగనతల రక్షణ వ్యవస్థలు, అణు స్థావరాలు, సీనియర్‌ నేతలు సహా ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా- ఇజ్రాయిల్‌ దాడులు చేస్తున్నాయి. ఖమేనీతో పాటు అనేక మంది సీనియర్‌ అధికారులను హతమార్చాయి. అయినప్పటికీ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ), ఇరాన్‌ నాయకత్వం దేశంపై పూర్తి నియంత్రణ సాధించాయని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.

భూతల దాడులతోనే ఇరాన్‌ను దారికి తెచ్చుకోవడం సాధ్యపడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇరాక్‌లో ఉన్న కుర్దు వేర్పాటు వాదులు ఇటీవలే అమెరికాను సంప్రదించారు. ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న భద్రతా దళాలపై ఎలా దాడి చేయాలన్న విషయంపై మంతనాలు జరిపారు. కాగా ఇరాన్‌ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. భూతల దాడులు జరిపితే ఇరాన్‌ ప్రజలు ప్రభుత్వం పై తిరుగుబాటు చేయవచ్చునని అమెరికా అంచనా వేస్తోంది.

అమెరికా మద్దతు ఇచ్చిన పక్షంలో తమ సాయుధ దళాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయని కుర్దు వేర్పాటువాదులు సంకేతాలిచ్చారు. అయితే కుర్దు గ్రూపుల సామర్ధ్యంపై అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇరాన్‌ భద్రతా దళాలతో అవి పోరాడగలవా అన్న సందేహాన్ని వ్యక్తపరచింది. ఆ గ్రూపుల వద్ద తగినన్ని ఆయుధాలు, సిబ్బంది లేరని తెలిపింది. తమకు ఆయుధాలు, వాహనాలు సమకూర్చాలని కుర్దు గ్రూపులు కోరుతున్నప్పటికీ ట్రంప్‌ అందుకు సుముఖంగా లేరు. ఇరాన్‌లోకి కుర్దులను అనుమతించేందుకు ఆయన ఇష్టపడడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -