అనుమతించిన మహాయుతి ప్రభుత్వం
నిపుణులు, పర్యావరణవేత్తల ఆందోళన
ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం తాడోబా-అంధారీ టైగర్ రిజర్వ్ సమీపంలో ఇనుప ఖనిజం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. అయితే మనకేమిటంటారా? ఈ తవ్వకాల కారణంగా కీలకమైన వన్యప్రాణి కారిడార్‌లో 18,000కు పైగా చెట్లను కూల్చివేస్తారు. అరవై పెద్దపులులు అభయారణ్యంలో ఆవాసాన్ని కోల్పోయి జనారణ్యంలో ప్రవేశిస్తాయి. నిపుణుల అభ్యంతరాలు, పర్యావరణవేత్తల నిరసనలను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా దానికి ఆమోదం తెలిపింది. ఈ వ్యవహారంలో బాంబే హైకోర్టు జోక్యం చేసుకుంది. జాతీయ వన్యప్రాణుల బోర్డు నుంచి ఇంకా ఈ తవ్వకాలకు అనుమతులు రావాల్సి ఉంది.
బాంబే హైకోర్టు జోక్యం
ఒకవైపు చూస్తే 35.95 హెక్టార్ల అటవీ భూమి… 18,024 చెట్లు…60 పెద్దపులులు…650 గ్రామాలు. మరోవైపు చూస్తే 54 మీటర్ల ఖనిజ నిల్వలు, ఏడాదికి 1.1 లక్షల టన్నుల ఇనుప ఖనిజం తవ్వకాలు…120 మందికి ఉపాధి. ఇదీ ఈ ప్రాజెక్ట్ స్వరూపం. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఘోడాజరి అభయారణ్యానికి, పులుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉన్న వన్యప్రాణుల కారిడార్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు (ఎస్‌బీడబ్ల్యూఎల్) గత నెల 6న ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపినప్పటికీ దానిని పట్టించుకోలేదు. పర్యావరణ కార్యకర్తలు గత నెల రోజులుగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. బాంబే హైకోర్టు గత వారం ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఓ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమించింది. రెండు వారాలలో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.
పర్యావరణవేత్తలు, స్థానికుల అభ్యంతరాలు
నాగపూర్‌కు చెందిన ప్రయివేటు స్టీల్ సంస్థ సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కట్టబెట్టింది. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌తో పులులు సంచరించే ఐదారు ప్రాంతాలు ధ్వంసమవుతాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న 650 గ్రామాలలోకి పులులు ప్రవేశించే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతా చేస్తే ఈ ప్రాజెక్టులో కేవలం 120 మందికి మాత్రమే ఉపాధి లభిస్తుంది.
వారిలో 32 మందికే శాశ్వత ఉద్యోగాలు దక్కుతాయి. టైగర్ కారిడార్‌లో మైనింగ్ ప్రాజెక్ట్ చేపట్టడం ప్రమాదకరమని, ప్రజలు-పులుల మధ్య ఘర్షణలు జరుగుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్‌లో దట్టమైన అడవులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 250 పులులు ఉన్నాయని, అవి ఆహారం, నీరు కోసం ఒక అడవి నుంచి మరో అడవికి తరలి వెళుతుంటాయని స్థానికులు చెప్పారు. బ్రహ్మపురి డివిజన్ కేవలం టైగర్ కారిడార్ మాత్రమే కాదు…అందులో అత్యంత విలువైన రకరకాల చెట్లు ఉన్నాయి.
నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే…
ప్రాజెక్టును ఈ ఏడాదే మంజూరు చేసినప్పటికీ కొంతకాలంగా దానిపై పరిశీలన జరుగుతోంది. 2023 అక్టోబరులో ప్రాజెక్ట్ పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2024 జనవరి 24న తొలి నివేదికను, అదే ఏడాది ఆగస్టులో సమగ్ర నివేదికను అందజేసింది. అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే పర్యావరణానికి, వన్యప్రాణులకు కోలుకోలేని నష్టం జరుగుతుందని తెలిపింది. భారీ చెట్లను కూల్చివేయాల్సి వస్తుందని, ఫలితంగా తీవ్రమైన జల-వాయు కాలుష్యం ఏర్పడుతుందని హెచ్చరించింది.



