డీపీఆర్ దశలోనే పనులు
డిసెంబర్‌లో పనులు జరగడం కష్టమే!
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీపై భిన్నాభిప్రాయాలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజం పడిన ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై ఇంకా అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముందు నిర్ణయించిన ప్రకారం తుమ్మిడిహట్టి నుంచి మైలారం మీదుగా ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయాల్సి ఉండగా.. దాన్ని పక్కన పెట్టి తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీటిని తరలిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. డీపీఆర్ సిద్ధం చేసేందుకు రూ.11.88 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీఓ జారీ చేసింది. కానీ సుందిళ్లకు నీటి తరలింపు అనేది ఏ మేరకు సాధ్యమనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకం నిర్మాణానికి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది జన్మస్థలమైన కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.17,875 కోట్ల అంచనాతో 19 ప్యాకేజీల ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించారు. జిల్లాలో కాలువలు తవ్వారు. అయితే, ఇతర ప్యాకేజీల పనులు నత్తనడకన సాగడంతో అంచనా వ్యయం పెరుగుతూ 2014 నాటికి రూ.38,500 కోట్లకు చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడ నీటి లభ్యత తక్కువగా ఉందన్న సాకు చూపి దీనిని మేడిగడ్డకు తరలించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది.
అటకెక్కిన వార్దా ప్రాజెక్టు నిర్మాణం
ప్రాణహిత ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా ఆసిఫాబాద్, సిర్పూరు, మంచిర్యాల నియోజకవర్గాల రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వార్దా నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించి చేతులు దులుపుకుంది. సిర్పూర్ నియోజకవర్గంలో 56,900, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 38,830, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలలో 72,770, చెన్నూరు నియోజకవర్గంలో 31,500 ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పింది. కానీ, పదేండ్లపాటు కాలయాపన చేసింది. తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రాజెక్టు డీపీఆర్‌కు నిధులు విడుదల చేసింది.
ఇప్పుడు కూడా అనుమానాలే
ఇప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత లేదు. ఆరు నెలల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్షలు నిర్వహిస్తున్నా, ఇంకా డీపీఆర్ దశలోనే మగ్గుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన తుమ్మిడిహట్టి నుంచి మైలారం ద్వారా ఎల్లంపల్లికి నీటి తరలింపు నిర్ణయాన్ని పక్కన పెట్టి.. సుందిళ్ల బ్యారేజీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే వ్యయం తగ్గుతుందని అధికారుల అంచనా. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీకి నిధులు విడుదల చేశారు. కానీ సుందిళ్ల బ్యారేజీలో 2 నుంచి 2.5 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఎ) ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం మాత్రం దీనికే మొగ్గు చూపడంతో ఆచరణలో ఇది ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందనే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. సమీక్షలు జరుపుతున్నంత వేగంగా కదలికలు లేవు. ఇరిగేషన్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. డిసెంబర్‌లో పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశాలు ఉన్నా పనులు ముందుకు సాగడంలేదు.
వ్యయం తగ్గింపు పేరుతో
ప్రస్తుతం తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే బదులు సుందిళ్ల బ్యారేజీకి దీనిని అనుసంధానం చేసి అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తే ప్రాజెక్టు వ్యయం రూ.1600 కోట్లు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. కానీ దీని సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొంటున్నాయి. గతంలో కూడా ప్రాణహితపై ప్రాజెక్టు నిర్మాణానికి బదులు వార్దా నదిపై చేపడితే వ్యయం తగ్గుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత అది కూడా అప్పట్లో మూలకు పడింది.
మా భూములకు నీళ్లు వస్తయా : మండ్రె కాంతారావు
ఇక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుపోతరు. కానీ మా భూములకు నీళ్లు వస్తాయా? ఎందుకంటే వాగుల లెక్కన పెద్ద పెద్ద కాలువలను తవ్విండ్రు. ఈ కాలువల నుంచి నీళ్లు ఎలా ఇస్తారో తెలియదు. మాకు నీళ్లు ఇస్తామని ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు.
నిర్మిస్తే మూడు పంటలకు నీళ్లు : టేకుల రాములు
ప్రాజెక్టు నిర్మిస్తే మేము మూడు పంటలు పండించుకుంటం. మా భూములు సేద్యానికి అనుకూలమైనవి. ఈ నేలతల్లిని నమ్ముకొని జీవిస్తున్నం. నీళ్లు లేక, పంటలు పండక మా బతుకులు ఇలా ఉన్నయి. నీటి సౌలత్ వస్తే మా బతుకులు బాగుపడతయి
పైసలే లేవంటుండ్రు.. ప్రాజెక్టెలా కడుతరు : జాడె గుండాజీ
ముఖ్యమంత్రే పైసలు లేవని అంటున్నారు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా కడుతారు? రెండు లక్షల రుణమాఫీ అన్నారు. అదీ లేదు. రైతుబంధు లేదు. మా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి ఉపయోగమూ లేదు. ఈ ప్రాజెక్టు కడతామని వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పిండు. తర్వాత వచ్చిన కేసీఆర్ చెప్పిండి. ఇప్పుడు మళ్లీ వీళ్లు చెపుతుండ్రు. ఈ ప్రాజెక్టు గురించి పేపర్‌లలో చూసి చూసి మాకే విసుగొస్తోంది.



