అలా చేస్తే అమెరికా ఊరుకుంటుందా?
ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ
దేశీయ ఇంధన భద్రతపై ఇండియాకు కష్టాలు
న్యూఢిల్లీ : క్షిపణులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. అందులో భాగంగా హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్‌కు ఇది పెను సవాల్‌గా మారింది.ప్రపంచ చమురు సరఫరాలో 20శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. భారత్ రోజూ వినియోగించే 60 లక్షల బారెళ్ల చమురులో దాదాపు 27 లక్షల బారెళ్లు ఈ మార్గం నుంచే రావాలి. ఇప్పుడు ఈ దారి మూసివేయడంతో దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు భారత్ ముందున్న ఒకే దారి ‘రష్యా’. భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి మళ్లీ రష్యా వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరిలో అమెరికా, భారత్ మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా లేదా వెనిజులా నుంచి తీసుకోవాలని వాషింగ్టన్ షరతు విధించింది. ఈ నిబంధనను అంగీకరించినందుకు గాను అమెరికా భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌ను 50శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. హర్మూజ్ మార్గం మూతపడటంతో భారత్‌కు రష్యా చమురు తప్ప వేరే గమ్యం కనిపించడం లేదు. కానీ రష్యా నుంచి కొనుగోళ్లు పెంచితే, అమెరికా మళ్లీ భారీ టారిఫ్‌లు విధించే అవకాశమూ లేకపోలేదు. అయినప్పటికీ, దేశీయ అవసరాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య రష్యా ఇంధనాన్ని భారత్ ‘ట్రంప్’ కార్డుగా వాడే అవకాశంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీలో 60శాతం, ఎల్‌పీజీలో మెజారిటీ భాగం ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. ఖతార్ వంటి దేశాల నుంచి ఉత్పత్తి నిలిచిపోవడంతో భారత్‌లో ఇప్పటికే గ్యాస్ కోతలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ దేశంలో ఇంధన లభ్యతపై స్పందించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పైకి చెబుతున్నా.. మోడీ సర్కార్‌కు చమురు కష్టాలు షురూ అయ్యాయని స్పష్టమవుతోంది.అయితే అంతర్గతంగా ప్రభుత్వం పలు అత్యవసర చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ చర్యల్లో భాగంగా వంట గ్యాస్ సరఫరాపై పరిమితులు విధించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నియంత్రణ, ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు సరఫరాలో 10శాతం నుంచి 30శాతం వరకు కోత విధించారు. భారత్ వద్ద ఉన్న చమురు నిల్వలు 90 రోజుల లోపు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. ఈలోపు పశ్చిమాసియాలో యుద్ధం ఆగిపోకపోతే భారత్‌కు ఇంధన లభ్యతపై పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది.
గల్ఫ్ దేశాలతో పుతిన్ మంతనాలు
యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించిన తర్వాత, పుతిన్ గల్ఫ్ దేశాల నాయకులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఇరాన్ డ్రోన్ దాడుల వల్ల సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీ, యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఫెసిలిటీ, ఖతార్‌లోని రాస్ లఫాన్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఇది అరబ్ దేశాల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నది. సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో పుతిన్ చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
రష్యాకు ఇటు ఇరాన్‌తోనూ, అటు అరబ్ దేశాలతోనూ మంచి సంబంధాలు ఉండటంతో పుతిన్ మధ్యవర్తిత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.తైవాన్ వంటి దేశాలు ప్రపంచానికి అవసరమైన అధునాతన సెమీకండక్టర్ చిప్‌లను సరఫరా చేస్తాయి. ఈ పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అవసరం. ఇంధన కొరత ఏర్పడితే విద్యుత్ ఉత్పత్తి తగ్గి, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ వ్యవస్థల తయారీ ఆగిపోయే ప్రమాదం ఉంది. చైనా వద్ద ఆరు నెలలకు సరిపడా చమురు నిల్వలు ఉండటం వల్ల ఆ దేశం కొంతకాలం ఈ సంక్షోభాన్ని తట్టుకోగలదు. కానీ భారత్ వంటి దేశాలు తక్షణమే ప్రత్యమ్నాయ మార్గాలను వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది.
అమెరికా డేటా సెంటర్లే లక్ష్యంగా దాడులు
గల్ఫ్‌లోని ఇరాన్ లక్ష్యాలలో తాజాగా అమెరికా డేటా సెంటర్లు చేరాయి. అమెరికా ఆస్తులు, అరబ్ వ్యాపార ప్రయోజనాలపైదాడులు చేస్తున్న ఇరాన్ మంగళవారం యూఏఈ, బహ్‌రైన్‌లలో ఉన్న అమెజాన్ వెబ్ సర్వీసుల (ఏడబ్ల్యూఎస్) డేటా సెంటర్లపై పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు జరిపింది. సౌదీకి చెందిన చమురు సంస్థ ఆరామ్కోకు చెందిన రిఫైనరీపై ఇరాన్ ఇటీవలే దాడి చేసింది. ఇప్పుడు గల్ఫ్‌లోని ఎడబ్ల్యూఎస్ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. దీనికి కారణమేమిటంటే…డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలంటే అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. అమెరికా వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీయాలంటే ఈ సెంటర్లపై దాడి చేయాలని ఇరాన్ భావిస్తోంది.
అదీకాక సైనిక కార్యకలాపాలకు డేటా సెంటర్లు అందించే సమాచారం ఎంతో కీలకంగా ఉంటుంది. ఆ కార్యకలాపాలకు నష్టం కలిగించాలంటే డేటా కేంద్రాలపై దాడులు అనివార్యం అవుతాయి. డేటా సెంటర్లపై దాడి చేసి నష్టపరిస్తే వాటిపై ఆధారపడిన వ్యాపార సంస్థల కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. యూఏఈలోని ఎడబ్ల్యుఎస్ క్లౌడ్ యూనిట్‌పై ఇరాన్ దాడులు చేసింది. బహ్‌రైన్‌లోని మరో డేటా సెంటర్ సమీపంలో పేలుడు జరిగింది. దీంతో దానికి కొంత నష్టం వాటిల్లింది. క్లౌడ్ సర్వీసులపై దాడుల కారణంగా ఎడబ్ల్యూఎస్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిర్మాణాలకు నష్టం వాటిల్లింది. దీంతో కంపెనీ కొన్ని కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.



