Sunday, March 29, 2026
E-PAPER
Homeమానవిఒత్తిడి పెరుగుతుందా?

ఒత్తిడి పెరుగుతుందా?

- Advertisement -

గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అందమైన అనుభూతి. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భం శారీరకంగానే కాదు, మానసికంగానూ ఒత్తిడికి గురిచేస్తుంది. దీని మూలంగా కొంతమంది ఆందోళనకూ గురవుతుంటారు. ఈ క్రమంలో గర్భధారణ సమయంలో నిరంతర ఒత్తిడి వల్ల నిద్రలేమి, అధిక రక్తపోటు, ఆకలి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఇది అకాల ప్రసవాలకు, శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఈరోజు తెలుసుకుందాం…

గర్భధారణ సమయంలో ఒత్తిడి కలగడం సహజం. శారీరక మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గులు, శిశువు ఆరోగ్యం, ప్రసవం, కొత్త బాధ్యతల పట్ల ఆందోళన వంటివి ఒత్తిడికి ప్రధాన కారణాలు. ఈ క్రమంలో పుట్టబోయే బిడ్డ కోసం సిద్ధమవ్వడం ఎంత ముఖ్యమో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే అవసరమంటున్నారు నిపుణులు. అధిక ఒత్తిడి వల్ల మీకు నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, ఆకలి లేకపోవడం లేదా అతిగా తినే ధోరణి ఏర్పడవచ్చని, ఇవన్నీ మీకు, పుట్టబోయే బిడ్డకు హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రభావాలను అర్థం చేసుకోవడం
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్‌, అడ్రినలిన్‌ వంటి హార్మోన్లు విడుదలవు తాయంటున్నారు నిపుణులు. ఇవి తల్లిపై ప్రభావం చూపడమే కాకుండా పరోక్షంగా పిండం అభివృద్ధిని కూడా దెబ్బ తీస్తాయని కొన్ని అధ్యయనలు చెబుతున్నాయి. ఈ హార్మోన్లు అధిక మోతాదులో విడుదల అవ్వడం వల్ల నిద్రలేమి, అధిక రక్తపోటు, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాకింగ్‌, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రశాంతంగా నిద్రపోవడం
అలసట పెరిగే కొద్దీ ఒత్తిడి స్థాయి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో రాత్రిపూట 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే పగటిపూట చిన్నపాటి కునుకు తీయడం వల్ల అలసట తగ్గుతుందని అంటున్నారు. అయితే నిద్రపోయే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకునే అలవాట్లను అలవరచుకోవడం చాలా మంచిదట. నిద్రపోయే ముందు సోడా, కాఫీ, టీ వంటి పానీయాలను తగ్గించుకోవడం లేదా పరిమితం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పోషకాహారం ముఖ్యం
రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల మానసిక స్థితి, శక్తి స్థాయిలు కూడా స్థిరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి హార్మోన్లు పెరగడానికి కారణమయ్యే చిరాకు, బలహీనతను నివారించడానికి.. ప్రొటీన్లు, ధాన్యాలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

శారీరక శ్రమ
చాలా మంది గర్భం దాల్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. సాధారణంగా అలాంటి భావనే అనిపిస్తుంది. కానీ నడక, ప్రినేటల్‌ యోగా (గర్భధారణ సమయంలో చేసే యోగా), స్ట్రెచింగ్‌ వంటి వ్యాయామాలు డాక్టర్ల సూచన మేరకు చేస్తే తల్లీబిడ్డలిద్దరికీ మంచిదంటున్నారు నిపుణులు. దీంతో రక్తప్ర సరణ మెరుగుపడుతుందట. ఇవి ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా గర్భధారణ సమయంలో కలిగే ఆందోళనను తగ్గిస్తాయని అంటున్నారు. అలాగే సుఖ ప్రసవానికి కూడా వ్యాయామం చాలా బాగా పని చేస్తుంది.

ఫ్యామిలీ సపోర్ట్‌
గర్భధారణ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యలైనా, మనసులోని భయాలనైనా మీ భాగస్వామి, కుటుంబం లేదా వైద్యులతో మనసు విప్పి మాట్లాడటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు. ప్రసవం, శరీరంలో వచ్చే మార్పులు, పిల్లల పెంపకం గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే సంకోచించకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -