పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా అందని వేతనాలు
ఇచ్చేదే రూ.9,500…కొన్ని చోట్ల ఆ వేతనాన్ని పంచుకోవాల్సిన దుస్థితి
మల్టీపర్పస్ పనివిధానం రద్దు, కనీస వేతనం హామీలు బుట్టదాఖలు
నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయినా…కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినా పంచాయతీ కార్మికుల జీవితాలు మారలేదు. సకాలంలో జీతాలూ అందట్లేదు. స్థానిక సంస్థల పాలకమండళ్లు లేకపోవడంతో వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. వచ్చేదే అరకొర వేతనం. అదీ మూడు నెలల నుంచి రాష్ట్ర సర్కారు ఇవ్వలేదు. ఊరి చెత్తనంతా శుభ్రం చేస్తూ మురికికూపంలో గొడ్డుకష్టం చేసే తమలాంటి వాళ్ల పట్లా ఎందుకీ వివక్ష? పండుగ పూట కూడా పస్తులుండాల్సిందేనా? పండుగెట్ట చేసుకోవాలి? పది, ఇరవై రూపాయల కోసం చేతులు చాపాల్సిందేనా? అని పంచాయతీ కార్మికులు గోస వెళ్లబుచ్చుతున్నారు. ‘జీతాలిస్తే ఆత్మగౌరవంతో పండుగ చేసుకుంటాం. వెంటనే విడుదల చేయండి’ అంటూ తమ గోడును సర్కారుకు వినిపించేలా శుక్రవారం కలెక్టరేట్ల ముట్టడికి తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) యూనియన్ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో 53 వేల మంది మల్టీపర్పస్ గ్రామ పంచాయతీ కార్మికులున్నారు. ఇంకా ఆన్‌లైన్‌లో పేర్లు ఎక్కని వారు మరో 8 వేల మంది దాకా ఉన్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 53 వేల మంది కార్మికులకు ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనాన్ని అందిస్తున్నది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులోనూ పంచాయతీ కార్మికులకు ప్రతి నెలా వేతనాలు అందట్లేదు. ప్రతి నెలా మొదటి వారంలోనే గ్రీన్‌ఛానల్ ద్వారా వేతనాలిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించినప్పటికీ ఆచరణలో ఇంకా పట్టాలెక్కలేదు. రాష్ట్రంలో మూడు నెలలుగా మల్టీపర్పస్ కార్మికులకు వేతనాలు అందట్లేదు. రూ.150 కోట్ల రూపాయల మేరకు పెండింగ్‌లో ఉన్నాయి. జీపీ కార్మికులంతా దళిత, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారే. అదే జీతంపై ఆధారపడే కార్మికులు జీతాలు సకాలంలో అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రద్దు కాని మల్టీపర్పస్… పట్టాలెక్కని హామీలు
జీవో నెంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని పంచాయతీ కార్మికులు బీఆర్‌ఎస్ సర్కారు హయాం నుంచి కొట్లాడుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆ పని విధానం వల్ల 200 మందికిపైగా పంచాయతీ కార్మికులు చనిపోయారు. తాము అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ పనివిధానాన్ని రద్దు చేస్తామని అప్పట్లో కాంగ్రెస్ నేతలు హామీనిచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా ఇప్పటి వరకూ దాని రద్దు ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం కేటగిరీల వారీగా కాకుండా గుండుగుత్తగా కార్మికునికి ఇంత అని కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేటగిరీల వారీగా వేతనాల ఇస్తామన్న హామీ బుట్టదాఖలైంది. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలిస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా ఆచరణకు నోచలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్, అర్హులైన కారోబార్లు, బిల్‌కలెక్టర్లను గ్రామపంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలనే డిమాండ్లను రాష్ట్ర సర్కారు పట్టించుకోవట్లేదు. గతంలో రాష్ట్రంలో అధికారికంగా 36 వేల మంది కార్మికులుండగా…కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఆన్‌లైన్‌లో 17 వేల వరకు కార్మికుల పేర్లు ఎక్కించింది. ఇంకా పేర్లు ఎక్కించని వారు ఎనిమిది వేల మంది దాకా ఉన్నారు. ఆన్‌లైన్ పేర్లు ఎక్కని వారు ఆయా గ్రామపంచాయతీల్లో కార్మికులు పొందే వేతనాన్ని పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను కూడా రాష్ట్ర సర్కారు పరిష్కరించాల్సి ఉంది.
పండుగకు జీతాలివ్వకుంటే పోరాటం ఉధృతం : పాలడుగు భాస్కర్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు
తెలంగాణలో దసరా అత్యంత సాంప్రదాయ, ప్రతిష్టాత్మకమైన పండుగ. బతుకమ్మ సంబురాలు, దసరా పండుగ ప్రకృతితో కూడుకున్నవి. బంధువులు, ఆడబిడ్డలు ఇంటికొస్తారు. ఇలాంటి పండుగ చేసుకునే పరిస్థితి పంచాయతీ సిబ్బందిలో కనబడటం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించకపోవడం, బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. రోడ్లెక్కి పోరాడినప్పుడే ఒకటెండ్రు నెలల జీతాలు విడుదల చేసి చేతులు దులుపుకోవడం పాలకులకు అలవాటైంది. మూడు నెలల నుంచి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు పండగపూట పస్తులుండాల్సిన పరిస్థితి. తక్షణమే ఒకటెండ్రు రోజుల్లో బడ్జెట్ కేటాయించి జీతాలివ్వాలి. ఈ నెల 26తో మొదలయ్యే ఆకలికేకల పోరాటాన్ని ఉధృతం చేస్తాం.
దసరా పండుగకు పస్తులేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES