Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీవీటీజీలపై ఇంత నిర్లక్ష్యమా..?

పీవీటీజీలపై ఇంత నిర్లక్ష్యమా..?

- Advertisement -

– ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం
– దుబ్బగూడ ఆదివాసుల ఇండ్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం : కొలాం ఆదివాసుల రిలే దీక్షలకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మద్దతు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాల మండలం దుబ్బ గూడ కొలాం పీవీటీజీ ఆదివాసుల ఇండ్ల సమస్యల పై ఐదు రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కొలాం ఆదివాసుల రిలే దీక్షలు బుధవారం ఐదో రోజుకు చేరుకోగా.. వారికి జ్యోతి మద్దతు తెలియ జేస్తూ మాట్లాడారు. దుబ్బగూడ కొలాం ఆదివాసీ మహిళ లేతుబాయి ఊరి కోసం భూమి దానం చేస్తే.. అధికారులు కేసులతో ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కూడా ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం చెబుతుంటే.. ఆపడం దుర్మార్గం అన్నారు. అంతరించిపోతున్న తెగలలో కొలాం తెగ ఒకటని, వారి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలి కానీ ఆటంకాలు పెట్టడం సరికాదని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఇండ్ల నిర్మాణం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కారం చేయని పక్షంలో ఈ సమస్యను రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మారుస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పూసం సచిన్‌, ఏరియా కమిటీ కార్యదర్శి లంక రాఘవులు, నాయకులు కొట్నాక్‌ సక్కు, రామన్న, గంగారాం, ఆశన్న, అరిఫా, గ్రామ పటేల్‌ జంగు, భూదాత ఆత్రం లేతుబాయి, రామారావు, ముత్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -