తాగునీరు కలుషితం
సగానికి తగ్గిన ఆర్టీసీ బస్సులు
వరుసగా వృద్ధుల హత్యలు
బస్తీల్లో పెరిగిన డ్రగ్స్ వాడకం
ఆడపిల్లలపై ఆగని ఆగడాలు
31 శాతం పెరిగిన డాగ్ బైట్స్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల తాగునీటిలో మురికి నీరు కలుస్తోంది. మరి కొన్ని చోట్ల తాగునీరు పెట్రోల్ వాసన వస్తోంది. ప్రతి నిత్యం నగరంలో ఏదో ఒక చోట వృద్ధుల హత్యలు జరుగుతున్నాయి. బస్తీల్లో ఖాళీలు స్థలాలను చెత్త డంపింగ్ కు యధేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. అక్కడే డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువగా ఉంటోంది. ఆ దారుల్లో వెళ్లే ఆడపిల్లలపై నిత్యం ఆగడాలు జరుగుతున్నాయి. మరోవైపు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి స్టెరిలైజ్ కోసం కేటాయించిన నిధులను సరిగా వినియోగించుకోకపోవడంతో రెండేండ్లలో కుక్కకాటు కేసులు 31 శాతం పెరిగాయి. ఆర్టీసీ బస్సులను సగానికి తగ్గించారు. సామాన్యులకు ప్రజా రవాణా అందుబాటులో లేకుండా చేశారు. వికలాంగులైతే ఆర్టీసీ బస్సులు ఎక్కే పరిస్థితే లేదు. ఇలాంటి నగరం విశ్వనగరం అవుతుందా? …. ‘ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు ఆమె చేపట్టిన జనం బాట ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆదివా రం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశం లో మాట్లా డారు. జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలను విలీనం చేసిన తర్వాత ఒక కోటి మందికి పైగా జనాభా పెరిగారని తెలిపారు. అంతకుముందు 7,700 ఆర్టీసీ బస్సులుంటే వాటిని 3,500కు తగ్గించారని తెలిపారు. ప్రజా రవాణా లేకపోవడంతో 80 లక్షల ప్రయివేటు వాహనాలను అనివార్యంగా ప్రజలు వినియోగించే పరిస్థితికి ప్రభుత్వమే కారణమమని ఆమె విమర్శించారు. 2022లో నగరంలోలో కుక్కకాటుకు సంబంధించి 92,924 నమోదైతే 2024 నాటికి 1,23,997 (31 శాతం) అధికంగా నమోదయినట్టు చెప్పారు.
లంగర్‌హౌజ్ బాపూఘాట్‌ను డ్రగ్స్, గంజాయి తీసుకునే అసాంఘిక శక్తులు ఉపయోగించుంటున్నా నియంత్రణ చర్యలు లేవని తప్పుపట్టారు. యాకుత్‌పురా నియోజకవర్గంలో తాగునీటిలో మురికి నీరు కలిసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అడిక్‌మెట్‌లో వస్తున్న తాగునీరు పెట్రోల్ వాసన వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనత్‌నగర్ దాసరి బస్తీలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంను పిల్లలు ఆడుకునేందుకు ఇవ్వకుండా వ్యాపార అవసరాల కోసం ప్రయివేటు వ్యక్తుల కార్యక్రమాలకు ఇస్తున్నారని కవిత ఆరోపించారు.
సింగరేణి డబ్బులతో ఫుట్‌బాల్ ఆడుతారా?
సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడం వల్ల ఎవరికి ప్రయోజనం? అని కవిత ప్రశ్నించారు. ప్రజలకు ఉపయోగపడని ఆ ఆట కోసం జీవోను మార్చి సింగరేణి నిధులను రూ.10 కోట్లను మళ్లించారని ఆమె ఆరోపించారు. ఆ నిధులను తిరిగి సింగరేణికి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీలను విలీనం చేశారని ఆమె ప్రశ్నించారు.
ఆ విగ్రహం పెట్టొద్దు
రవీంద్రభారతిలో ఎస్.పి.బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని కవిత తప్పుపట్టారు. ఆ విగ్రహాన్ని పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు. విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్న తెలంగాణవాదుల పక్షాన్నే తాను నిలబడతానని స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు. సినీ పరిశ్రమకు చెందిన బాల సుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటుకు వేరే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని ఆమె సూచించారు.
రాష్ట్రానికి నిధులివ్వని కేంద్రం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు అదనంగా నిధులు, ఇవ్వాల్సిన వాటాను కూడా పెండింగ్‌లో పెడుతున్నదని కవిత విమర్శించారు. హైదరాబాద్ లాంటి నగరాలకు అదనంగా నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తుచేశారు. 2019-20 నుంచి 2024-25 వరకు తెలంగాణ నుంచి రూ.4,35,919 కోట్లను పన్నుల రూపేణా వసూలు చేసిన కేంద్రం వాటిలో కేవలం రూ.3,76,715 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. రూ.59,200 కోట్లను పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు.



