Friday, February 13, 2026
E-PAPER
Homeఆటలుఇషాన్‌, హార్దిక్‌ షో

ఇషాన్‌, హార్దిక్‌ షో

- Advertisement -

రాణించిన వరుణ్‌, బుమ్రా, అక్షర్‌
నమీబియాపై భారత్‌ ఘన విజయం
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ తడబడుతున్నా.. తిరుగులేని విజయాలు సాధిస్తోంది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో నమీబియాపై ఆతిథ్య భారత్‌ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 210 పరుగుల ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో 10 వికెట్లకు 116 పరుగులే చేసింది. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (3/7), అక్షర్‌ పటేల్‌ (2/20), హార్దిక్‌ పాండ్య (2/21), బుమ్రా (1/20) వికెట్ల వేటలో విజృంభించారు. నమీబియా బ్యాటర్లలో ఓపెనర్లు లారెన్‌ స్టీన్‌కాంప్‌ (29, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), జేన్‌ ఫ్రైలింక్‌ (22, 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (18, 11 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు.

పవర్‌ప్లేలో 58/1తో మెరిసిన నమీబియా.. వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌కు విలవిల్లాడింది. తొలి స్పెల్‌లో 2 ఓవర్లలో 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టిన వరుణ్‌ నమీబియా ఆశలు ఆవిరి చేశాడు. ఆ తర్వాత ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (61, 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (52, 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. గ్రూప్‌-ఏలో భారత్‌కు రెండు మ్యాచ్‌ల్లో ఇది రెండో విజయం.

కిషన్‌, హార్దిక్‌ దంచెన్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు ధనాధన్‌ ఆరంభం అందించారు. సంజు శాంసన్‌ (22) బంతుల్లోనే ఓ ఫోర్‌, 3 సిక్సర్లతో విరుచుకుపడగా.. ఇషాన్‌ కిషన్‌ (61) సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. పవర్‌ప్లేలో సంజు శాంసన్‌ అవుటైనా.. తిలక్‌ వర్మ (22)తో కలిసి 31 బంతుల్లోనే 79 పరుగులు జోడించాడు ఇషాన్‌ కిషన్‌. ఆచితూచి ఆడిన తిలక్‌ వర్మ మూడు ఫోర్లతో 21 బంతుల్లో 25 పరుగులే చేసినా.. మరో ఎండ్‌లో కిషన్‌ ఎదురుదాడితో భారత్‌ జోరు తగ్గలేదు. ఇషాన్‌ 20 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఓ సిక్సర్‌తో మెరిసినా, ఈ మ్యాచ్‌లో అతడి జోరు కొనసాగలేదు.

పవర్‌ప్లే తర్వాత హార్దిక్‌ (52), శివం దూబె (23) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బంతుల్లో 81 పరుగులు చేసి భారత్‌ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లారు. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హార్దిక్‌ పాండ్య 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. భారత్‌ 18.1 ఓవర్లలో 200 పరుగుల మార్క్‌ దాటింది. మరో 11 బంతులు ఉండటంతో 230-240 స్కోరు సాధ్యమే అనిపించింది. కానీ ఇక్కడే భారత బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలారు. హార్దిక్‌ పాండ్య, శివం దూబె (23) సహా అక్షర్‌ పటేల్‌ (0), రింకు సింగ్‌ (1), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2) నిరాశపర్చటంతో ఆఖరు 11 బంతుల్లో 4 పరుగులకే భారత్‌ 5 వికెట్లు చేజార్చుకుంది. నమీబియా బౌలర్‌ ఎరాస్మస్‌ (4/20) నాలుగు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -