Monday, October 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనేడు ఈజిప్టులో ఇజ్రాయిల్‌- హమాస్‌ మధ్య చర్చలు

నేడు ఈజిప్టులో ఇజ్రాయిల్‌- హమాస్‌ మధ్య చర్చలు

- Advertisement -

గాజాకు తిరిగి చేరుకుంటున్న పాలస్తీయన్లు

కైరో : తీవ్రంగా నష్టపోయిన గాజాలో పరిస్థితుల్ని దారిలో పెట్టేందుకు జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియపై ఇజ్రాయిల్‌ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. హమాస్‌పై అనేక రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తోంది. శాంతి చర్చలకు హమాస్‌ ముందుకు రావట్లేదని ప్రచారం చేస్తోంది. కొందరు హమాస్‌ మంత్రుల పేర్లను ఉటంకిస్తూ ‘శాంతి ఒప్పందంపై తాము సంతకం పెట్టబోం’ అని చెప్తున్నారని పేర్కొంది.

అయితే సోమవారం ఈజిప్ట్‌లో జరిగే శాంతి చర్చలకు తాము హాజరవుతున్నామని హమాస్‌ తెలిపింది. అయితే హమాస్‌ రాజకీయ బ్యూరో సభ్యుడు హోసమ్‌ బద్రాన్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘హమాస్‌ సభ్యులైనా కాకపోయినా పాలస్తీనియన్లను వారి మాతృభూమి నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటంలో అర్థమే లేదు’ అని చెప్పారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటించనున్నారు.

67,682 మంది మరణం
2023 అక్టోబర్‌ నుంచి గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధంలో కనీసం 67,682 మంది మరణించారు. 1,70,033 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్‌ 7న జరిగిన దాడుల్లో ఇజ్రాయిల్‌లో మొత్తం 1,139 మంది మరణించారు. దాదాపు 200 మంది బందీలుగా పట్టుబడ్డారు.

ఈజిప్ట్‌ వేదికగా..
గాజా శాంతి సదస్సుకు రండి : మోడీకి ఆహ్వానం
ఈజిప్ట్‌లోని షర్మ్‌-ఎల్‌ షేక్‌లో సోమవారం జరిగే గాజా శాంతి సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా, ఈజిప్ట్‌ అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌, అబ్దెల్‌ ఫతా అల్‌-సిసి ఆహ్వానించారు. మోడీకి చివరి క్షణంలో…అంటే శనివారంనాడు ఈ ఆహ్వానం అందిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజా స్ట్రిప్‌లో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన ఈ అంతర్జాతీయ సదస్సుకు మోడీ హాజరయ్యే విషయాన్ని ప్రధాని కార్యాలయం ఇంకా ధృవీకరించలేదు.

సిసి, ట్రంప్‌లు సంయుక్తంగా సదస్సుకు అధ్యక్షత వహిస్తారని, ఇరవైకి పైగా దేశాల నేతలు దీనికి హాజరవుతున్నారని ఈజిప్ట్‌ అధ్యక్ష ప్రతినిధి చెప్పారు. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతలను బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ భద్రతలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశామని వివరించారు.

శిథిలాల తొలగింపు షురూ
గాజాలో ధ్వంసమైన పట్టణాలు, నగరాలకు పాలస్తీనియన్లు తిరిగి వస్తున్నారు. రెండేండ్ల యుద్ధం తర్వాత గాజా నగరంలో బుల్డోజర్లు శిథిలాలను తొలగించడం ప్రారంభించాయి. వేలాది మంది బలవంతంగా స్థానభ్రంశం చెంది, నిరాశ్రయులుగా మారిన విషయం తెలిసిందే. ఆ దేశంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పాలస్తీనియన్లు ఉత్తర గాజాలో నాశనమైన పట్టణాలు, నగరాలకు తిరిగి వస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -