ఇరాన్ మతగురువు హెచ్చరికలు
టెహ్రాన్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సైనిక చర్యలు, పరస్పర హెచ్చరికలు, క్షిపణి దాడులతో ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వ మీడియా, అధికారుల వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
దేశ ఐక్యతను కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చిన మత గురువు
ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన సందేశంలో ప్రముఖ మత గురువు అయతొల్లా అబ్దుల్లా జవాది అమోలీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇజ్రాయిల్, అమెరికా నేతలపై రక్తపాతం తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశ ఐక్యతను కాపాడుకోవాలని, శత్రువులపై కఠినంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అమెరికా తప్పక అనుభవిస్తుంది!
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా అమెరికాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా జలాంతర్గామి దాడిలో ఇరాన్ నౌకాదళానికి చెందిన ఐఆర్‌ఐఎస్ డెన ఫ్రిగేట్ మునిగిపోయిందని ఆరోపించారు. ఇది అంతర్జాతీయ జలాల్లో జరిగిన దాడి అని, అమెరికా దీని ఫలితాలను అనుభవిస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయని అన్నారు.
అమెరికా, ఇజ్రాయిల్ పర్యవేక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయంటూ!
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్4 పేరిట మరో దాడి దశ ప్రారంభించినట్టు ప్రకటించింది. క్షిపణులు, డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయిల్ లక్ష్యాలపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ ఛానల్ ప్రెస్ టీవీ సమాచారం ప్రకారం, అమెరికాు ఇజ్రాయిల్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, వారి పర్యవేక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అలాగే బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారినట్టు వెల్లడించారు.
బంకర్లలో ఆశ్రయం పొందుతున్న ప్రజలు
క్షిపణి దాడులతో ఇజ్రాయిల్‌లో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి అలర్ట్ కొనసాగుతోంది. ప్రజలు బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇరాన్ వర్గాలు మాత్రం ఇది ప్రారంభమే, రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కూడా తమ ఆపరేషన్ ఇప్పుడే మొదలైందని చెప్పడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. దీంతో పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు అంతర్జాతీయ సమాజం జోక్యం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు
ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమేనీ అమెరికా- ఇజ్రాయిల్ సంయుక్త దాడిలో మరణించారని ప్రభుత్వ అనుబంధ మీడియా మరోసారి పేర్కొంది. ఆయన మృతదేహాన్ని గ్రాండ్ మోసల్లా ఆఫ్ తెహ్రాన్ వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మూడు రోజులపాటు అంతిమ వీడ్కోలు కార్యక్రమాలు, అంత్యక్రియల శోభాయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. వేలాది మంది భక్తులు, మద్దతుదారులు హాజరయ్యే అవకాశం ఉంది.



