Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీని కమ్మేసింది

ఢిల్లీని కమ్మేసింది

- Advertisement -

వారం రోజులుగా ప్రమాదకరస్థాయిలో కాలుష్యం
దీపావళి వేడుకల తరువాత రెడ్‌ జోన్‌లోకి 36 పాయింట్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. వారం రోజులుగా ప్రమాదకర స్థాయిలో వాయుకాలుష్యం కొనసాగుతోంది. దీపావళి వేడుకల తర్వాత అది మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) 451 పాయింట్లతో నమోదైంది. ఎన్సీఆర్‌ పరిధిలో మొత్తం 38 ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లు ఉండగా… దాదాపు 36 పాయింట్లలో వెరీ పూర్‌ కేటగిరితో రెడ్‌జోన్‌ను చూపించాయి. వజీర్‌పూర్‌ 423, ద్వారకా 417, అశోక్‌విహార్‌ 404, ఆనంద్‌ విహార్‌లో 404 ఏక్యూఐ నమోదైంది. అలాగే పటేల్‌నగర్‌, జహంగీర్‌పురి, బురారి వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ 480 దాటినట్టు వెల్లడైంది. ఇది దేశ సగటు కంటే దాదాపు 1.8 రెట్లు ఎక్కువని అధికారులు తెలిపారు. అలాగే యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ రికార్డుల ప్రకారం… ఏకంగా 15 రెట్లు ఎక్కువని నిపుణులు తెలిపారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీబీసీబీ) పేర్కొంది. బుధవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అత్యవ సర పరిస్థితుల్లోనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. కాలుష్యం పెరగడంలో కళ్లు, ముక్కు, గొంతులో మంట, దురద సమస్యలు తలెత్తే అవకాశముందని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

గతేడాదితో పొల్చితే పెరిగిన కాలుష్యం
గతేడాది దీపావళి మరుసటి రోజు ఉదయం ఏక్యూఐ 296 పాయింట్లుగా నమోదు కాగా.. ఈసారి దీపావళి పండుగ రోజు సాయంత్రానికే ఎయిర్‌ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ఇందుకు బాణాసంచా కాల్చడమే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్సీఆర్‌ పరిధిలో బాణాసంచా కాల్చడంపై ఇటీవల సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే… కొత్తగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్‌ విజ్ఞప్తితో ఈసారి గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చుకునేందుకు అక్టోబర్‌ 15న సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. అయితే… ఈ గ్రీన్‌ క్రాకర్స్‌ పేరుతో మార్కెట్లో ఎక్స్‌పయర్స్‌ డేట్‌, నాణ్యత లేని బాణాసంచా అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. ఫలితంగా బాణాసంచా సౌండ్స్‌ కన్నా… పొల్యూషన్‌ భారీగా పెరిగింది. అలాగే ఢిల్లీవాసులు సైతం భారీగా బాణాసంచాను కొనుగోలు చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపా సులు కాల్చుకునేందుకు కోర్టు అనుమతివ్వగా… అర్థరాత్రి వరకు బాణాసంచా కాల్చారు. దీనికి వాతావరణ మార్పులు తోడవడంతో కాలుష్య కారకాలు అలాగే అంటి పెట్టుకొని గాలి తేమతో కలిసిపోయాయి.

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌…
ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌ కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రకారం… ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ)లో స్థానిక ప్రాంతంలోని గాలి నాణ్యతలను తెలుసుకోవచ్చు. ఏక్యూఐ 0-100 శాతం మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని అర్థం. అదే 100 – 200 శాతం ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని, ఇక 200-300 శాతం మధ్య ఉంటే అధ్వానంగా ఉందని, 300 -400 ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉన్నట్టు. ఇక 400-500 శాతం మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు లెక్క.ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన కాలుష్యంతో సర్కార్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గ్రేడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ) రెండో దశను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం… నిర్మాణ పనులపై పరిమితులు విధించింది. తద్వారా నిర్మాణ సైట్స్‌ నుంచి వచ్చే దుమ్ము, ధూళిని కంట్రోల్‌ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే డీజిల్‌ జనరేటర్ల వినియోగంపై నిషేధం పెట్టింది. ప్రయివేట్‌ వాహనాలను కంట్రోల్‌ చేసేలా… ఎలక్ట్రిక్‌ బస్సులు, మెట్రో రైళ్ళ సేవలు పెంచింది. స్టూడెంట్స్‌, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల కోసం ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టే పరిశీలన చేస్తోంది. వీటితో పాటు రోడ్లపై నీటి స్ప్రేలు, యాంటీ-స్మాగ్‌ గన్స్‌ వినియోగం పెంచాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -