సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో కాలి బూడిద అవుతున్నది యుద్ధ ట్యాంకులు, మిస్సైల్స్, డ్రోన్స్ మాత్రమే కాదు, మూడో ప్రపంచ దేశాల కార్మికుల – కర్షకుల శ్రమశక్తి. దేశీయ ఇంధన అవసరాలను ఎనభై శాతం పైగా దిగుమతి పై ఆధారపడడంతో యుద్ధం వలన ప్రధానంగా ఎఫెక్ట్ అవుతున్న దేశాలలో మన దేశం ఒకటి అనేకంటే, మనదేశంలోని కార్మిక, కర్షక వర్గం ప్రధానమైనదని పేర్కొనడం సబబు. హర్మూజ్ జల సంధి మూసివేతతో గత ఇరవై ఐదు రోజులుగా ఇంధన దిగుమతులతోపాటు పశ్చిమాసియా దేశాలకు ఎగుమతయ్యే ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ప్రభావం పడింది. వీటిలో పనిచేస్తున్న వేలాది కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫార్మా ఉత్పత్తులకు హైదరాబాద్ ముఖ్యమైన కేంద్రం. యుద్ధం కారణంగా ఫార్మా ఉత్పత్తులకు అత్యంత కీలకమైన రా మెటీరియల్స్ ఎంజైమ్స్, సాల్వెంట్లు, కొరత ఏర్పడింది.
ఫార్మా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల కంటైనర్‌పై వార్ సెస్ కింద అదనంగా రూ.రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం తెలంగాణలోని ఉత్పాదక పరిశ్రమల కార్మికులపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఎల్.ఎన్.జి వంటి ముడి పదార్థాల కొరత ఏర్పడటంతో పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవలసి వస్తోంది. రసాయనాలు, ప్లాస్టిక్‌లు, ఆహార ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు ఉత్పత్తి మందగించాయి. సిరామిక్, ఉక్కు, వస్త్ర, ఫ్యాబ్రికేషన్ యూనిట్లను పెద్ద ఎత్తున మూసివేయడానికి కారణమవుతోంది. ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇండస్ట్రియల్ గ్యాసెస్, కెమికల్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల కొరతకు దారితీసింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు రసాయన, ప్లాస్టిక్ తయారీ కర్మాగారాలు తమ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. దీనివల్ల కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం లేదా పని గంటలు తగ్గడం వంటి పరిణామాలకు గుతవుతున్నారు. కొన్ని తయారీ యూనిట్లలోని పారిశ్రామిక క్యాంటీన్లు ఇప్పటికే మూతపడ్డాయి.
లక్షన్నర క్యాబ్‌డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం
ఈ అస్థిరత తెలంగాణ నుండి గల్ఫ్ ప్రాంతానికి జరిగే ఎగుమతులకు అంతరాయం కలిగించింది. దీనివల్ల పౌల్ట్రీ (గుడ్ల ఎగుమతులు), మైనింగ్ వంటి ఎగుమతి ఆధారిత రంగాలలోని కార్మికులు ప్రభావితమయ్యారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గ్రానైట్ క్వారీలతో పాటు, గ్రానైట్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిలో వేలాదిమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. యుద్ధం ఎఫెక్ట్ తో షిప్పింగ్ చార్జీలు టన్నుకు అదనంగా సుమారు పది డాలర్లు పెరిగాయి. గ్రానైట్ స్లాబ్‌ల ఎక్స్‌పోర్ట్‌కు అవసరమయ్యే కంటైనర్స్ పైన సెస్ వసూళ్లు చేస్తున్నారు. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గ్రానైట్ పరిశ్రమ మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. టిఫిన్స్, మీల్స్ రేట్లను హోటల్ యజమానులు పెంచేశారు. హాస్టల్లో మెనూ మారిపోయింది. విద్యార్థులకు, ఉద్యోగులకు, కార్మికులకు, వర్కింగ్ ఉమెన్స్‌కు ఎంతో ఉపయోగపడుతున్న హాస్టల్స్ మూతపడుతున్నాయి. దీని ప్రభావం ప్రధానంగా సాప్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర ప్రయివేటు సెక్టార్లలో పనిచేస్తున్న కార్మికులపై ఆర్థిక భారం పడింది. హోటల్, రెస్టారెంట్, హాస్టల్స్‌పై ఉపాధి పొందుతున్న కుక్స్, సప్లయర్స్, క్లీనర్స్, గిగ్ వర్కర్స్ వంటి లక్షలాదిమంది ఉపాధి పై ప్రభావం చూపింది. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.
సిఎన్‌జి కొరతతో ఒక హైదరాబాదు నగరంలోనే సుమారు యాభై వేల ఆటోలు, లక్షన్నర క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం పడింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయులలో దేశంలోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల నుండి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల కలల సీమలకు వెళ్తున్న వైట్ కాలర్ ఉద్యోగుల కంటే గల్ఫ్ కంట్రీస్‌లో ఉపాధి పొందుతున్న కార్మికులే అధికం. గల్ఫ్ (యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్) దేశాలలో సుమారు తొంభై లక్షలమంది భారతీయ కార్మికులు ఉంటే… తెలంగాణ నుండి సుమారు పదిహేను లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ నుండి ఉన్నారు. ప్రధానంగా నిర్మాణం, డ్రైవింగ్ రంగాలలో పనిచేస్తున్నారు.
గల్ఫ్‌లో నివాసాలకే పరిమితమైన కార్మికులు
విస్తృతమవుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న కార్మికులు తమ నివాసాలకే పరిమితమయ్యారు.ప్రస్తుత పరిస్థితులలో వీరిలో చాలామంది వేతనాల్లో కోతలు, ఉద్యోగ తొలగింపుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అనేక కుటుంబాల్లో ఆదాయానికి గండిపడింది.ఉపాధి కోసం వెళ్తున్న ఈ రెండు రకాల వారితో దేశం విదేశీ కరెన్సీ పొందుతుంది. ప్రభావం మాత్రం భిన్నంగా ఉంటుంది. భూలోక స్వర్గసీమ అనుకునే దేశాలలో ఉపాధి పొందుతున్న వారి నుండి వచ్చే ఆదాయాలు ప్రధానంగా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లలోకి పెట్టుబడులుగా వెళ్తున్నాయి. ఈ సంపద ఎప్పటికైనా విదేశాలకు తరలి వెళ్లిపోతుంది. ఎందుకంటే వీరు తమ పిల్లలు భారత పౌరులుగా పుట్టాలని అనుకోవడం లేదు. తాము సెటిల్ అవ్వాలనుకుంటున్న దేశ పౌరసత్వాన్ని వారి పిల్లలకు కోరుకుంటున్నారు.
గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న వారి ఆలోచన దీనికి భిన్నం. వారు ఎప్పటికైనా ఈ దేశం తిరిగి రావాలనుకుంటున్నారు. వీరి ఆదాయాలలో ప్రధాన భాగం ఖర్చయ్యేది నిత్యవసరాలకే. ఈ ఖర్చులు దేశాభివృద్ధికి తోడ్పడుతుంది. భారతదేశ వ్యవసాయ రంగంలో కీలకమైన ఖరీఫ్ సీజన్‌కు ముందు యుద్ధం కారణంగా ఖతార్ నుండి ఎల్‌ఎన్‌జి రవాణా నిలిచిపోవడం దేశీయ యూరియా తయారీని ప్రభావితం చేస్తోంది. యూరియా ఉత్పత్తిలో డెబ్బయి శాతం వ్యయం సహజ వాయువుదే. రామగుండం పెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)పై గ్యాస్ కొరత ప్రభావం పడింది. రోజుకు సాధారణ ఉత్పత్తి సామర్థ్యం 3850 మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం 3300 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది. ఆర్.ఎఫ్.సి.ఎల్ యూరియా ఉత్పత్తిలో దాదాపు సగభాగం తెలంగాణకే సరఫరా చేస్తుంది.
అమెరికా చెప్పుచేతుల్లో మోడీ ప్రభుత్వం
దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి ఇరాన్ సహజ వాయువును పైప్‌లైన్ ద్వారా తీసుకువచ్చే ప్రాజెక్టును అమెరికా ఆంక్షల కారణంగా భారతదేశం వైదొలిగింది. ప్రాజెక్టు నుండి వైదొలకుండా పైప్ లైన్ పూర్తి చేసి ఉంటే, నేడు ఎంతో చౌక ధరకు ఇరాన్ నుండి సహజవాయువు మనకు అందేది. భారతదేశ పాలకవర్గాలు అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్న కారణంగా నేడు దేశంలోని కార్మికులు, కర్షకులు,సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు, అనేక బారాలు మోయవలసి వస్తుంది. వ్యాపార, వాణిజ్య రంగంలో శతాబ్దాలుగా ఇరాన్‌తో భారత్‌కు అనుబంధం ఉంది. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్నాయి.
దీనికి భిన్నంగా ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇజ్రాయిల్‌తో, అమెరికన్ సామ్రాజ్యవాదంతో అంటకాగుతోంది. అమెరికా ఆడమన్నట్లు ఆడుతోంది. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయవద్దంటే మానేసింది. ఇప్పుడు మళ్లీ కొనాలంటే తలాడిస్తోంది. మన ప్రభుత్వం ఏం చేయాలో, ఎక్కడ సంతకం పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో వాషింగ్టన్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇంతకన్నా దుర్మార్గం వేరే ఉంటుందా? సామ్రాజ్యవాదులకు లొంగిపోవడం ఆరెస్సెస్-బీజేపీలకు కొత్తేం కాదు, అది వారి డిఎన్‌ఏలోనే ఉందని బ్రిటిష్‌కు లొంగినప్పుడే అర్థమైంది. దేశభక్తి పేరుతో ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడటమే ప్రజల ప్రధాన కర్తవ్యం.
గీట్ల ముకుందరెడ్డి
94900 98857



