Monday, March 30, 2026
E-PAPER
Homeమానవిఆటలతో నేర్పించాలి

ఆటలతో నేర్పించాలి

- Advertisement -

వేణు గీతికకు ప్రేమతో…
ఎలా ఉన్నావు నాన్న? బాగా గుర్తుకు వస్తున్నావు. నిన్ను చూడాలని ఉంది. కానీ ఎండాకాలం వచ్చేసింది, అక్కడి ఎండలు తట్టుకోలేను. నువ్వే వీలుచూసుకుని ఒకసారి వచ్చి వెళ్ళు బంగారు తల్లి. నాకు జ్వరం తగ్గింది. కొంచం జలుబు, దగ్గు ఉన్నాయి. అవి కూడా ఒక వారంలో తగ్గిపోతాయి. కంగారు పడకు. నాన్న! కిందటి ఉత్తరంలో పిల్లల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పెట్టవలసిన శ్రద్ధ గురించి చెప్పాను. ఈ మధ్య కాలంలో పిల్లలకు మాటలు రావడమే ఆలస్యం.. వెంటనే స్కూల్లో చేర్పిస్తున్నారు. ప్రీ నర్సరీ స్కూల్‌ అంటూ చేర్పిస్తున్నారు. పిల్లలకు కేవలం ఆటలు నేర్పడమే కాకుండా, వాళ్ళతో చిన్న చిన్న రైమ్స్‌ లాంటివి నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లలను స్కూల్లో చేర్చే ముందు ఒక మంచి స్కూల్‌ని ఎంచుకోవాలి.

ఇంటి దగ్గర పిల్లలు ఎవరైనా వెళ్తున్నారా, అక్కడ ఏం నేర్పిస్తున్నారు, టీచర్లు, ఆయాలు పిల్లలను ఎలా చూసుకుంటున్నారు, పిల్లలకు ట్రాన్స్‌పోర్ట్‌ ఉందా, మొదలైన విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. స్కూల్‌ నుండి పిల్లలు రాగానే వాళ్ళ బట్టలు మార్చి, ఏదైనా ఆహారం తినిపించాలి. చిన్న పిల్లలు త్వరగా ఇంటికి వచ్చేస్తారు కాబట్టి మధ్యాన్నం పూట వారిని నిద్రపుచ్చాలి. స్కూల్లో ఏం చెప్పారో పిల్లలను అడిగి తెలుసుకోవాలి. చిన్న పిల్లలకు ఆటలతో పాటు చదువు చెప్పాలి. ఇంట్లో కూడా బొమ్మలు చూపిస్తూ, రంగులు చూపిస్తూ ఆడించాలి. పిల్లలు వచ్చీరాని మాటలతో చెప్తూ ఉంటే, ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. నువ్వు 18 నెలలకే ప్రపంచ పటంలో ఏ దేశం ఎక్కడ ఉందో చెప్పేదానివి. ప్రపంచంలోని ప్రముఖులను అడగగానే ఫొటోలు చూపించేదానివి. వారాలు, నెలలు, రంగులు అనీ చెప్పేదానివి. నువ్వొక వండర్‌ బేబీ వి.

అప్పుడు నీ గురించి ఎన్నో పేపర్లలో, టీవీలలో కూడా వచ్చింది. నేను నిన్ను ఆడిస్తూ అన్నీ చెప్పేదాన్ని. ఏ ఒక్క రోజైనా చెప్పక పోతే పుస్తకాలు తీసుకొచ్చి నా ముందు వేసేదానివి. వాటిల్లో ఉన్నవి చెప్పమని.. ఇది ఇది అంటూ చేత్తో చూపించేదానివి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చిన్న పిల్లలకు ఇవన్నీ నేర్పాలంటే సమయం కావాలి. ఉద్యోగం చేసేవారికి సమయం ఉండక పోయినా పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. పడుకునే ముందు వారికి చిన్న చిన్న కథలు చెప్పాలి. వాళ్ళకీ ఆ కథలు వింటున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు తీర్చటంలో ఒక ఆనందం ఉంటుంది. అవన్నీ కూడా అనుభవించి తీరాల్సిందే. ఉంటాను నాన్న ఉత్తరం పెద్దదయ్యేలా ఉంది. పిల్లల గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని విషయాలు వచ్చే వారం చెప్తాను.

ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -