ప్రభుత్వం ఆదేశించినా ఆసక్తి చూపని మిల్లర్లు
నవతెలంగాణ–మల్హర్ రావు
దొడ్డు రకం ధాన్యం కొను గోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా రైస్ మిల్లర్లు సహకరించకపోవడతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 15,500 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో దాదాపు వెయ్యి ఎకరాల వరకూ దొడ్డు రకాలు పండించారు.రైతులు దొడ్డు రకాలను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు అవకాశం ఉంది. దొడ్డు రకాలకు బోనస్ వర్తించక పోయినా ఈ రకం వరి సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుందనే ఉద్దేశంతో కొందరు రైతులు వీటినే సాగు చేశారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 60 శాతం మేర ధాన్యం సేకరణ సాగినా దొడ్డు రకాలను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు తప్పడం లేదు.
సన్నరకాలకే ప్రాధాన్యం
ధాన్యం అన్లోడింగ్ విషయంలో రైస్ మిల్లర్లు సన్న రకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారులకు సన్న రకాలనే పంపిణీ చేస్తుండటంతో మిల్లర్ల నుంచి ఈ రకం ధాన్యంనే సేకరిస్తున్నారు. దొడ్డు రకాలను భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) కి కస్టమ్ మిల్లింగ్ కింద అందించాల్సి ఉంది. దొడ్డు రకాలను మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువ వస్తుందనే కారణంతో మిల్లర్లు దొడ్డు రకాలను అన్లోడింగ్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. సన్న రకాలను వేగంగా అన్లోడింగ్ చేసుకుంటున్న మిల్లర్లు, దొడ్డు రకాలను దింపు కోవడానికి మూడు, నాలుగు రోజుల సమయం తీసుకుంటున్నారు.ఈ కారణంగా దొడ్డు రకాల ధాన్యం సేకరణకు తీవ్ర జాప్యం కలుగుతోంది.



