ఇరాన్‌లో అధికార మార్పిడిపై అమెరికా
వాషింగ్టన్ : ఇరాన్‌లో అధికార మార్పిడి మైక్రోవేవ్‌లో ఆహార పదార్థాలను వేడి చేసుకున్నంత తేలిక కాదని అమెరికా అంగీకరించింది. వెనిజులాతో పోలిస్తే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందని తెలిపింది. సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని తొలగిస్తే ఇరాన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారంటూ ఎదురవుతున్న ప్రశ్నకు విదేశాంగ మంత్రి మార్కో రుబియో సెనెట్ కమిటీలో సమాధానమిచ్చారు. ‘అది ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం కాదు. మైక్రోవేవ్‌లో దానిని ఉంచితే రెండున్నర నిమిషాలలో వేడి అవుతుంది. వెంటనే తినేయొచ్చు. కానీ ఇక్కడ చాలా క్లిష్టమైన విషయాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఖమేనీని అధికారం నుంచి తొలగిస్తే ఇరాన్ నాయకత్వాన్ని ఎవరు స్వీకరిస్తారో ఎవరికీ తెలియదని చెప్పారు. ఇరాన్‌లో సుప్రీం నేత పదవీచ్యుతుడైతే, ప్రభుత్వం పతనమైతే తర్వాత ఏం జరుగుతుందన్న ప్రశ్నకు ఎవరైనా తేలికగా సమాధానం ఇవ్వగలరని తాను అనుకోవడం లేదని రుబియో అన్నారు.
ఇరాన్‌పై దాడికి దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధపడుతున్న సమయంలో రుబియో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి. యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ నాయకత్వాన అమెరికా నౌకాదళం ఇరాన్ వైపు కదులుతోందని ట్రంప్ తాజాగా సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అణు కార్యక్రమంపై ఇరాన్ వెంటనే చర్చలకు రావాలని ఆయన సూచించారు. అణ్వాయుధాల అభివృద్ధికి స్వస్తి చెప్పేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇక సమయం లేదని, ఇరాన్ స్పందించకపోతే తదుపరి దాడి గతంలో జరిగిన వాటి కంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. కాగా సైనిక బెదిరింపుల మధ్య చర్చలు ఎలా సాధ్యమని ఇరాన్ ప్రశ్నించింది. తనపై ఒత్తిడి తేవాలన్న అమెరికా ఎత్తుగడలు ఫలితాన్ని ఇవ్వవని, పైగా ఎదురు దెబ్బలు తప్పవని హెచ్చరించింది.



