వర్షాకాల సమావేశాల ముగింపు ప్రకటనలో జాప్యం
శీతాకాల సమావేశాల ఊసే లేదు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకపోవడమనేది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనిదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.‘‘ పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేసే విశేషాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందనేది వాస్తవం. సాధారణంగా సమావేశాలు వాయిదా పడిన వారం రోజుల్లోగా ఇందుకు సంబంధించి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం తేదీని నిర్ధారించి రాష్ట్రపతికి తెలియజేస్తుంది. తదనంతరం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. గతంలో కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినా వెంటనే ప్రోరోగ్ చేయలేదు. కొంత విరామం తర్వాత మళ్లీ సమావేశాలు కొనసాగాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నం’’ అని బేబీ పేర్కొన్నారు. సభ నిరవధికంగా వాయిదా పడి వంద రోజులకుపైగా గడిచిపోయాయని తెలిపారు. ‘‘సాధారణంగా వచ్చే వారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. అయినా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయా లేదా అనేది దేశ ప్రజలకు తెలియడం లేదు’’ అని బేబీ తెలిపారు.
‘‘వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా ప్రస్తుత సమావేశాలను నిర్వహించినట్లైతే అది వర్షాకాల సమావేశాలకు ముగింపుగా మాత్రమే చూడగలం. నిబంధనల ప్రకారం.. ప్రోరోగ్ చేయనట్లైతే, సమావేశాలను కేవలం స్పీకర్ మాత్రమే ఏర్పాటు చేయగలుగుతారు. రాష్ట్రపతికి ఇందులో ఎలాంటి పాత్ర ఉండదు. ఫలితంగా స్పీకర్ స్వల్పకాల వ్యవధిలో నోటీస్ ఇచ్చి సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు. అంటే సభ్యులు ప్రశ్నలను సమర్పించడానికి సమయం ఉండదు. సాధారణంగా సమన్ల తేదీకి, సమావేశాలు ప్రారంభం కావడానికి మధ్య 15 రోజుల నోటీసు కాలం ఉండాలి. అప్పుడు పార్లమెంటేరియన్లకు తగిన సమయం ఉంటుంది. బహుశా పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని బీజేపీ ప్రభుత్వం కోరుకోవడం లేదనుకుంటా, లేదా సాధ్యమైనంతవరకు దాన్ని నివారించాలని కూడా భావిస్తూ ఉండవచ్చు’’ అని బేబీ పేర్కొన్నారు.
సమావేశాలను ఇలా అసాధారణంగా సుదీర్ఘకాలం పాటు ప్రోరోగ్ చేయనందువల్ల అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందరినీ విశ్వాసంలోకి తీసుకోవడమే ప్రజాస్వామ్య పద్ధతి కాగలదని ఎం.ఎ బేబీ అభ్రిప్రాయపడ్డారు. ‘‘ఏది ఏమైనప్పటికీ, ప్రజాస్వామ్యంలో పాలక పార్టీ మాదిరిగానే పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కూడా అంతర్భాగమే. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, అలాగే ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్ వంటి నేతలతో కూడిన ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో నమ్మకం లేదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు వారికి, వారి పార్టీకి దూరం. కానీ, వారు అంతిమంగా ఈ దేశ ప్రజలకు జవాబుదారీగా ఉంటారనే విషయం మర్చిపోనివ్వరాదు. చివరగా, ప్రజలే వారిని సమాధానమిచ్చేలా చేస్తారు. వారి దుశ్చర్యలన్నింటికీ జవాబుదారీగా ఉండేలా చేస్తారు.’’ అని బేబీ అన్నారు.
పార్లమెంటరీ బాధ్యతల నుంచి తప్పుకునే యత్నం : సీపీఐ(ఎం) లోక్‌సభాపక్ష నేత కె. రాధాకృష్ణన్
పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించకుండా, శీతాకాల సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సీపీఐ(ఎం) లోక్‌సభాపక్ష నేత కె. రాధాకృష్ణన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రకటన జారీలో గరిష్టంగా 76 రోజుల వరకు జాప్యం జరిగిన సందర్భాలున్నాయని, ఇప్పుడు ఆ రికార్డులను సైతం బీజేపీ ప్రభుత్వం అధిగమించిందని పేర్కొన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇది అసాధారణ పరిణామమని అన్నారు. వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించని నేపథ్యంలో కేవలం రెండు రోజుల ముందస్తు నోటీసుతోనూ ఉభయ సభలను తిరిగి సమావేశపరిచే అవకాశం ఉందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును నిరుపయోగం చేస్తోందని రాధాకృష్ణన్ విమర్శించారు. తగిన చర్చలు, పార్లమెంటరీ కమిటీల పరిశీలన లేకుండానే బిల్లులను హడావుడిగా ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంటరీ బాధ్యతల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే బీజేపీ ప్రభుత్వ వైఖరి ఖండనీయమన్నారు. వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగిస్తూ వెంటనే రాష్ట్రపతి ప్రకటన విడుదల చేయాలని, శీతాకాల సమావేశాలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)