Magazines

నీటి హక్కులపై అసెంబ్లీని సమావేశపర్చాలి

19 నిమిషాల క్రితం

Assembly
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 4 నిమిషాల చదవడం

మైకులు కట్‌ చేయకుండా అవకాశమివ్వాలి

వారంపాటు మాట్లాడేందుకు సిద్ధం

2025లో పల్నాడు ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన ఏపీ

కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు పరిమితం చేసిందే కాంగ్రెస్‌

ప్రభుత్వ తప్పులను ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్‌
ఎండగడతారు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
“నీటి హక్కులపై అసెంబ్లీని సమావేశపర్చాలి. వారం, పది రోజులైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. భోజనం చేయకుండా అయినా తెలంగాణ నీటి హక్కులపై చర్చిస్తాం. మైకులు కట్‌ చేయకుండా అవకాశమివ్వండి. దీనికి మేం సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి సిద్ధంగా ఉన్నారా?. ప్రజలకు నిజానిజాలు తెలియాలి. తెలంగాణ కోసం మా పోరాటం ఆగదు. కేసీఆర్‌ అన్నీ గమనిస్తున్నారు. అవసరమైనప్పుడు ఆయన తిరిగి వస్తారు. ప్రభుత్వ తప్పులను ప్రజాక్షేత్రంలోనే ఎండ గడతారు”అని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అబద్ధాల వరదను పారించారని చెప్పారు. నీటిని ఎత్తిపోయాలని తాము ప్రశ్నిస్తుంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఉద్యమం చేసి రాష్ట్రం సాధించడం నేరమా?

కేసీఆర్‌ను ఉరితీయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారనీ, ఆయన చేసిన నేరమేంటని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడమే నేరమా?అని అడిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి సమైక్యాంధ్ర శిబిరంలో ఉన్నారని ఆరోపించారు.

మూడేండ్లలో ఒక్క టీఎంసీ నిల్వ సామర్థ్యమైనా పెంచారా?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 218 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించిందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేండ్లలో కనీసం ఒక్క టీఎంసీ నిల్వ సామర్థ్యమైనా పెంచిందా?అని ప్రశ్నించారు. కొత్త ఆయకట్టు లేదనీ, కొత్త ప్రాజెక్టు లేదనీ, కొత్త రిజర్వాయర్‌ లేదని విమర్శించారు. అంబేడ్కర్‌ ప్రాజెక్టు, కాళేశ్వరం మూడో డీపీఆర్‌, సమ్మక్కసాగర్‌ డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని ఆరోపించారు. ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు సాధించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి ప్రాజెక్టుల మోటార్లు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

పల్నాడు ప్రాజెక్టుపై సీఎం అబద్ధం

పల్నాడు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వెనుక తేదీతో లేఖ సృష్టించి తప్పించుకునే ప్రయత్నం చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. 2025 జనవరిలోనే పల్నాడు ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారనీ, ఈ విషయాన్ని మీడియా సంస్థలు ఈనెల 15, 16 తేదీల్లో ప్రచురించాయని చెప్పారు. కేటీఆర్‌ 18న ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.

సీఎం రేవంత్‌‌రెడ్డి రాసిన లేఖపై మాత్రం 16వ తేదీ ఉందనీ, ఏపీ ఏడాది కాలంగా అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పల్నాడు ప్రాజెక్టుకు సంబంధించిన జీవో 2022లోనే వచ్చిందని సీఎం చెప్తున్నారనీ, అయితే ఆ జీవోలో నాగార్జునసాగర్‌ నుంచి నీటిని తీసుకోవాలని ఎక్కడా లేదన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన జీవో 453లో మాత్రం నాగార్జునసాగర్‌ నుంచి 1.865 టీఎంసీల నీటిని తీసుకోవాలనీ, ప్రస్తుతం ఉన్న తాగునీటి వనరును సాగర్‌కు మార్చాలని స్పష్టంగా ఉందన్నారు. నాగార్జునసాగర్‌ నుంచి నీటిని తరలించే అంశం 2022 జీవోలో లేదనీ, 453జీవోలోనే ఉందని స్పష్టం చేశారు.

299 టీఎంసీలకు ఉమ్మడి పాలకులే కారణం

కృష్ణా జలాల్లో 299:512 పంపిణీ విధానానికి కాంగ్రెస్‌, ఉమ్మడి రాష్ట్ర పాలకులే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన పత్రంలోనే తెలంగాణకు 299 టీఎంసీల పరిమితి విధించారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన బిల్లులోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని చేర్చిందన్నారు. తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి విభజన చట్టంలోని సెక్షన్‌-3 కింద ఫిర్యాదు చేశారనీ, 299 టీఎంసీలకు అదనంగా మరో 581 టీఎంసీలు తెలంగాణకు అవసరమని కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. 299:512 పంపిణీ విధానం శాశ్వత ఒప్పందం కాదనీ, ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు కొనసాగించే తాత్కాలిక ఏర్పాటేనని అన్నారు. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ చేయాలని 2018 నుంచి పలుమార్లు లేఖలు రాశామని చెప్పారు. ఆదిత్యనాథ్‌ దాస్‌ సంతకం చేశారని అన్నారు. 2025 ఫిబ్రవరి 17న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే 299:512 తాత్కాలిక విధానాన్ని అంగీకరించిందని ఆరోపించారు.


రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అడ్డుకున్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు 19 లేఖలు రాశామనీ, కేఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాల్లోనూ పోరాడామని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్‌దే బాధ్యత అని చెప్పారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీరు తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చి, ఇప్పుడు గ్రావిటీతో నీరు రావడం సాధ్యం కాదని సీఎం రేవంత్‌‌రెడ్డి చెప్తున్నారని విమర్శించారు. ఆ హామీపై ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్లు దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


పాలమూరుకు నీరు ఎందుకు రావడం లేదు?

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం జీవో 403, 405లను జారీ చేసిందని గుర్తు చేశారు. 2024 డిసెంబర్‌ మూడున లైనింగ్‌ పనులకు సంబంధించిన జీవో వచ్చిందని చెప్పారు. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు నీరు తీసుకెళ్లే పనులు జరుగుతున్నా పాలమూరుకు మాత్రం నీరు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం పాలమూరులో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చాక సాగునీటిని ఎన్ని ఎకరాలకు కొత్తగా అందించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం

కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని హరీశ్‌రావు చెప్పారు. 2024-25లో ఆంధ్రప్రదేశ్‌ 718 టీఎంసీలు వినియోగించుకోగా తెలంగాణ 286 టీఎంసీలకే పరిమితమైందని వివరించారు. 2025-26లో ఆంధ్రప్రదేశ్‌ 771 టీఎంసీలు వినియోగించుకోగా తెలంగాణ కేవలం 267 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుందని చెప్పారు. 2026-27లో ఇప్పటివరకు 110 టీఎంసీల వినియోగమే జరిగిందని సీఎం రేవంత్‌‌రెడ్డి చెప్తున్నారని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్