Magazines

మెదక్ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలే..

12 నిమిషాల క్రితం

development of Medak..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

జిల్లా కేంద్రం అభివృద్ధికి హామీలు ఘనం.. అమలు శూన్యం

గతంలో ప్రతిపాదించిన
మాస్టర్ ప్లాన్‌కు మోక్షమెప్పుడో?

మరుగున పడ్డ బైపాస్, 
రింగ్ రోడ్ల నిర్మాణం

ఆక్రమణలతో కుచించుకుపోతున్న ప్రధాన రహదారులు

ప్రారంభానికి నోచుకోని రైతుబజార్.. రోడ్లపైనే కూరగాయల విక్రయాలు

అస్తవ్యస్తంగా డ్రయినేజీ, పారిశుధ్యం

​నవతెలంగాణ-మెదక్ (రామాయంపేట)

​దశాబ్దాలుగా మెదక్ జిల్లాగా ఉన్నా.. జిల్లా కేంద్రం లేక అభివృద్ధిలో వెనుకబడిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, మెదక్ జిల్లాగా, జిల్లా కేంద్రంగా గుర్తింపు పొందిన మెదక్ పట్టణం అభివృద్ధిలో మాత్రం వెనుకబడుతోంది. పాలకులు ప్రజలకిచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం, బైపాస్, రింగ్ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం కావడం, ప్రధాన రహదారులు ఆక్రమణలతో కుంచించుకుపోవడం పట్టణ అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోని రైతుబజార్, పట్టణంలో అస్తవ్యస్త డ్రయినేజీ వ్యవస్థ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చలికాలం ప్రారంభమైనప్పటి నుండి దుమ్ము అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యల నుంచి పట్టణవాసులకు ఉపశమనం లభించడం లేదు. కోట్లాది రూపాయల నిధుల ప్రకటనలు, ప్రకటనలు గానే మిగిలిపోతున్నాయి.​

గతంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌కు మోక్షమెప్పుడో?

​మెదక్ పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 1992లోనే అప్పటి మున్సిపల్ పాలకవర్గం మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రతిపాదనలు పంపారు. పారిశ్రామిక ప్రాంతాలు, పార్కులు, రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు ఇందులో ప్రాధాన్యమిచ్చారు. అనంతరం అవుసులపల్లి, ఔరంగాబాద్ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో పట్టణ పరిధి విస్తరించింది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు పంపి దశాబ్దాలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. మెదక్ పట్టణ అభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి, స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

​మరుగున పడ్డ బైపాస్, రింగ్ రోడ్ల నిర్మాణం

​పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు మెదక్ పట్టణానికి బైపాస్, రింగ్ రోడ్లు అత్యవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్డు కోసం రూ.23 కోట్లు, రింగ్ రోడ్డు కోసం రూ.308 కోట్లు కేటాయించినట్టు అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం మారి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో సంబంధిత ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. దీంతో భారీ వాహనాలు సైతం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండానే ప్రయాణించాల్సి వస్తోంది. పట్టణంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ, దుమ్ముతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు తీవ్ర పడుతున్నారు.

​ఆక్రమణలతో రహదారులు కుదింపు.. రోడ్లపైనే కూరగాయల విక్రయాలు

​పట్టణంలోని ప్రధాన రహదారులు ఆక్రమణలు, హోటళ్ల ముందు అడ్డగోలు పార్కింగ్‌తో ఇరుకుగా మారాయి. రాందాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్, కోర్టు రోడ్డు వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. చమన్ నుంచి కూచన్‌పల్లి వైపు వెళ్లే రహదారి విస్తరణ పనులు కూడా పూర్తిస్థాయిలో సాగడం లేదు. చమన్ నుంచి దాయర వరకు విస్తరణలో భాగంగా ఇండ్లు, దుకాణాలు తొలగించినా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలతో నిర్మించిన రైతుబజార్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో రైతులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు, రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోస్టాఫీస్, ఫతేనగర్ రోడ్లలో ఏర్పాటు చేసిన షెడ్లు సైతం వినియోగంలోకి రావడం లేదు.

​అస్తవ్యస్తంగా డ్రయినేజీ, పారిశుధ్యం

​పట్టణంలో సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీటి సమస్య ఏండ్లుగా కొనసాగుతోంది. చిన్నపాటి వర్షాలకే పలుచోట్ల మురుగు కాలువలు పొంగి రోడ్లపైకి చేరుతున్నాయి. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రంగా మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంది. ప్రకటనలకే పరిమితం కాకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


​రింగ్ రోడ్డు లేక నానా అవస్థలు

​మెదక్ పట్టడానికి రింగురోడ్డు లేక తీవ్ర ఇబ్బందు లు పడుతున్నాం. చుట్టుపక్కల గ్రామాలనుండి, ఏ ఊరు వెళ్లాలన్న మెదక్ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి. మెదక్ పట్టణంలోని రోడ్డులో రాస్తారోకో వంటి, ఏదైనా సమస్య వస్తే మెదక్ దాటి వెళ్ళే పరిస్థితి ఉండదు. మెదక్ పట్టణానికి బైపాస్, రింగ్ రోడ్డు అవసరం చాలా ఉంది. పాలకులు రింగ్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయాలి.

కర్రోళ్ల యాదగిరి



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్