పాదయాత్రలతో ప్రయోజనమేమిటి.. కరీంనగర్‌కు తెచ్చిన నిధులెన్ని.. ?
కేంద్ర మంత్రి అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
నవతెలంగాణ – కరీంనగర్
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణమని, అలాంటి ఓటు హక్కునే సర్ పేరుతో తొలగించి ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పేదలు, దళితులు, బడుగు బలహీన తరగతుల గొంతు నొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే పునాది అని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించారని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు. ఓటు హక్కును కాలరాసే కుట్రలను సహించేది లేదన్నారు. కరీంనగర్‌లో పాదయాత్ర చేసిన, రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత కోసం ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఎన్ని విద్యాసంస్థలు మంజూరు చేయించారు? కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో లెక్కలతో చెప్పాలన్నారు.
కరీంనగర్ నగర అభివృద్ధికి రూ.700–800 కోట్లు తీసుకొచ్చామని చెబుతున్న బండి సంజయ్.. అందులో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత..? రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత? హడ్కో ద్వారా తీసుకున్న రుణం ఎంత..? అనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు తీసుకొచ్చేందుకు కృషి చేశారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు కేంద్ర పథకాల ద్వారా ఎన్ని అవకాశాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సుడా మాజీ చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, నాయకులు ఎండి తాజుద్దీన్, అహ్మద్ అలీ, వీర దేవేందర్ పటేల్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండి ఇమ్రాన్, పోతారపు సురేందర్, కిమ్ ఫహద్, పెంట శేఖర్, షహెన్షా ఉన్నారు.





కామెంట్‌లు (0)