అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆఱ్హెచ్ఆర్డీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజక్టు ఫేజ్-1 పనులపై వివరాలను ఈ సందర్భంగా సీంఎ అడిగి తెలుసుకున్నారు. ఫేజ్-1 లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. జనవరి 2027 లో ఫేజ్-1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్టు పురోగతిపై వివరించారు. మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ఆరా తీశారు. జనవరి 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నట్టు తెలిపారు.
మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని సీఎం ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతి ఎలా ఉందని సీఎం అడిగి తెలుసుకున్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులువేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మార్చి 2027 నాటికి పనులు పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ శ్రీజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎఫ్సిడిఏ కమిషనర్ శశాంక, హెచ్ఎండబ్య్లూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ నర్సింహా రెడ్డి, హెచ్జీసీఎల్ ఎండీ ఉపేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.






కామెంట్లు (0)