500కు పైగా సినిమాల దరఖాస్తుల వివరాలు బహిర్గతం
పంపిణీ ఒప్పందాలు సైతం లీక్
'ది హిందూ' పరిశోధనలో వెల్లడి
డిజిటల్ పాలనపై కేంద్రం గొప్పలు
ప్రభుత్వ సంస్థల్లో సమాచార భద్రతపై ప్రశ్నలు
న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా అంటూ ప్రచారం చేసుకుంటున్న మోడీ ప్రభుత్వ హయాంలో కీలక ప్రభుత్వ సంస్థల సమాచార భద్రతే ప్రశ్నార్థకంగా మారుతోంది. కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్‌సీ)కి చెందిన 500కు పైగా సినిమాల దరఖాస్తుల వివరాలు ఇంటర్నెట్‌లో బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. చిత్రాల షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ కట్ ఆదేశాలు, కోట్ల రూపాయల వ్యాపార ప్రయోజనాలతో ముడిపడిన పంపిణీ ఒప్పందాలు సైతం బయటపడినట్టు ‘ది హిందూ’ పరిశోధనలో వెల్లడైంది. డిజిటలైజేషన్‌పై గొప్పలు చెప్పుకోవడమే కాదు.. ప్రభుత్వ వ్యవస్థల్లో కీలక సమాచారాన్ని కాపాడటంలోనూ బాధ్యత, జవాబుదారీతనం ఉండాలన్న ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి ముందుకొస్తున్నాయి.
దర్యాప్తు చేస్తున్న బోర్డు
అక్టోబర్ 4న ఈ-సినీప్రామాణ్ పోర్టల్ కొన్ని గంటలపాటు పనిచేయలేదు. ఆ తర్వాత కొద్దికాలానికే పత్రాల అప్‌లోడింగ్ ఆగిపోయింది. అయితే, ఏ వ్యక్తిగత సినీ నిర్మాత ఖాతా హ్యాక్ అయినట్టు ఆధారాలు లేవని సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ ఘటనపై పరిశీలన ప్రారంభించామనీ, సర్వర్లు, డేటాబేస్‌ల భద్రతను తనిఖీ చేస్తున్నామని వెల్లడించింది. సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు, భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (సెర్ట్-ఇన్)కు కూడా సమాచారం అందించినట్టు పేర్కొంది. ఇప్పటివరకు పరిశీలించిన ఆధారాల్లో ఆరోపణలకు సంబంధించిన సర్టిఫికేషన్ పత్రాలు అనధికారికంగా పొందినట్టు నిర్ధారణ కాలేదని బోర్డు వివరించింది. పూర్తి స్థాయి భద్రతా తనిఖీ చేపడతామని వెల్లడించింది.
ఒప్పందాల గోప్యతకు ముప్పు
లీకైన పత్రాల్లో బ్రెజిల్ నుంచి ఆస్కార్ నామినేషన్ పొందిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, హాలీవుడ్ చిత్రం ‘గుడ్ లక్, హావ్ ఫన్, డోంట్ డై’ వంటి సినిమాల స్థానిక పంపిణీ ఒప్పందాలు కూడా ఉన్నాయి. కనీసం మూడు ఒప్పందాల్లో సినిమాల హక్కుల కోసం చెల్లించిన మొత్తాలు వెల్లడైనట్టు ‘ది హిందూ’ గుర్తించింది. ఇలాంటి వివరాలు బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థల వ్యాపార ప్రయోజనాలకు నష్టం కలగవచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమాల నిర్మాణం, నటీనటుల ఎంపిక, పారితోషికాలు, లాభాల పంపిణీ, మేధో సంపత్తి హక్కులు, ప్రచార బాధ్యతలు వంటి అంశాలపై ఒప్పందాల్లో ప్రత్యేక నిబంధనలు ఉంటాయని వెరమ్ లీగల్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ వసుంధర తెలిపారు. అవి బహిర్గతమైతే సంస్థల చర్చల బలం తగ్గడంతోపాటు భవిష్యత్తులో ఒప్పందాల విషయంలో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఇక పోటీ సంస్థలకు ఆయా కంపెనీలు ఏ షరతులకు అంగీకరిస్తాయో తెలిసిపోవడం వల్ల భవిష్యత్తు చర్చల్లో వారికి పైచేయి లభిస్తుందని ఢిల్లీకి చెందిన న్యాయవాది అభినవ్ హన్సరామన్ వివరించారు. సెన్సార్ బోర్డు డిజిటల్ వ్యవస్థలోని భద్రతా లోపాలు ఎంతవరకు సమాచార గోప్యతను దెబ్బతీశాయన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
'సమాచారాన్ని భద్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత'
డిజిటల్ పాలన అంటే కేవలం సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడమే కాదనీ, ప్రజలు, సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని భద్రంగా ఉంచడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని నిపుణులు చెప్తున్నారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది? సమాచారానికి అనధికారిక యాక్సెస్ ఎలా సాధ్యమైంది? భద్రతా లోపాలు ఉంటే వాటికి బాధ్యులెవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని అంటున్నారు. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థల భద్రతపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
డిజిటల్ వ్యవస్థలో భద్రత ఎక్కడ?
సెన్సార్ బోర్డు కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు దాదాపు పదేండ్ల క్రితం ప్రారంభించిన ఈ-సినీప్రామాణ్ పోర్టల్ నుంచే ఈ సమాచారం లీకై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇందులో షూటింగ్ స్క్రిప్టులు, సెన్సార్ కట్ ఆదేశాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. సినిమాల పూర్తి వీడియోలు మాత్రం లీక్ కాలేదని 'ది హిందూ' కథనం స్పష్టం చేసింది. లీకైన పత్రాలను ఇంటర్నెట్ ఆర్కైవ్ వెబ్‌సైట్‌లో కొన్నిరోజులపాటు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండటం వ్యవస్థల పర్యవేక్షణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ నెల ప్రారంభంలో అప్‌లోడ్ చేసిన పత్రాలను అక్టోబర్ 12 నాటికి తొలగించారు. వాటిని అప్‌లోడ్ చేసిన వ్యక్తి ఖాతా కూడా అనంతరం తొలగిపోయింది. ఈ రికార్డులు 2025 డిసెంబర్ నుంచి 2026 ఆగస్టు వరకు ఉన్నట్టు గుర్తించారు.





కామెంట్‌లు (0)