పత్రికా స్వేచ్ఛపై దాడి
జర్నలిస్టులపై విరుచుకుపడిన పోలీసులు
ఢిల్లీ నిరసనల ఘటనలపై పలు జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
ప్రెస్ కార్డులు చూపించినా అదుపులోకి తీసుకున్నారు
ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు
మహిళా జర్నలిస్టుల లైంగికదాడి ఆరోపణలపైనా చర్యలు తీసుకోవాలి: ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు, భద్రతా బలగాలు వ్యవహరించిన తీరుపై పలు జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రెస్ కార్డులు చూపించినప్పటికీ పలువురు విలేకరులను అదుపులోకి తీసుకోవడం, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల ఫోన్లను స్వాధీనం చేసుకోవడం, వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆరోపణలు రావడం పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను, ప్రజల తరఫున వార్తలు అందించే మీడియాను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈనెల 10న ఢిల్లీలో జరిగిన నిరసనలను కవర్ చేస్తున్న సమయంలో జర్నలిస్టులపై ఈ చర్యలు చోటుచేసుకున్నాయి. జంతర్ మంతర్ పరిసరాల్లో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు పలువురు మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి.జర్నలిస్టుల రక్షణ కోసం పనిచేసే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) ఈ ఘటనపై స్పందించింది. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు, మీడియా సిబ్బందిని వెంటనే విడుదల చేయాలనీ, స్వాధీనం చేసుకున్న పరికరాలను తిరిగి ఇవ్వాలనీ, వారిపై భౌతిక దాడులు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరపాలని ఢిల్లీ పోలీసులను కోరింది. నిరసనలు, వాటిని పోలీసులు ఎదుర్కొంటున్న తీరుపై మీడియా ఎలాంటి అడ్డంకుటూ లేకుండా వార్తలు అందించే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. 'న్యూస్‌లాండ్రీ'కి చెందిన అశ్వినే కుమార్ సింగ్, ఆస్తా సవ్యసాచి, అన్మోల్ ప్రీతమ్, 'స్క్రోల్'కు చెందిన ఆయుశ్ తివారీ అదుపులోకి తీసుకున్న జర్నలిస్టుల్లో ఉన్నట్టు సీపీజే తెలిపింది. న్యూస్‌లాండ్రీ విలేకరులు వృత్తిపరమైన విధుల కోసం ఉపయోగిస్తున్న ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉందని వివరించింది. మరికొందరు జర్నలిస్టులపైనా దురుసుగా వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయని వెల్లడించింది.
జర్నలిజం నేరం కాదు
డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్ కూడా పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించింది. ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్న విలేకరులు ప్రెస్ కార్డులు చూపించినప్పటికీ అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టింది. ఇది శాంతిభద్రతల పరిరక్షణ చర్య కాదనీ, మీడియాను భయపెట్టే ప్రయత్నమని పేర్కొంది. జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, నిరసనకారులను వెంటనే విడుదల చేయాలనీ, స్వాధీనం చేసుకున్న పరికరాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. పోలీసుల దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలనీ, శాంతియుతంగా సమావేశమయ్యే పౌరుల హక్కును గౌరవించాలని కోరింది.
'ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి'
జర్నలిస్టుల హక్కులపై పనిచేసే నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌ఏజే) సైతం ఈ చర్యలను ఖండించింది. జంతర్ మంతర్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారనీ, అక్కడ జరుగుతున్న ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం ఆందోళనకరమని పేర్కొంది. ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వంటి సంఘాలు వ్యక్తం చేసిన నిరసనలకు మద్దతు తెలిపింది. ఈ పరిణామాలు అత్యవసర పరిస్థితి నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయనీ, భిన్నాభిప్రాయాలను అణచివేసే ధోరణి పెరుగుతోందని తన ప్రకటనలో విమర్శించింది.
మహిళా జర్నలిస్టుల లైంగిక దాడి ఆరోపణలు.. ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన
మరోవైపు.. ఈనెల 9న మహిళా జర్నలిస్టులపై లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జంతర్ మంతర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఇంకా పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి తెలిపింది. ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పత్రికా స్వేచ్ఛను, శాంతియుత నిరసన హక్కును గౌరవించాలని జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను కోరాయి.







కామెంట్‌లు (0)