Magazines

రేపటి నుంచి రుబియో భారత్‌ పర్యటన

1 గంట క్రితం

Rubio to visit India
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

డీజిల్‌ కోసమేనంటున్న పరిశీలకులు

న్యూఢిల్లీ : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. ఆయన తన పర్యటనలో భాగంగా ముంబయి, జామ్‌నగర్‌లను సందర్శిస్తారు. అయితే రుబియో షెడ్యూలులో రాజధాని ఢిల్లీ లేకపోవడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నలు కూడా సంధించారు. రుబియో ఈ నెల 20న ముంబయిలో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో సమావేశమవుతారు. ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, వ్యాపార ప్రముఖులను కూడా ఆయన కలుస్తారు. రుబియో తన పర్యటనలో ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్య చర్చలపై దృష్టి సారిస్తారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ చమురు శుద్ధి ప్రాంగణాన్ని సందర్శిస్తారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్‌ సైట్‌ చమురు శుద్ధి కర్మాగారం. రిలయన్స్‌ భాగస్వామ్యంతో టెక్సాస్‌లో 300 బిలియన్‌ డాలర్ల వ్యయంతో భారీ రిఫైనరీని నిర్మించబోతున్నామని ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ పురోగతిపై రుబియో తన భారత పర్యటన సందర్భంగా చర్చలు జరుపుతారు.

మధ్యంతర ఎన్ని కల వేళ ఇంధన కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రుబియో డీజిల్‌ కోసమే భారత్‌ వస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. వ్యూహాత్మక దౌత్య సంబంధాలతో పాటు ఇంధన భద్రత, చమురు వాణిజ్యం, ఇరు దేశాల మధ్య పెట్టుబడులు వంటి అంశాలకు రుబియో ఈ పర్యటనలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మధ్యంతర ఎన్ని కల వేళ అమెరికాలో నెలకొన్న చమురు సంక్షోభాన్ని అధిగమించడానికి రుబియో భారత్‌ పర్యటన ఉపయోగపడుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అమెరికా డీజిల్‌ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రుబియో పర్యటన జరగడం, ఇంధన సహకారం ప్రస్తావన రావడం విశేషం. రుబియో తన పర్యటనలో భారత చమురు శుద్ధి సామర్ధ్యంపై దృష్టి సారించవచ్చు. ఎందుకంటే ముడి చమురును డీజిల్‌గా మార్చే సామర్ధ్యం భారత్‌కు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రపంచంలోని అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రమైన జాంనగర్‌ను రుబియో సందర్శించబోతున్నారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయవద్దని ట్రంప్‌ ఉక్రెయిన్‌ను కోరుతున్నప్పటికీ దానిని కీవ్‌ పట్టించుకోవడం లేదు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని భారత్‌ తగ్గించింది. దీంతో భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే డీజిల్‌ ధర తక్కు వగా ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్