ఇండియా బ్లాక్ నేతల భేటీలో నిర్ణయం
విద్యార్థి సంఘాలు, పౌరసమాజ ప్రతినిధులతోనూ చర్చలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఇండియా బ్లాక్ సమావేశం నిర్ణయించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో మంగళవారం ఇండియా బ్లాక్ నేతల సమావేశం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమాన్ని కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్జేడీ నేతలు తేజస్వి యాదవ్, మనోజ్ ఝా, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ, సీపీఐ నేతలు డి.రాజా, పి.సంతోష్ కుమార్, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, ఆర్ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్, శివసేన నేత సంజయ్ రౌత్, జేఎంఎం నేత మహువా మాంఝీ, వీసీకే ఎంపీ తిరుమవలయన్, టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్, కేరళ కాంగ్రెస్ ఎంపీ మణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హరేంద్ర మాలిక్ తదితరులు హాజరయ్యారు. ఎఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ తదితర పౌరసమాజ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో అందరూ ఐక్యంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బతికించాలనేదే మా తాపత్రయం. దేశంలో ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారు. మోడీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది.’’ అని అన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ పట్ల తమకు అత్యంత గౌరవం ఉందనీ, వారికి ఒక నిర్దిష్ట పాత్ర ఉందనీ, వారు ఆ పాత్రను పోషిస్తారని తాము ఆశిస్తున్నామని తెలిపారు. రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందన్నారు. ఐక్యతతోనే ఇకపైనా కలిసి పోరాడతామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తామంతా ఒక్కటిగా నిలబడి ఉన్నామని వివరించారు. ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు వేదిక అయిన జంతర్ మంతర్ వద్ద నిరసనలను ప్రభుత్వం అడ్డుకుందనీ, తాము ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తామని స్పష్టంచేశారు. ‘‘మోడీ ప్రధాన వాస్తుశిల్పి, అమిత్ షా అమలుకర్త, జ్ఞానేశ్ కుమార్, ఇతరులు సహకరిస్తున్నారు. తమ చుట్టూ నెట్ మూసుకుంటోందని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి తప్పించుకోలేరు. ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించడానికి చివరి వరకు పోరాడేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మోడీ, షా, జ్ఞానేశ్ కుమార్, ఇతరులతో సహా అందర్నీ బాధ్యులను చేస్తామనేదే ప్రజలకు మేమిచ్చే వాగ్దానం’’ అని అన్నారు.
పోరాటం ఆగదు
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా బ్లాక్ పూర్తిగా ఏకమైంది. ‘‘మా పోరాటం కొనసాగుతుంది. దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు మేము నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం. బీజేపీ ప్రభుత్వ అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా పూర్తి శక్తితో పోరాడుతాం’’. - ఎన్‌సీపీ నేత సుప్రీయా సులే
సీఈసీకి శిక్ష తప్పదు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష తప్పదు. రాబోయే రోజుల్లో మా పోరాటం మరింత దూకుడుగా సాగుతుంది. మోడీ-షా ఆదేశాల మేరకు జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా వ్యవహరించారు.
ఆయనో కీలుబొమ్మలా మారారు. దీనికి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఈ పోరాటం ఏ ఒక్క వ్యక్తికో లేదా పార్టీకో పరిమితమైనది కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య విలువలు, ప్రతి పౌరుడి హక్కులకు సంబంధించిన పోరాటం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా బ్లాక్‌లోని పార్టీలన్నీ ఏకమయ్యాయి.
-ఆర్‌జేడీ నేత తేజశ్వీ యాదవ్
ఎస్‌పీ ఎంపీ హరేంద్ర మాలిక్ మాట్లాడుతూ న్యాయం కోసం జరిగే పోరాటంలో పార్టీలన్నీ ఐక్యంగా నిలుస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హతమార్చే 'ఓటు దొంగల'పై చివరి శ్వాస వరకు పోరాడి విజయం సాధిస్తామని స్పష్టం చేశారు.శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘జ్ఞానేశ్ కుమార్ ఒక మాఫియా లాంటి వ్యక్తి. ఆయన మొత్తం వ్యవస్థనే నేరమయం చేశారు. గత 12 ఏండ్లుగా మోడీ, షా దేశాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఇప్పుడు భయపడాల్సిన వంతు వారిదే. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం మనమందరం కలిసి గళమెత్తుతాం’ అని అన్నారు.
టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ మాట్లాడుతూ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం కొనసాగుతున్నంత కాలం, దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగడం అసాధ్యమని అన్నారు. జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ 'ఓట్ల చోరీ' వ్యవహారంలో ప్రమేయం ఉన్న అధికారులందరిపైనా విచారణ జరపాలని, వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ ‘దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఉన్న ఏకైక శత్రువు బీజేపీ. ఓటర్ల హక్కులపై దాడి అంటే భారతదేశంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలి. సర్ ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతింది. దాన్ని రద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
అప్రజాస్వామ్యంపై ఇండియాబ్లాక్ నిరంతర పోరాటం
ఓట్ల అపహరణ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా 'ఇండియా' బ్లాక్ నిరంతరం పోరాడుతోంది. ‘నిరసన తెలపడం మా హక్కు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి మోడీ ప్రభుత్వం సర్వశక్తులనూ ఒడ్డినప్పటికీ, అది విఫలమైంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మేమంతా కలిసి ఈ పోరాటాన్ని సాగిస్తాం. విజయం సాధిస్తాం’ .
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ
సమస్యలపై పోరాటాలే
ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నాం. సీఈసీకి వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటం విజయవంతమైంది. సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు. 'ఇండియా బ్లాక్ నిర్వహించిన కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
- రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే
జంతర్ మంతర్ ను దీక్షా కేంద్రంగానే ఉంచాలి
‘‘
కేంద్రప్రభుత్వం ఇప్పుడు జంతర్ మంతర్ హోదాను రద్దు చేసింది (డీనోటిఫై చేసింది). ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జంతర్ మంతర్ అనేది ప్రజలు నిరసనలు తెలిపే ప్రదేశంగానే కొనసాగాలి’’ . ఆందోళనపై భయంతోనే జంతర్ మంతర్‌ను మూసివేశారు.
-సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
అధికారపార్టీ
బృందంలో ఈసీ
నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి, అధికార పార్టీకి చెందిన బృందంలో చేరారు. ‘‘వీరు మొదట ఓట్లను దొంగిలించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహరించారు. ఇప్పుడు నిరసనల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా లాగేసుకున్నారు. ఈ 'ఓట్ల దొంగల'కు వ్యతిరేకంగా 'ఇండియా' బ్లాక్ మొత్తం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుంది’’
-సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ






కామెంట్‌లు (0)