లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు

54 నిమిషాల క్రితం

Lok Sabha
avatar
balaji

ప్రచురించబడింది నవం 28, 2026 | 5 నిమిషాల చదవడం

అసెంబ్లీల్లో కూడా...

డీలిమిటేషన్‌‌తోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు

30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు


నవతెలంగాణ-న్యూఢిల్లీ
లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో స్థానాలను 50 శాతం పెంచడంతోపాటు, రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని మరో 25 ఏండ్లు కొనసాగించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నియోజ కవర్గాల పునర్విభజనతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను ముడిపెట్టి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 543 స్థానాలున్న లోక్‌సభ సంఖ్యాబలం 50 శాతం పెంపుతో సుమారు 850కి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీలో ప్రస్తుతం కొనసాగుతున్న నిష్పత్తిని 2051 వరకు కొనసాగించాలని ప్రతిపాదించారు.

1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు స్తంభిం పజేయనున్నారు. దీంతో జనాభా పెరుగుదల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల పంపిణీలో మార్పులు చోటుచేసుకోకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది. గత ఏప్రిల్‌లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశ పెట్టిన డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ సంబంధిత బిల్లులు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించ లేకపోయాయి. తాజా ప్రతిపాదనల్లో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం స్థానాల పెంపు, రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే అంశాలను చేర్చి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లో ఆమోదించిన చట్టం అమలును 2029 ఎన్నికల నాటికి సాధ్యం చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడి ఉన్న నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లులపై చర్చించేందుకు నవంబర్‌ 30 నుంచి లోక్‌సభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 2న రాజ్యసభ సమావేశం కానుంది. డీలిమి టేషన్‌ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తి వంటి అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.

జనాభా నియంత్రణను
సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌ వల్ల రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టం జరగకుండా చూడాలని ఆయా రాష్ట్రాలు గతంలో ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రాల ప్రస్తుత వాటాను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న ప్రతిపాదన ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బిల్లులోని నిబంధనలు, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించే విధానం, రాజ్యాంగపరమైన అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉంది.

​వివరాలు వెల్లడించలేం : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

​నవంబరు 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన శాసన వ్యవహారాలు చేపట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు సభ్యులంతా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనీ, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమన్నారు. అయితే దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను సభ ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ప్రపంచమంతా భారత ప్రజాస్వామ్యాన్ని గమనిస్తోందని, పార్లమెంటు సమావేశాలను బాధ్యతాయుతంగా నిర్వహిం చడం అన్ని పార్టీల బాధ్యత అని చెప్పారు. సభలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు ఎంపీలకు అవకాశం ఉంటుందనీ, సభా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు.

​నేడు ఇండియా బ్లాక్ భేటీ​

డీలిమిటేషన్‌ ‌సహా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండియా బ్లాక్ శనివారం ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించనుంది. ఇండియా బ్లాక్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారనీ, కేంద్రం దేశ ప్రజల ముందు పెద్ద ఉచ్చు పన్నుతోందని విమర్శించారు. డీఎంకే సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను సంప్రదిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలన్నీ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

​డీలిమిటేషన్‌కు ఎన్‌సీపీ మ‌ద్ద‌తు

​లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లుకు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్‌పీ) మద్దతు ప్రకటించింది. ఆపార్టీ సీనియర్‌ నేత జితేంద్ర అవ్హాద్‌ శుక్రవారం ముంబయిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ అధినేత శరద్‌ పవార్‌ను కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు.

ఒరిస్సా ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించాలి : బీజేడీ

​డీలిమిటేషన్‌పై బిజూ జనతాదళ్ (బిజెడి) కూడా షరతులతో కూడిన వైఖరిని వెల్లడించింది. పార్లమెంటులో ఒరిస్సాకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించాలని ఆ పార్టీ ఎంపి సంతృప్త్‌ మిశ్రా కోరారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌ను ముడిపెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల పరిధిలోనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని పేర్కొన్నారు. బిల్లులోని అంశాలపై స్పష్టత లేదని, అన్ని రాజకీయ పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని కోరారు.​

​ప్రస్తుత రూపంలో బిల్లును అంగీకరించం : సీపీఐ

​డీలిమిటేషన్‌ బిల్లును ప్రస్తుత రూపంలో అంగీకరించేది లేదని సిపిఐ ఎంపి పి.సంతోష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. 2023 సెప్టెంబరులో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టానికి వామపక్షాలు మద్దతు తెలిపాయని గుర్తుచేశారు. అయితే మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌ను షరతుగా పెట్టడం ఆమోదయోగ్యం కాదన్నారు. గత ఏప్రిల్‌లో రాజ్యాంగ 131వ సవరణ బిల్లు లోక్‌సభలో ఓడిపోయిన నేపథ్యంలో కొన్ని పార్టీలు ఇప్పుడు వైఖరి మార్చుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు.

రాజకీయ కుతంత్రంః ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా​

​డీలిమిటేషన్‌ ప్రక్రియ కేవలం లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచడానికి మాత్రమే పరిమితం కాదని, దీని వెనుక రాజకీయ ప్రయోజనాల కోసం నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే ప్రమాదం పొంచి ఉందని ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉందని విమర్శించారు. అస్సాంలో గతంలో చోటుచేసుకున్న పరిణామాల తరహాలోనే దేశవ్యాప్తంగా రాజకీయ ప్రేరేపిత పునర్విభజన జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజ్యాంగ సూత్రాలు, ప్రజాస్వామ్య న్యాయబద్ధత ఆధారంగా కాకుండా పార్టీల ప్రయోజనాలే ప్రాతిపదికగా డీలిమిటేషన్‌ చేపడితే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, సమాఖ్య సమతుల్యత, జాతీయ ఐక్యత తీవ్రంగా దెబ్బతింటాయని మనోజ్‌ ఝా పేర్కొన్నారు. ఈ పరిణామాలపై దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.


మహిళా రిజర్వేషన్ల ముసుగులో 
మెజార్టీ తయారీకి కుట్ర


సీపీఐ(ఎం)ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌

మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లును ఆమోదించుకునేందుకు రాజకీయ విలీనాలు, కొనుగోళ్లు, పార్టీ ఫిరాయింపులతో కృత్రిమ మెజార్టీని తయారు చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. ప్రభుత్వాల విలీనాలు, స్వాధీనాలు, పార్టీలు కలవడం, ఎంపీల కొనుగోళ్ల వెనుక ఒకే కుట్ర దాగి ఉందని ధ్వ‌జ‌మెత్తారు. రాజకీయ మానిప్యులేషన్‌తో సృష్టించిన మెజార్టీ ప్రజలిచ్చిన తీర్పు కాదని, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. నవంబరు 30న జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారతను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని, మహిళా రిజర్వేషన్లను ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునే కుట్రకు ముసుగుగా ఉపయోగించరాదని స్పష్టం చేశారు.

రాజ్యాంగ సారాంశం ప్రజల తీర్పును గౌరవించడమేనని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడాలని, చట్టాలు రూపొందించాలని, అంతేగానీ ఆ తీర్పును వమ్ము చేసేలా వ్యవహరించరాదని హితవు పలికారు. డీలిమిటేషన్‌ పేరుతో జరుగుతున్న విలీనాలు, స్వాధీనాలు, కొనుగోళ్లు, రాజకీయ బేరసారాలన్నీ కృత్రిమ మెజార్టీని సృష్టించేందుకేనని ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. డీలిమిటేషన్‌ ప్రక్రియ పేరుతో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్