మూడింట రెండొంతుల మెజార్టీ కష్టమే
డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) వైఖరిపై బీజేపీ ఆశలు
ఈ రెండూ మద్దతిచ్చినా మరో ఓటు అవసరం
వైసీపీ నాలుగు ఓట్లపైనే ఎన్డీఏ ఆశలు
360 మంది ఎంపీల మద్దతు అవసరం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకు నేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 540 మంది సభ్యులు గల సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించేందుకు 360 ఓట్లు అవసరం. గతంలో బిల్లు వీగిపోయిన నేపథ్యంలో మరోసారి డీఎంకే, ఎన్సీపీ (శరత్ పవార్) సహా కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుపై అధికార కూటమి ఆశలు పెట్టుకుంది. డీఎంకేకు 22 మంది, ఎన్సీపీ(ఎస్పీ)కి ఎనిమిది మంది ఎంపీల మద్దతు ఇచ్చి, ఆప్, ఆర్జేడీ ఓటింగ్‌కు దూరంగా ఉన్నా బిల్లు గట్టెక్కడానికి అవసరమైన మరో ఒక్క ఓటు తక్కువవుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏ, వైసీపీ 353 ఓట్లు సాధించే అవకాశముండగా, బిల్లు ఆమోదానికి 354 ఓట్లు తప్పనిసరి.
గతంలో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగింపు
గత ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. అప్పట్లో ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజార్టీకి 352 ఓట్లు అవసరం కాగా, ప్రభుత్వం 54 ఓట్లతో వెనుకబడింది. దీంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలకు సంబంధించిన రెండు బిల్లులు వీగిపోయాయి. ఈసారి లోక్‌సభలో అవసరమైన 360 ఓట్లను సాధించేందుకు చిన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన కనీసం ఆరుగురు ఎంపీల మద్దతు ఇప్పటికే లభించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ స్థానాలను గరిష్టంగా 850కు పెంచడంతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్యతో పోలిస్తే 50 శాతం నిష్పత్తిలో పెంచే ప్రతిపాదన కూడా ఇందులో ఉన్నట్టు సమాచారం.
డీఎంకే, ఎన్సీపీ మద్దతు కీలకం
లోక్‌సభలో డీఎంకేకు 22 మంది, ఎన్సీపీ(ఎస్పీ)కి 8 మంది సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలు బిల్లుకు మద్దతిస్తే ప్రభుత్వానికి 353 ఓట్లు వస్తాయి. ఆప్‌నకు చెందిన ముగ్గురు, ఆర్జేడీకి చెందిన నలుగురు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే అవసరమైన మెజార్టీ 354కు తగ్గుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఒక్క ఓటుతో వెనుకబడుతుంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బిల్లును పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల వాటా 7.18 శాతం తగ్గకుండా రాజ్యాంగపరమైన హామీ ఇవ్వాలని ఆ పార్టీ ప్రధానంగా కోరుతోంది. ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియా సూలే కూడా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బిల్లును పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
చివరి ఓటుపైనే ఉత్కంఠ
ప్రభుత్వానికి అవసరమైన చివరి ఓటు ఎక్కడి నుంచి వస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన వీసీకే కు చెందిన ఇద్దరు ఎంపీల వైఖరి కీలకం కానుంది. అలాగే జెఎంఎంకు చెందిన ముగ్గురు, వీసీకేకు చెందిన ఇద్దరు, ఆర్ఎల్పీకి చెందిన ఒక ఎంపీ మద్దతు లభించే అవకాశాలపైనా బీజేపీ అంచనాలు వేస్తోంది. వీరంతా మద్దతిస్తే ప్రభుత్వానికి ఐదు ఓట్ల అదనపు మెజార్టీ లభించవచ్చు. మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు ఇద్దరు ఓటింగ్‌కు గైర్హాజరైనా అవసరమైన మెజార్టీ 353కి తగ్గి ప్రభుత్వానికి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. స్వతంత్ర ఎంపీ అమృత్‌పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అసోంలోని జైలులో ఉండగా, ఇంజినీర్ రషీద్ కూడా జైలులోనే ఉన్నారు. వీరు ఓటింగ్‌కు హాజరుకాకపోవడం ప్రభుత్వానికి అనుకూలంగా మారవచ్చు. అయితే ఎన్డీఏ సభ్యులు గైర్హాజరైతే ప్రభుత్వానికి మెజార్టీ సాధించడం మరింత కష్టమవుతుంది.
రాజ్యసభలోనూ సవాలే
డిసెంబరు 2న సమావేశం కానున్న రాజ్యసభలోనూ బిల్లుకు మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. మొత్తం 244 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే 164 ఓట్లు కావాలి. ఎన్డీఏకు సుమారు 154 మంది సభ్యుల బలం ఉండగా,వైసీపీ సభ్యులతో కలిపి ఈ సంఖ్య 158కు చేరుతుంది. దీంతో మరో ఆరు ఓట్లు అవసరమవుతాయి. డీఎంకే , ఎన్సీపీ (ఎస్పీ)తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందినప్పటికీ, రాష్ట్రాల ప్రాతినిధ్యంలో మార్పులు జరుగుతున్నందున రాజ్యాంగంలోని 368(2) అధికరణ ప్రకారం కనీసం సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది.






కామెంట్లు (0)