Magazines

దొందూ దొందే!

34 నిమిషాల క్రితం

dozen
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 3 నిమిషాల చదవడం

సోషల్‌ మీడియాతో అధికార దర్పం

మోడీ, ట్రంప్‌ ప్రచార శైలిలో ఒకే తీరు

వ్యక్తిగత కీర్తి కోసం ఆరాటం.. విమర్శలను సహించని వైనం

ప్రత్యర్థులపై విష ప్రచారం.. భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు

వైఫల్యాలను గత పాలకుల ఖాతాలోకి వేస్తూ రాజకీయాలు

గత అధ్యక్షుడిపై ట్రంప్‌, కాంగ్రెస్‌పై మోడీ

ప్రజాస్వామ్య దేశాలకు ఈ తీరు మంచిది కాదు : రాజకీయ విశ్లేషకులు


న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు.. సోషల్‌ మీడియాను తమ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకునే ప్రచార వేదికలుగా మార్చుకుంటున్నారు. అధికారాన్ని బలోపేతం చేసుకోవడం, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం, విమర్శలను పక్కదారి పట్టించడం వంటి అంశాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని మోడీ వ్యవహారశైలిలో అనేక పోలికలు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన నేతలు.. తమ గొప్పతనాన్ని చాటుకునే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్‌ ప్రశంసల కోసం భారీ మొత్తం వ్యయం

మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో ప్రశంసిస్తూ పోస్టు పెట్టేలా చేయడానికి భారత ప్రభుత్వం నెలకు 75 వేల డాలర్ల చొప్పున మెర్క్యురీ పబ్లిక్‌ అఫైర్స్‌ అనే లాబీయింగ్‌ సంస్థను నియమించుకున్నట్టు వచ్చిన కథనం ఈ ధోరణికి అద్దం పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధ్యక్షుడి నుంచి ప్రశంసలు పొందేందుకు భారీ మొత్తాన్ని వెచ్చించడం మోడీ వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడిస్తోంది. సోషల్‌ మీడియాను రాజకీయ ప్రచారానికి ఉపయోగించడంలో మోడీ ముందంజలో ఉన్నారు. 2009 నుంచే ప్రత్యేక సిబ్బందిని నియమించుకుని ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ద్వారా ప్రచారం ప్రారంభించారు.

ప్రధాన స్రవంతి మీడియా నుంచి వచ్చే ప్రశ్నలు, విమర్శలను ఎదుర్కోవడానికి బదులుగా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకునే పేరుతో ఏకపక్ష ప్రచారానికి తెరలేపారు. ట్రంప్‌ కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం సాగించారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్‌పై దాడి నేపథ్యంలో హింసను ప్రేరేపించే ప్రమాదముందనే కారణంతో ఆయన ఖాతాలను నిలిపివేశారు. అనంతరం ట్రూత్‌ సోషల్‌ వేదికను ట్రంప్‌ ప్రారంభించారు.

వైఫల్యాలు కాంగ్రెస్‌ ఖాతాలో.. విజయాలు తన ఖాతాలో..!

ఇద్దరి సోషల్‌ మీడియా పోస్టుల్లోనూ వ్యక్తిగత గొప్పతనం, అహంకారం, స్వీయ ప్రచారం ప్రధానంగా కనిపిస్తున్నాయి. ట్రంప్‌ తనను తాను అమెరికా చరిత్రలోనే గొప్ప అధ్యక్షుడిగా చిత్రీకరించుకునేందుకు ఏఐ చిత్రాలను ఉపయోగించుకున్నారు. ఏకంగా తనను జీసస్‌తో పోలుస్తూ చిత్రాలను కూడా ప్రచురించారు. మరోవైపు మోడీ తన విజయాలకు 140 కోట్ల మంది భారతీయులే కారణమంటూ చెప్పుకుంటూనే తన నాయకత్వాన్ని గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎదురైనప్పుడు బాధ్యత తీసుకోవడానికి బదులుగా ప్రత్యర్థులపై నిందలు వేయడం ఇద్దరికీ అలవాటుగా మారింది. ట్రంప్‌..

గత అధ్యక్షుడు జో బైడెన్‌ను లక్ష్యంగా చేసుకుంటే, మోడీ ప్రతి రాజకీయ విమర్శకు కాంగ్రెస్‌ను బాధ్యురాలిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయాలు వచ్చినప్పుడు మాత్రం వాటిని తమ నాయకత్వ గొప్పతనానికి నిదర్శనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులపై దూషణలు, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌లోనూ ఇద్దరి ధోరణులు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ నేరుగా అవమానకర వ్యాఖ్యలు చేస్తుండగా, మోడీ మాత్రం తన పోస్టుల్లో ప్రత్యక్ష దూషణలకు దూరంగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అనుచరులను అనుసరిస్తున్నారు. గౌరీ లంకేశ్‌ హత్య అనంతరం ఓ వ్యక్తి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఈ ఆన్‌లైన్‌ ద్వేష రాజకీయాలకు ఉదాహరణగా నిలిచాయి.

తొలగింపుల పేరుతో భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌లోని సమాచారాన్ని తొలగించేందుకు జారీ చేస్తున్న ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నుంచి జులై వరకు ఐదు నెలల్లో సుమారు 1.95 లక్షల కంటెంట్‌ తొలగింపు అభ్యర్థనలు వచ్చినట్టు సమాచారం. గతంలో 36 గంటలుగా ఉన్న తొలగింపు గడువును మూడు గంటల కు తగ్గించడం ద్వారా అభ్యంతరకరంగా భావించిన సమాచారాన్ని వేగంగా తొలగించే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌), సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడమ్‌ లా సెంటర్‌ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) సంస్థలకు ఢిల్లీ పోలీసుల పేరుతో నకిలీ తొలగింపు ఆదేశాలు పంపిన ఘటన ఈ వ్యవస్థలోని ప్రమాదాలను బయటపెట్టింది. ఆర్‌ఎస్‌ఎస్‌ పేరుతో వచ్చిన నోటీసు అనంతరం, ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కమిషనర్‌ పేరుతో ఎక్స్‌ వేదికకు ఫిర్యాదులు పంపి పలు పోస్టులు, ఖాతాలను తొలగించాలని కోరారు. అయితే, అంతర్గత విచారణలో ఆ ఫిర్యాదులు నకిలీ ఈమెయిల్‌ నుంచి వచ్చినట్టు ఎక్స్‌ గుర్తించింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తుతం ఆ ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం లేదని ఎక్స్‌ స్పష్టం చేయడంతో పిటిషన్లు పరిష్కారమయ్యాయి.

ఈ తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు : రాజకీయ విశ్లేషకులు

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సంస్థలు, జర్నలిస్టులు, సామాజిక మాధ్యమ వినియోగదారులపై తొలగింపు చర్యల భయం పెరుగుతున్న పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విశ్లేషకులు చెప్తున్నారు. అధికార ప్రచారం, తప్పుడు సమాచారం, వ్యక్తిగత కీర్తి కోసం ఆరాటం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు.. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రమాదం ఉందని అంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్