494కు చేరిన ఏక్యూఐ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. శుక్రవారం ఉదయం 7:31 గంటలకు నగరం మొత్తం గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 494గా నమోదైంది. దట్టమైన పొగమంచు, కాలుష్యం కారణంగా నగరాన్ని పొగ కమ్మేయడంతో పలు ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్ర కేటగిరీలో నమోదైంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, అత్యధిక కాలుష్యం నమోదైన ప్రాంతాల్లో ఐఐటీ ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఏక్యూఐ 488గా నమోదైంది. ఐటీఓలో 455, ఆనంద్ విహార్‌లో 419, రోహిణిలో 413, రాజోక్రి సరిహద్దు ప్రాంతంలో 402గా నమోదైంది. ఈ ప్రాంతాలన్నింటిలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లోనూ కాలుష్య తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆర్కే పురంలో ఏక్యూఐ 391, మందిర్ మార్గ్‌లో 378, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో 369, ఉత్తమ్ నగర్‌లో 363, లోధి రోడ్‌లో 341గా నమోదైంది. అయితే ధౌలా కువాన్ పరిసర ప్రాంతంలో ఏక్యూఐ 161గా నమోదై మోస్తరు కేటగిరీలో ఉంది.
కాలుష్య నియంత్రణకు చర్యలేవి..?
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరవ్యాప్తంగా వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయడంతో పాటు గాలిలోని సూక్ష్మ ధూళి కణాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు విఫలమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు దీపావళి వేడుకల అనంతరం కాలుష్య స్థాయిలు భారీగా పెరగడంపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
కాలుష్య గణాంకాల్లో తారుమారు జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీపీసీబీ చూపిస్తున్న ఏక్యూఐ 370గా ఉంటే, వాస్తవ స్థాయి 560 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. కాలుష్య స్థాయిలు 999కు చేరినప్పుడు ఆ తర్వాతి స్థాయిని సీపీసీబీ కొలవలేకపోతోందని, 999 కంటే ఎక్కువగా నమోదైన విలువలను కూడా ప్రదర్శించడం లేదని విమర్శించారు.
అందువల్ల కాలుష్య స్థాయి 999 దాటినప్పుడు సున్నాగా చూపిస్తున్నారని ఆరోపించారు. కాలుష్య గణాంకాల్లో జరిగినట్టు చెబుతున్న ఈ అవకతవకలు కేవలం సంఖ్యలకు సంబంధించినవి మాత్రమే కాదని, ఢిల్లీలోని పిల్లలు, వృద్ధులు సహా రెండు కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
గణాంకాల్లో వ్యత్యాసం గుర్తించిన సీఆర్ఈఏ
ఢిల్లీలోని కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల గణాంకాలను సీఆర్ఈఏ అధ్యయనం చేసింది. నగరంలోని 59 పర్యవేక్షణ కేంద్రాల నుంచి గంటవారీ పీఎం 2.5 డేటాను పరిశీలించింది. నవంబర్ 8 సాయంత్రం 4 గంటల నుంచి నవంబర్ 9 సాయంత్రం 4 గంటల మధ్య 255 కేంద్రాల గంటవారీ రికార్డులు అందుబాటులో లేవని గుర్తించింది. ఈ అధ్యయనం అనంతరం 24 గంటల సగటు పీఎం 2.5 స్థాయి 269 మైక్రోగ్రాముల నుంచి 400 మైక్రోగ్రాములకు పెరిగినట్టు సీఆర్ఈఏ పేర్కొంది.
దీంతో దాదాపు 4 శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. ఈ నివేదిక ఆధారంగానే భరద్వాజ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
యమునా నదిలో చనిపోయిన చేపలు
ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నదిలో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయి నీటిపై తేలుతున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. సోనియా విహార్ ప్రాంతంలో చేపలు భారీగా మృతిచెంది, ఒడ్డుకు కొట్టుకొచ్చిన వీడియోలు వైరల్ కావడంతో యమునా నది జల కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హత్నీకుండ్ బ్యారేజీ సమీపంలోని లెదర్ పరిశ్రమ నుంచి కలుషిత నీటిని నదిలోకి వదలడం వల్లే చేపలు మృత్యువాత పడ్డాయని, ఏటా అక్కడి నుంచి నీరు విడుదల చేసినప్పుడు ఇదే సమస్య తలెత్తుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బురారీ వద్ద కూడా యమునా నది ఒడ్డున వేలాది చేపలు చనిపోయి కనిపించాయి. నీటి నాణ్యత పరీక్షలు, సమగ్ర దర్యాప్తు తర్వాతే చేపల మృతికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.






కామెంట్‌లు (0)