ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదు
కొలీజియం సిఫారసులు జవాబుదారీతనానికి అతీతం కావు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ లేఖరాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
యమూర్తుల నియామకాలు, బదిలీల్లో ఒకే సామాజిక తరగతికి అధిక ప్రాధా న్యత ఇస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో సామాజిక వైవిధ్యం, సమ్మిళితత్వం, ప్రతిభకు ప్రాధాన్యత తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆమెకు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు పంపించారు. దేశ జనాభాలో ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఒక సామాజిక తరగతికి ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించిందని గవాయ్ తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు ఉన్నత న్యాయవ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని తెలిపారు.
2018 నుంచి హైకోర్టులకు నియమితులైన 715 మంది న్యాయమూర్తుల్లో ఎస్సీల నుంచి 22 మంది, ఎస్టీల నుంచి 16 మంది, ఓబీసీల నుంచి 89 మంది, మైనార్టీల నుంచి 37 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. ఈ గణాంకాలను 2025 మార్చిలో రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించిన సమాచారం ఆధారంగా ప్రస్తావించారు. నియామకాల్లో దాదాపు మూడొంతుల మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి 2026 జనవరి వరకు జరిగిన నియామకాల్లో అగ్రవర్ణాల ప్రాతినిధ్యం దాదాపు 80 శాతానికి చేరగా, దేశ జనాభాలో 40 నుంచి 50 శాతం వరకు ఉన్న ఓబీసీల ప్రాతినిధ్యం 14 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. తాను కొలీజియంలో సభ్యుడిగా, అనంతరం దాని అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అన్ని సామాజిక తరగతులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేశానని గవాయ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఒకే సామాజిక తరగతిని సంతృప్తిపరిచి, ప్రోత్సహించే విధంగా నియామకాలు జరుగుతున్నాయనే అభిప్రాయానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతుల్లోనూ ప్రతిభకు బదులుగా ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో చిన్న హైకోర్టులకు బదిలీ అయిన న్యాయమూర్తులకు అనంతరం ప్రముఖ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పిస్తున్నారని, ప్రతిభావంతులైన ఇతర న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక అధికారం రాష్ట్రపతికి ఉందని గవాయ్ గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థ ఉన్నంత మాత్రాన దాని సిఫార్సులు జవాబుదారీతనానికి అతీతం కావని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంటుకు కూడా న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని సామాజాకి తరగతులకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా సంబంధిత వ్యవస్థలకు రాష్ట్రపతి తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.






కామెంట్లు (0)