కార్పొరేట్లపై నెపం నెట్టే ప్రయత్నం
ఉద్యోగాల కల్పనలో వైఫల్యాన్ని బయటపెట్టిన ప్రధాని వ్యాఖ్యలు
అదానీ, అంబానీలకు పెద్దపీట.. చిన్న వ్యాపారాలపై నిర్లక్ష్యం
సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకరణ
న్యూఢిల్లీ : పన్నెండేండ్లుగా అభివృద్ధి మంత్రం, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందంటూ ప్రచారం చేసుకుంటున్న మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్థిక వాస్తవాలు సవాలు విసురుతున్నాయి. పరిశ్రమలకు భారీగా పన్ను రాయితీలు ఇచ్చినా పెట్టుబడులు పెరగకపోవడం, ఉద్యోగాల కల్పన లేక పోవడం, కార్మికుల వేతనాలు స్థిరంగా ఉండి పోవడ ంపై ప్రధాని మోడీ ఇటీవల పారిశ్రామిక వేత్తలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యాలను పరోక్షంగా బయటపెట్టింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పటికీ.. సమస్యలకు కార్పొరేట్లను బాధ్యులుగా చూపించే ప్రయత్నం విమర్శలకు తావిస్తోంది.
పరిశ్రమలపై ప్రధాని అసహనం
ఈనెల 18న ఫిక్కీ సమావేశంలో మాట్లాడిన మోడీ.. దిగుమతులు పెరుగుతున్నాయనీ, దేశీయ ఉత్పత్తుల నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమలు పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ పన్ను తగ్గించినా వేతనాలు పెంచడం లేదనీ, కొత్త ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. ఎంత ఇచ్చినా కార్పొరేట్ల ఆకలి తీరడం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిస్థితికి కారణమైన కేంద్ర ప్రభుత్వ విధానాలపై మాత్రం సమాధానం చెప్పే సాహసాన్ని మోడీ చేయలేకపోయారని విశ్లేషకులు వివరిస్తున్నారు.
పరిశోధనలకు నిధులేవీ?
2019లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించినప్పటికీ దేశంలో పెట్టుబడులు, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. పరిశోధన, అభివృద్ధికి భారత్ కేటాయిస్తున్న నిధులు అమెరికా, చైనాతో పోలిస్తే చాలా తక్కువ. ప్రపంచ ఆవిష్కరణల సూచీలో భారత్ 38వ స్థానంలో ఉంది. నాణ్యమైన విద్య, స్వతంత్ర ఆలోచన, శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా దేశం సాంకేతికంగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నది మేధావులు, నిపుణుల నుంచి వినిపిస్తున్న ప్రధాన విమర్శ.
అదానీకి అండ.. అసంఘటిత రంగానికి నిర్లక్ష్యం
మరోవైపు మోడీ పాలనలో క్రోనీ క్యాపిటలిజం (అధికారానికి దగ్గరగా ఉన్న కార్పొరేట్లకు అనుకూ లంగా వ్యవహరించడం) పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అసంఘటిత రంగాన్ని పట్టించుకోకుండా అదానీ వంటి పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ విధానాలు అనుకూలంగా మారాయని విమర్శలు వెల్లువెత్తాయి. 2014లో ఏడు బిలియన్ డాలర్లలోపు ఉన్న అదానీ సంపద 2026 నాటికి 120 బిలియన్ డాలర్లకు చేరినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. మోడీ పాలనలో ప్రభుత్వ ఆస్తులు, కాంట్రాక్టుల విషయంలో ఆయనకు ప్రాధాన్యం దక్కడం వంటి చర్యలే అదానీ సంపద అమాంత పెరగడానికి కీలకంగా మారాయన్న వాదనలూ ఉన్నాయి.
ఉపాధిపై ప్రశ్నలకు సమాధానమేది?
నిరుద్యోగ సమస్యపై యువత, ప్రతిపక్షాలు ఎన్నో ఏండ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా మోడీ ప్రభుత్వం ముద్రా రుణాలు, స్టార్టప్‌లు, పకోడీల అమ్మకాన్ని ఉపాధి కల్పనకు ఉదాహరణలుగా చూపుతూ వచ్చింది. కార్మికుల వేతనాల పెంపు కోసం పోరాడిన వారిపై కేసులు, అరెస్టులు చేయడం కూడా పరిశ్ర మలకు తప్పుడు సంకేతాలు పంపిం దన్న విమర్శలు న్నాయి. ఇప్పుడు వేతనాలు ఎందుకు పెరగడం లేదని పారిశ్రామికవేత్తలను ప్రశ్నించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
సంపద పెరుగుదల కొందరికే పరిమితం
వివాదాస్పద పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ, ముందస్తు ప్రణాళికలేని లాక్డౌన్ వంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు దేశ సంపద లో 40 శాతానికి పైగా ఒక శాతం అత్యంత సంపన్నుల చేతుల్లోనే ఉండగా, దిగువన ఉన్న 50 శాతం ప్రజల వాటా కేవలం 6.4 శాతంగా ఉంది. ఐదు కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే దేశ ఆదాయంలో 60 శాతం ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తు న్నాయి. 2019-2025 మధ్య ఐదు సంపన్న కుటుంబాల ఆస్తులు 400 శాతం పెరిగడం గమనార్హం.
ఏడేండ్లుగా ఏం చేస్తున్నట్టు?
కార్పొరేట్ పన్ను తగ్గించిన ఏడేండ్ల తర్వాతే ఈ సమస్యలు ప్రధానికి గుర్తుకు వచ్చాయా? ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్నాళ్లూ ఏం చేసింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి భారీగా నిధులు సమకూరిన నేపథ్యంలో అధికార పార్టీకి, కార్పొరేట్లకు మధ్య ఉన్న సంబంధాలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ అనుకూలతలు కల్పించి, ఇప్పుడు మొత్తం పారిశ్రామిక రంగాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమన్నది మోడీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని విశ్లేషకులు అంటున్నారు.
వైఫల్యాలకు బాధ్యత ఎవరిది?
పన్నెండేండ్లకు పైగా అధికారంలో ఉండి ఆర్థిక వైఫల్యాలకు బాధ్యత వహించకుండా కార్పొ రేట్లపై నెపం నెట్టడం మోడీ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఉద్యో గాలు, వేతనాలు, పెట్టుబడులు, అసమానతలపై ప్రజ లకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. అభివృద్ధి ప్రచారానికి, ప్రజల వాస్తవ జీవితాలకు మధ్య పెరుగుతున్న అంత రాన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాని దేనన్న విషయాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు.
మత రాజకీయాలకు పెద్దపీట
ఇదే సమయంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధీరేంద్ర శాస్త్రి వంటి మత ప్రచారకులకు మోడీ బహిరంగంగా మద్దతు ఇవ్వడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ దేశం కోసం ప్రచారం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్న వారిని బీజేపీ నేతలు, మంత్రులు ప్రోత్సహిస్తున్నారనడానికి ప్రధాని మోడీ తీరే నిదర్శనమన్న వాదనలు వినిపించాయి. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల కంటే మత రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలకు ఇది బలం చేకూరుస్తోందన్న విషయాన్ని విశ్లేషకులు చెప్తున్నారు.





కామెంట్లు (0)