Magazines

శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండా ఒప్పందమా?

16 నిమిషాల క్రితం

agreement without
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

కాప్‌ 31 ముసాయిదాను అంగీకరింబోమని

తేల్చి చెప్పిన పలు సభ్య దేశాలు

పేద, వర్ధమాన దేశాలకు ఆర్థిక సాయంపై స్పష్టత లేదంటూ అసంతృప్తి

అంటాల్యా : టర్కీలోని అంటాల్యాలో జరిగిన వాతావరణ సదస్సు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. శిలాజ ఇంధనాల ప్రస్తావనే లేకుండా వాతావరణ భవిష్యత్తుపై ఒప్పందం రూపొందించడం ఏమిటని యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, వర్థమాన దేశాలు నిలదీశాయి. ఆ ఒప్పందాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాయి. ఈయూ తరఫున ఐర్లాండ్‌ పర్యావరణ మంత్రి డారగ్‌ ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ప్రతిపాదిత ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదని విమర్శించారు. 'సైన్స్‌కు స్పందించని నిర్ణయాన్ని మేము ఆమోదించం. అంతర్జాతీయ హామీలకు, చేపట్టాల్సిన చర్యలకు మధ్య అంతరాన్ని మరింత పెంచే ప్రమాదం ఉన్న నిర్ణయాన్ని అంగీకరించం. ఇందులో శిలాజ ఇంధనాల ప్రస్తావనే లేదు' అని మండిపడ్దారు.

130 సభ్య దేశాలు డిమాండ్‌ చేసినా...

వాతావరణ సదస్సు శుక్రవారమే ముగియాల్సి ఉన్నప్పటికీ ముసాయిదా ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దానిని ఆదివారం వరకూ పొడిగించారు. ఇప్పటి వరకూ జరిగిన వాతావరణ సదస్సుల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైనది. అయినప్పటికీ సదస్సుకు అధ్యక్షత వహించిన టర్కీ, ఆస్ట్రేలియాలు సంయుక్తంగా రూపొందించిన 'అంటాల్యా ఒప్పందం'పై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. సభ్య దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను విద్యుదీకరించాలని, వాతావరణ ప్రభావాలకు లోనయ్యే పేద దేశాలకు సంపన్న దేశాలు సాయం చేయాలని అంటాల్యా ఒప్పందం పిలుపు ఇచ్చినప్పటికీ శిలాజ ఇంధనాలకు దూరం కావాలని మాత్రం చెప్పలేకపోయింది. 130 సభ్య దేశాలు డిమాండ్‌ చేసినప్పటికీ ఈ విషయంలో అంగీకారం కుదరలేదు. పైగా కార్బన్‌ కాప్చర్‌-స్టోరేజ్‌ (సీసీయస్‌) సాంకేతికతపై ఒప్పందంలో చేర్చిన వివాదాస్పద నిబంధన శిలాజ ఇంధనాలను శాశ్వతం చేస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

చమురు ఉత్పత్తి దేశాల ఒత్తిడే కారణం

అయితే కొన్ని అంశాలపై సభ్య దేశాల మధ్య అంగీకారం కుదరడంతో సదస్సు పూర్తిగా విఫలం కాకుండా టర్కీ, ఆస్ట్రేలియా దేశాలు చూడగలిగాయి. 'మేము మా వంతు కృషి చేశాం. నిబంధనలను ఎవరి పైనా రుద్దలేదు. తుది హెచ్చరికలు కూడా జారీ చేయలేదు' అని కాప్‌ అధ్యక్షుడు మురత్‌ కురుమ్‌ చెప్పారు. ముసాయిదా ఒప్పందాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకించాయని, కాబట్టి దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని గుర్తించామని తెలిపారు. కాగా అంటాల్యా ఒప్పందానికి మద్దతు ఇవ్వలేమని ఈయూ, బ్రిటన్‌, పనామా-పసిఫిక్‌ ద్వీప దేశాలు, అత్యంత నిరుపేద-వర్ధమాన దేశాలు సహా పలు దేశాలు స్పష్టం చేశాయి. 2009లో కోపెన్‌హాగన్‌లో జరిగిన సదస్సు తర్వాత ప్రధాన రాజకీయ ఒప్పందం లేకుండా కాప్‌ సమావేశం ముగియడం ఇదే మొదటిసారి. శిలాజ ఇంధనాల ప్రస్తావన మొదటి ముసాయిదాలో ఉన్నప్పటికీ చమురును ఉత్పత్తి చేస్తున్న సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే తుది ముసాయిదా నుంచి దానిని తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ చర్య శిలాజ ఇంధనాలకు అనుకూలంగా 'గ్రీన్‌వాష్‌' చేయడమేనని ఈయూ ప్రతినిధులు మండిపడ్డారు.


ఆర్థిక సాయంపై హామీ ఏది?

వాతావరణ మార్పుల ప్రభావానికి తట్టుకోవడానికి పేద, వర్ధమాన దేశాలకు ఏటా 120 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందిస్తామని సంపన్న దేశాలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై కూడా సభ్య దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సదస్సు వైఫల్యంపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుత కాప్‌ విధానంలో సంస్కరణల ఆవశ్యకతను పరిశీలిస్తామని ఐరాస వాతావరణ విభాగం అధిపతి సైమల్‌ స్టీల్‌ తెలిపారు. అంటాల్యాలో అపరిష్కృతం కాని అంశాలపై చర్చించేందుకు వచ్చే ఏడాది నవంబరులో ఇథియోపియా రాజధాని అడిస్‌ అబాబాలో కాప్‌32 సదస్సు జరుగుతుంది.


శిలాజ ఇంధనాలపై తక్షణ నిషేధం తగదు : భారత్‌

శిలాజ ఇంధనాలను వెంటనే నిషేధించే కఠిన నిబంధనలను భారత్‌ వ్యతిరేకిం చింది. వర్థమాన దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సాయం అందించాల్సిం దేనని పట్టుపట్టింది. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను నిర్దిష్ట గడువు లోగా పూర్తిగా వదిలేయాలని యూరోపియన్‌ యూనియన్‌ తెచ్చిన ఒత్తిడిని భారత్‌, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలు వ్యతిరేకించాయి. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి కోసం తమకు ఇంధన భద్రత అవసరమని భారత్‌ వాదించింది. పునరుద్పాదక ఇంధన వనరులను వేగంగా పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో శిలాజ ఇంధనాల విని యోగం తప్పనిసరి అని తెలిపింది. కాప్‌31 రూపొందించిన ముసాయిదాలో శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకపోవడంపై భారత్‌ సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇతర అంశాలపై అసంతృప్తి వెలిబుచ్చింది. వర్ధమాన దేశాలకు సంపన్న దేశాలు తప్పనిసరిగా ఆర్థిక, సాంకేతిక సాయాన్ని అందించాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకోవడానికి ఉద్దేశించిన నిధుల విషయంలో తుది ముసాయిదాలో స్పష్టత లేకపోవడంపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్