హెచ్ఎండీఏ, హిందుస్థాన్ కోకా-కోలా మధ్య కీలక ఒప్పందం
సిద్దిపేట ‘అవిన్య’ ప్లాంట్ నుంచి రోజుకు 6 లక్షల లీటర్ల నీటి సరఫరా
ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 నుంచి 8 మధ్య మొక్కల పెంపకానికి వినియోగం
కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని పచ్చదనాన్ని కాపాడేందుకు, సుస్థిర నీటి యాజమాన్యాన్ని ప్రోత్స హించేందుకు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని హెచ్ఎండీఏ, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ ప్రయివేట్ లిమిటెడ్ (హెచ్‌సీసీబీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. శుద్ధి చేసిన పారిశ్రామిక వ్యర్థ జలాలను నగరంలోని గ్రీన్ బెల్ట్‌ల కోసం పునర్వినియోగించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లోని హెచ్‌సీసీబీకి చెందిన ‘అవిన్య’ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్ల శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సరఫరా చేయనున్నారు. ఈ నీటిని ఓఆర్ఆర్ వెంబడి, ముఖ్యంగా ఎగ్జిట్ 4 నుంచి ఎగ్జిట్ 8 మధ్య ఉన్న మొక్కలకు, అలాగే హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ఇతర గ్రీన్ బెల్ట్‌ల నీటి అవసరాలకు ఉపయోగిస్తారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్(ఐఏఎస్) సమక్షంలో ఈ ఎంవోయూపై సంతకాలు జరిగాయి. హెచ్ఎండీఏ తరఫున అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్, బీపీపీ ఇన్చార్జి ఓఎస్డీ రోహిత్ గోపిడి (ఐఎఫ్ఎస్), ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. హెచ్‌సీసీబీ తరఫున అవిన్య ప్లాంట్ ఫ్యాక్టరీ మేనేజర్ మాధవన్ పిళ్లై నేతృత్వంలోని ప్రతినిధి బృందం హాజరైంది.
భూగర్భ జలాలపై తగ్గనున్న భారం
ఈ సందర్భంగా హెచ్ఎండీఏ కమిషనర్ మాట్లాడుతూ.. ఇటీవలి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఇది సమయోచితమైన చర్య అని తెలిపారు. పట్టణ పచ్చదనానికి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వాడటం వల్ల భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుందని, విలువైన మంచినీటి వనరులను సంరక్షించుకోవచ్చని అన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే పట్టణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ వెంబడి ఏడాది పొడవునా గ్రీన్ బెల్ట్‌లను ఆరోగ్యంగా ఉంచడానికి నిలకడైన నీటి యాజమాన్య వ్యూహం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన నీటిని మొక్కలకు మళ్లించడం వల్ల మంచినీటి సరఫరాపై ఒత్తిడి పడకుండా, నగరంలో విస్తరిస్తున్న హరిత ప్రాంతాలను దీర్ఘకాలం పాటు సంరక్షించుకోవచ్చని వివరించారు. హెచ్‌సీసీబీ ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ హెడ్ అవినాష్ కాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం తమ అవిన్య ప్లాంట్ పరిధిని దాటి నీటి సంరక్షణ బాధ్యతను విస్తరిస్తుందని, ప్రాంతీయ పర్యావరణ పరిరక్షణలో కంపెనీ క్రియాశీలకంగా మద్దతు ఇవ్వడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం కుదర్చడంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ దోనేపూడి చక్రపాణి, ఫారెస్ట్ మేనేజర్ నిఖిల్ రెడ్డి, హెచ్‌సీసీబీ పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ కె. కృష్ణ కశ్యప్ తదితర అధికారులు సమన్వయం చేశారు.






కామెంట్లు (0)