ఇందుకు అనేక మార్గాలు అన్వేషిస్తాం
మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టడాన్ని అంగీకరించం
ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ప్రణాళికను నిరోధిస్తాం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్లను, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే బీజేపీ ప్రయత్నాన్ని ఇండియా బ్లాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకునేందుకు సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. కేంద్రంలో దశాబ్దాలపాటు అధికారాన్ని నియంత్రించగలిగే ఎన్నికల ఫలితాలను సాధించడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే పరిస్థితి మరింత తీవ్రమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, విధానాలను పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ముందుకు సాగుతున్నారని బేబీ విమర్శించారు. అసోంలో ఇప్పటికే పాక్షికంగా డీలిమిటేషన్‌ను అమలు చేశారని, దాని ఫలితంగా గెలుస్తూ వస్తున్న ఒక నియోజకవర్గాన్ని సీపీఐ(ఎం) కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. డీలిమిటేషన్ విషయంలో డీఎంకే తీసుకున్న తాజా వైఖరి కేవలం ఈ అంశానికే పరిమితమైందా? లేక ఇతర రాజకీయ కోణాలు కూడా ఉన్నాయా? అన్నది స్పష్టత రావాల్సి ఉందని బేబీ పేర్కొన్నారు. ఆ పార్టీ వైఖరిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేమని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే దానిని ఏ విధంగా అమలు చేస్తారన్నదే సీపీఐ(ఎం), వామపక్షాలు, ఇండియా బ్లాక్ ముందున్న ప్రధాన ఆందోళన అని పేర్కొన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఎం.ఎ. బేబీ అన్నారు. అయితే దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి అమలును జాప్యం చేయడం సరికాదని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి కాదనీ, 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా చట్టంలో మార్పులు చేయాలని వామపక్షాలు కోరుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే ఇంత కీలకమైన అంశంపై ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్లడం అభ్యంతరకరమని విమర్శించారు.







కామెంట్‌లు (0)