బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కుదిరిన ఎన్‌డీఏ సీట్లు పంపకం
ఎల్‌జేపీకి 29, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఎఎంలకు చెరో ఆరు స్థానాలు
సీట్ల పంపకాలపై నేడు ప్రతిపక్ష పార్టీల సమావేశం
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూరయ్యాయి. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు సీట్ల షేరింగ్ ఫార్ములా ఖరారైంది. ఆదివారం నాడిక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా సామాజిక మాధ్యమంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. అలాగే ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కూడా ఎక్స్‌లో సీట్ల పంపకం తుది ఒప్పందాన్ని ధ్రువీకరించారు. బీహార్ అసెంబ్లీ సీట్ల మొత్తం సంఖ్య 243 కాగా.. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. అలాగే భాగస్వామ్య పార్టీలైన లోక్ జన్ శక్తి (ఎల్‌జేపీ)కి 29 సీట్లు కేటాయించారు.
కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవామీ మోర్చా (హెచ్‌ఎంఎస్)కు ఆరు సీట్లు, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా నేతత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కు ఆరు సీట్లు కేటాయించారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఈ కేటాయింపులను స్వాగతించినట్లు కూటమి నేతలు వెల్లడించారు. తమ కూటమి బీహార్‌లో తిరిగి అధికారం చేపట్టగలదనే ధీమాను వ్యక్తం చేశారు. బీహార్‌లోని ఎన్‌డీఏ సీట్ల పంపకాల ఒప్పందం స్నేహపూర్వక వాతావరణంలో కుందరిందని, కూటమి విజయం కోసం బలంగా ఉందని జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజరు కుమార్ ఝా తెలిపారు. ఎన్‌డీఏ భాగస్వామ్య నేతలు ఐక్యత, పరస్పర గౌరవం స్ఫూర్తితో సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేశామని ఉపేంద్ర కుష్వాహా తెలిపారు.
వంద స్థానాల్లో ఎంఐఎం పోటీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం వంద స్థానాల్లో పోటీ చేయనుంది. ఇండియా బ్లాక్‌తో కలిసి పోటీ చేసేందుకు యత్నించిన ఎంఐఎం, ఒంటరి పోరుకు సిద్ధపడింది. దాదాపు వంద స్థానాల్లో పోటీ చేసేందుకు యోచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సంఖ్య గత ఎన్నికల్లో పోటీ చేసిన సంఖ్య కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. బీహార్‌లో మూడో పత్యామ్నాయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ తెలిపారు.
నేడు ప్రతిపక్ష ఇండియా బ్లాక్ చర్చలు
బీహార్‌లోని ప్రతిపక్ష ‘మహాఘట్‌బంధన్’ నేడు సీట్ల పంపకాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ వారం ఉమ్మడి మ్యానిఫెస్టోతో పాటు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్‌జేడీ, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆర్‌జేడీకి చెందిన లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ దేశ రాజధానిలో ఉన్నందున వారి నాయకత్వం సోమవారం సమావేశం కావచ్చని ఆయా వర్గాలు తెలిపాయి. అలాగే మహాఘట్‌బంధన్‌లో భాగమైన వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వీపీఐ) అధ్యక్షుడు ముకేశ్ షహాని కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ”కాంగ్రెస్ అధ్యక్షుడు బీహార్‌లోని అన్ని సంకీర్ణ భాగస్వామ్య పార్టీలతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు తాము బలంగా ఉన్నాయని భావిస్తున్న కొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిర్ణయించడానికి తుది చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు గత రెండు రోజులుగా బీహార్‌లోని అన్ని రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.
ఆర్‌జేడీ, కాంగ్రెస్ నాయకత్వాల మధ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయని, సోమవారం రెండు ప్రధాన పార్టీల నాయకులు కూడా సమావేశం కావచ్చని ఆయన అన్నారు. ” మహాఘట్‌బంధన్” లో కొంతమంది కొత్త భాగస్వాములకు సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. సీట్ల పంపకాలలో కూడా వారిని సర్దుబాటు చేసుకోవాలి” అని అన్నారు. ”రాబోయే రెండు, మూడు రోజుల్లో అన్ని సీట్లను ఖరారు చేసి ప్రకటిస్తాం” అని ఆయన అన్నారు. గత బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో విజయం సాధించగా, ఆర్‌జేడీ 144 స్థానాల్లో పోటీ చేసి 75 స్థానాల్లో విజయం సాధించింది. షెడ్యూల్ ప్రకారం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6, 11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.