Saturday, November 22, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ ఆదేశాలకు జీ హుజూర్‌

ట్రంప్‌ ఆదేశాలకు జీ హుజూర్‌

- Advertisement -

తలొగ్గిన మోడీ సర్కార్‌
ఆగిన రష్యా చమురు దిగుమతులు
నిలిపివేసినట్టు రిలయన్స్‌ ప్రకటన
ఇరాన్‌ ఆయిల్‌ దిగుమతులపై ట్రంప్‌ కన్నెర్ర


న్యూఢిల్లీ :
ట్రంప్‌ ఆంక్షలకు మోడీ సర్కార్‌ జీ హుజూర్‌ అంటోంది. యూఎస్‌ పెట్టిన డెడ్‌లైన్‌కు భారత్‌ తలొగ్గింది. ఈ నేపథ్యంలో రష్యన్‌ చమురు దిగుమతులను నిలిపివేసినట్టు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ పేర్కొంది. గుజరాత్‌లోని రిఫైనరీ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (సెజ్‌) జామ్‌నగర్‌లో ఉన్న తమ ఎగుమతి ఆధారిత రిఫైనరీలో నవంబర్‌ 20 నుంచి రష్యన్‌ ముడి చమురు దిగుమతులను ఆపేసినట్టు పేర్కొంది. రష్యా చమురుపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) విధించిన తీవ్ర ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 1 నుంచి తమ జామ్‌నగర్‌ సెజ్‌ రిఫైనరీ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ఇంధన ఉత్పత్తులు రష్యాయేతర ముడి చమురును ఉపయోగించి తయారు చేయబడతాయని పేర్కొంది. అయితే.. నవంబర్‌ 20 తర్వాత వచ్చే ఏవైనా రష్యన్‌ చమురు కార్గోలు దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన రిఫైనరీకి మళ్లించబడతాయని పేర్కొంది. రిలయన్స్‌ ఎగుమతులలో యూరప్‌ దేశాలు 28 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రిలయన్స్‌ వాస్తవానికి రష్యన్‌ రాస్నెఫ్ట్‌తో 25 సంవత్సరాల వాణిజ్య ఒప్పందం కలిగి ఉన్నప్పటికీ అమెరికా, ఈయూ ఆంక్షలతో దీన్ని ముందే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. భారతదేశం రష్యా నుంచి రోజుకు 17-18 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుండగా.. ఇందులో దాదాపు సగం రిలయన్స్‌ ఒక్క సంస్థనే కొనుగోలు చేస్తోంది.

ఇరాన్‌ ఆయిల్‌ దిగుమతులపై ట్రంప్‌ కన్నెర్ర
ఇరాన్‌తో చమురు వ్యాపారంపై అమెరికా ఇటీవల విధించిన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న కంపెనీల్లో భారత్‌కు చెందినవి కూడా ఉన్నాయి. అమెరికా విదేశాంగ శాఖ మొత్తం 17 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన టిఆర్‌6 పెట్రో కంపెనీ, ఆర్‌ఎన్‌ షిప్‌ మేనేజ్మెంట్‌ సంస్థలతో పాటు కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో టిఆర్‌6 పెట్రో ఇండియా అక్టోబర్‌ 2024, జూన్‌ 2025 మధ్య ఇరాన్‌ నుంచి 80 లక్షల డాలర్లకు పైగా విలువైన బిటుమెన్‌ను దిగుమతి చేసుకున్నట్టు సమాచారం. ఇది మహారాష్ట్ర కేంద్రంగా పని చేస్తోంది. దీనితో పాటు భారతీయ పౌరులైన జైర్‌ హుస్సేన్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ సయ్యద్‌, జుల్ఫికర్‌ హుస్సేన్‌ రిజ్వీ సయ్యద్‌ కూడా ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. అమెరికా ప్రభుత్వం ఇరాన్‌ ముడి చమురును వివిధ దేశాలకు సరఫరా చేయకుండా అడ్డుకొనేందుకు పలు సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రయివేటు ఎయిర్‌లైన్స్‌, మహార్‌ఎయిర్‌, యాజ్‌డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్వేస్‌పై కూడా ట్రంప్‌ ఆంక్షలు విధించారు. ఈ విమానయాన సంస్థలు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ)తో సన్నిహితంగా పని చేస్తున్నాయని యూఎస్‌ ఆరోపిస్తోంది. అమెరికా ఏకపక్ష ఆంక్షల వల్ల ఇరాన్‌ ఆర్థిక ఒత్తిడిలో పడిపోయే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -