నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి,
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, మిజోరాం, జార్ఖండ్, ఒడిశా అసెంబ్లీతోపాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో కలిసి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఏర్పాట్లపై వివరించారు. ఈనెల 13న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుందన్నారు. కోట్ల విజయబాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో 21 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 22న నామినేషన్లను పరిశీలిస్తామని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 చివరి తేదని తెలిపారు. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. 16తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 139 లోకేషన్స్‌లో, 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 38 మంది సెక్టార్ అధికారులతోపాటు 2400 పోలీస్ ఇతర శాఖలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, వీవీ ప్యాట్ యంత్రాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ యంత్రాలను ఇప్పటికే పరిశీలించామన్నారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు (ఇపీఐసీ)తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ప్యాన్ కార్డు, పెన్షన్ పత్రం వంటి గుర్తింపు పత్రాలతో ఓటు వేయొచ్చని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమకు ఉన్న క్రిమినల్ నేపథ్య వివరాలను పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటించడం తప్పనిసరని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫేక్ న్యూస్‌లను వైరల్ చేయొద్దని, ఏదైనా ఉంటే నిర్థారించుకుని వార్తలను ప్రసారం చేయాలని అన్నారు.
వెపన్స్ డిపాజిట్ చేయాలి : హైదరాబాద్ సీపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే కేసులు తప్పవన్నారు. ఎన్‌బీడబ్య్లూ కేసులపై స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. పాతనేరస్థులు, రౌడీషీటర్లపై దృష్టిసారిస్తామని, వెపెన్స్ ఉంటే డిపాజిట్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ ఎక్బాల్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ షెడ్యూల్
నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 13
నామినేషన్లకు తుది గడువు : అక్టోబర్ 21
నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 22
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు : అక్టోబర్ 24
పోలింగ్ తేదీ : నవంబర్ 11
ఓట్ల లెక్కింపు : నవంబర్ 14
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES